ఇన్వెస్టర్ల సంపద రూ.11.30 లక్షల కోట్లు డౌన్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సృష్టించిన టారిఫ్‌ల కల్లోలం ప్రభావంతో ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు ఇన్వెస్టర్లు రూ.11.30 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. నెల ప్రారంభం నుంచి సెన్సెక్స్ సుమారుగా 2% నష్టపోయింది. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ ఇంత కల్లోలం ఎదుర్కొనడం ఇదే ప్రథమం. ట్రంప్ ఈ నెల రెండో తేదీన ప్రకటించిన ప్రతీకార సుంకాల కారణంగా ప్రపంచంలో చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం చెలరేగవచ్చుననే భయాలు మార్కెట్‌కు పెనుఘాతంగా పరిణమించాయి. ఏప్రిల్ 2వ తేదీ నుంచి సెన్సెక్స్ 1460.18 పాయింట్లు నష్టపోగా ఇన్వెస్టర్ల సంపద రూ.11,30,627.09 కోట్లు కరిగిపోయి రూ.4,01,67,468.51 కోట్ల వద్ద (4.66 లక్షల కోట్ల డాలర్లు) స్థిరపడింది. ఏప్రిల్ రెండో తేదీన సుంకాల విధింపు ప్రకటనతో కల్లోలం రేపిన ట్రంప్ వాటిని 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ఈ నెల 11వ తేదీన ప్రకటించారు. దీంతో మార్కెట్ తిరిగి పుంజుకుని గత శుక్రవారం 2% మేరకు లాభపడింది. ప్రపంచంలోని రెండు భారీ ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విస్తృత నష్టాన్ని కలిగిస్తాయన్న భయాలు ఇన్వెస్టర్లలో చెలరేగాయి. ప్రపంచ మార్కెట్లలోని పరిణామాలు, అస్థిరతలు భారత మార్కెట్‌కు ముప్పే అయినప్పటికీ ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకోగల అంతర్గత బలం, దేశీయ కార్పొరేట్ల ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు మార్కెట్‌కు శక్తిని అందిస్తాయని మాస్టర్ కాపిటల్ సర్వీసెస్ పరిశోధన, అడ్వైజరీ విభాగం ఎవిపి విష్ణుకాంత్ ఉపాధ్యాయ అన్నారు.
కొత్త ఆర్థిక సంవత్సరాన్ని మార్కెట్ భారీ కుదుపుతో ప్రారంభించింది. ట్రంప్ సుంకాల పోటుతో ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా నష్టపోవడం ఇందుకు కారణం. ప్రపంచ మార్కెట్లతో పోల్చితే మన మార్కెట్ కాస్తంత మెరుగ్గానే నిలదొక్కుకుంది. ఈ ఏడాది వృద్ధిరేటు ఎలా ఉండవచ్చు, మార్కెట్ నడక ఎలా ఉండవచ్చుననేది వాణిజ్య యుద్ధం ఏ రూపం తీసుకుంటుందన్న దానిపై ఆధారపడి ఉంటుంది.
- సతీశ్ చంద్ర ఆలూరి, లెమన్ మార్కెట్స్ డెస్క్ అనలిస్ట్
8 రోజుల్లో ఐదు సెలవులు
ఈ నెలలో కేవలం 5 రోజుల వ్యవధిలో మార్కెట్‌కు రెండు సెలవులు వచ్చాయి. మరో సెలవు వారాంతంలో వస్తోంది. ఏప్రిల్ 10న మహావీర్ జయంతి సెలవు కాగా 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్ పని చేయలేదు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు. ఒక్క వారంలోనే రెండు సెలవులు వచ్చాయి. ఇవి కాకుండా వారాంతపు సెలవులు రెండు ఉండనే ఉన్నాయి.
No comments:
Post a Comment