Tuesday, April 7, 2020

చారిత్ర‌క లాభాల్లో స్టాక్ మార్కెట్‌

ప్ర‌పంచ మార్కెట్ల‌కు దీటుగా భారీ ర్యాలీ
క్విటీ మార్కెట్ల న‌డ‌క అక్ష‌రాలా వైకుంఠ‌పాళి ఆట‌ను త‌ల‌పిస్తోంది. ఒక రోజు భారీగా ప‌త‌నం కావ‌డం, మ‌రో రోజు అద్భుత‌మైన లాభాలు ఆర్జించ‌డం వంటివి ఆ ఆట‌లో పాము, నిచ్చెన‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. మంగ‌ళ‌వారంనాడు (ఏప్రిల్ 7, 2020) స్టాక్ మార్కెట్లు క‌నివిని ఎరుగ‌ని ర్యాలీలో ప‌రుగులు తీసి చారిత్రక లాభాలు న‌మోదు చేశాయి. స్టాక్ ఇండెక్స్ లు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద లాభాలు న‌మోదు చేశాయి. ఒక‌ప‌క్క మ‌హావీర్ జ‌యంతి, గుడ్ ఫ్రైడే కార‌ణంగా మార్కెట్ కు రెండు రోజులు సెల‌వులుండ‌డంతో కేవ‌లం మూడే ప‌నిదినాలున్న వారంలో కూడా మార్కెట్ ప‌రుగులు తీసి రికార్డు లాభాలు న‌మోదు చేయ‌డం అత్యంత అరుదైన విష‌యం. సాధార‌ణంగా ఇలాంటి ప‌రిమిత ప‌నిదినాలున్న  వారాల్లో ఇన్వెస్ట‌ర్లు ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. అందుకు భిన్నంగా సాగిన ఈ ర్యాలీలో సెన్సెక్స్ 2476.26 పాయింట్లు లాభ‌ప‌డి 30067.21 పాయింట్ల‌కు దూసుకుపోగా నిఫ్టీ 708.40 పాయింట్లు లాభ‌ప‌డి 8792.20 పాయింట్ల‌కు దూసుకుపోయింది.2009 మే 18 త‌ర్వాత ఒక రోజులు ఇండెక్స్ లు భారీ లాభాలు న‌మోదు చేయ‌డం ఇదే ప్ర‌థమం. అలాగే భార‌త స్టాక్ మార్కెట్ చ‌రిత్ర‌లో కూడా సెన్సెక్స్, నిఫ్టీ ఒక రోజులో సాధించిన గ‌రిష్ఠ లాభం ఇదే. ఈ ర్యాలీ అందించిన ఊతంలో మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు, బిఎస్ఇలోని ప‌లు విభాగాల సూచీలు కూడా మంచి లాభాల‌తో ముగిశాయి. క‌రోనా వ్యాధి ప్ర‌బ‌లంగా వ్యాపించిన దేశాల్లో కేసుల సంఖ్య గ‌రిష్ఠ స్థాయిల‌కు చేరిపోయింద‌ని, ఇంక త‌గ్గుముఖం ప‌డుతుంద‌న్న ఆశ‌ల న‌డుమ ప్ర‌పంచ మార్కెట్ల‌లో ఏర్ప‌డిన ర్యాలీ భార‌త మార్కెట్ ను చారిత్ర‌క లాభాల బాట‌లో న‌డిపించింది. క‌రోనా కాటుకు విల‌విల‌లాడుతున్న రంగాల‌ను ఆదుకునేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం రెండో ప్యాకేజి ప్ర‌క‌టించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ద‌న్న వార్త‌లు ప్ర‌ధానంగా భార‌త మార్కెట్ కు ఉత్తేజం అందించాయి. 
- ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి కూడా అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో 49 పైస‌లు పెరిగి 75.64కి వెళ్లింది.
- అంత‌ర్జాతీచంగా మార్కెట్ల‌న్నీ మంచి లాభాల‌తోనే ముగిశాయి. వాల్ స్ర్టీట్ లాభాలు అందించిన ఉత్తేజంతో షాంఘై, హాంకాంగ్‌, టోక్యో, సియోల్ మార్కెట్లు కూడా రెండు శాతానికి పైగా లాభాలు న‌మోదు చేయ‌గా యూరోపియ‌న్ ఎక్స్చేంజిలు 4 శాతం మేర‌కు లాభ‌ప‌డ్డాయి.
రూ.7.71 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన ఇన్వెస్ట‌ర్ల సంప‌ద‌
మార్కెట్ లో ఏర్ప‌డిన ఈ క‌నివిని ఎరుగ‌ని ర్యాలీలో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద ఒక్క రోజులోనే రూ.7.71 ల‌క్ష‌ల కోట్లు పెరిగింది.బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.7,71,388.02 కోట్లు పెరిగి రూ.1,16,38,099.98 కోట్ల‌కు చేరింది. ఈ ర్యాలీలో సెన్సెక్స్ లోని 30 షేర్లు మంచి లాభాలు ఆర్జించాయి. 14 షేర్లు 10 శాతానికి పైబ‌డి లాభ‌ప‌డ్డాయి. ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ 22 శాతం లాభంతో అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా యాక్సిస్ బ్యాంక్‌, మ‌హీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్‌, హెచ్ యుఎల్‌, మారుతి, హెచ్ సిఎల్ టెక్ భారీ లాభాల‌తో ముగిశాయి.  
-------------------------------------
సెన్సెక్స్ సాధించిన భారీ లాభాలు
టాప్ 10 వ‌రుస‌క్ర‌మంలో...
 
2020 ఏప్రిల్ 7           2476.26
2009 మే 18             2110.79
2019 సెప్టెంబ‌ర్ 20     1921.15
2020 మార్చి 25        1861.75
2020 మార్చి 20        1627.73
2019 మే 20             1421.90
2020 మార్చి 13        1325.34
2008 జ‌న‌వ‌రి 25       1139.92
2019 సెప్టెంబ‌ర్ 23     1075.41
2008 మార్చి 25         928.09    

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...