Sunday, April 5, 2020

ఇన్వెస్ట‌ర్లూ త‌స్మాత్ జాగ్ర‌త‌

క‌రోనా కాటు పైనే అంద‌రి దృష్టి
భారీ ఆటుపోట్ల‌కు ఆస్కారం

ఈ వారంలో రెండు సెల‌వు దినాలున్నందు వ‌ల్ల ఈక్విటీ మార్కెట్లు మూడు రోజులే ప‌ని చేస్తాయి. ఇన్వెస్ట‌ర్లు ఈ వారంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని నిపుణులు, మార్కెట్ పండితులు సూచిస్తున్నారు. పైగా ఒక వారం మంచి ర్యాలీని సాధించిన భార‌త ఈక్విటీ ఇండెక్స్ లు గ‌త వారంలో మళ్లీ భారీ న‌ష్టాలు న‌మోదు చేశాయి. అంత‌ర్జాతీయ బ‌ల‌హీన‌త‌ల నేప‌థ్యంలో అమ్మ‌కాల ఒత్తిడి పెర‌గ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఇంక  ఈ వారానికి వ‌స్తే ప్ర‌పంచంలోను, దేశంలోను కూడా క‌రోనా వ్యాప్తి ధోర‌ణులే మార్కెట్ క‌ద‌లిక‌ల‌ను నిర్దేశించ‌వ‌చ్చు. అందులోనూ రెండు రోజులు సెల‌వులు కావ‌డం, మూడే ట్రేడింగ్ రోజులున్న కార‌ణంగా ఆటుపోట్లు భారీగా ఉండే ఆస్కారం ఉన్న‌ద‌న్న‌ది త‌ల‌పండిన మార్కెట్ విశ్లేష‌కుల అంచ‌నా. సోమ‌వారం "మ‌హావీర్ జ‌యంతి", శుక్ర‌వారం "గుడ్ ఫ్రైడే" కార‌ణంగా మార్కెట్ల‌కు సెల‌వు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 50 వేల‌కు పైగా ప్రాణాల‌ను బ‌లి తీసుకున్న కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ యావ‌త్తు తిరోగ‌మ‌నంలో ప‌డిపోయింది. ఆ ప్ర‌భావం వ‌ల్ల భార‌త జిడిపి వృద్ధి రేటు కూడా ఈ ఏడాది 2 శాత‌మే ఉండ‌వ‌చ్చున‌ని ఫిచ్ రేటింగ్స్ తాజాగా అంచ‌నా వేసింది. మూడు ద‌శాబ్దాల క్రితం స‌ర‌ళీకృత ఆర్థిక విధానాల శ‌కంలోకి ప్ర‌వేశించిన అనంత‌రం న‌మోద‌య్యే క‌నిష్ఠ వృద్ధి ఇదే అవుతుంది. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ అయితే తీవ్ర‌మైన తిరోగ‌మ‌నంలోనే ప‌డుతుంద‌ని ఫిచ్ తేల్చింది. ఇప్ప‌టికే యూరోపియ‌న్ దేశాలు, అమెరికా తిరోగ‌మ‌నంలోకి ప్ర‌వేశించాయంటున్నారు. ఇవ‌న్నీ గ‌త వారం ఈక్విటీ మార్కెట్ పై భారీ ప్ర‌భావం చూపించాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 2224.64 పాయింట్లు (7.46%) న‌ష్ట‌పోయింది. వాస్త‌వానికి 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో స్వాగ‌తం ప‌లికాయి. మార్చి 31న 1203 పాయింట్ల లాభాన్ని సాధించిన సెన్సెక్స్ ట్రెండ్ రివ‌ర్స్ అయింది. ఏప్రిల్ 1న సెన్సెక్స్ 1203 పాయింట్లు న‌ష్ట‌పోగా నిఫ్టీ 344 పాయింట్లు న‌ష్ట‌పోయింది. ఈ రివ‌ర్స‌ల్ వారం మొత్తం కొన‌సాగింది. ఈ న‌ష్టంతో ఇన్వెస్ట‌ర్ సంప‌ద రూ.3,20,633.05 కోట్లు న‌ష్ట‌పోయి రూ.1,10,28,123.54 కోట్ల‌కు ప‌డిపోయింది. 

No comments:

Post a Comment

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...