సోమవారం లాభపడిన ఈక్విటీ ఇండెక్స్ లు
ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ లలో కరోనా మరణాల సంఖ్య తగ్గడం, దక్షిణ కొరియా, ఆస్ర్టేలియల్లో కొత్త కేసుల నమోదు సంఖ్య తగ్గడం వంటి పాజిటివ్ వార్తల నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు సోమవారం మంచి లాభాలు ఆర్జించాయి. ప్రపంచవ్యాప్తంగా మరణాలు పెరిగాయన్న ప్రతికూల వార్తల కన్నా మొత్తం మీద కరోనా కట్టడి వ్యూహాలు మంచి ఫలితం ఇస్తున్నట్టు సాగుతున్న అంచనాల నడుమ ఇన్వెస్టర్లు సానుకూల వార్తల వైపే మొగ్గు చూపారు. యూరోపియన్ మార్కెట్లు లాభాల బాట పట్టడం అమెరికా మార్కెట్ పై కూడా ప్రభావం చూపింది. ప్రారంభ సెషన్ లో డోజోన్స్ ఇండస్ర్టియల్ యావరేజ్ 5%, ఎస్ అండ్ పి గ్లోబల్ 4.8%, నాస్ డాక్ 4.7 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.
చమురు ధరలు తగ్గుదల
నానాటికీ పడిపోతున్న ఆయిల్ ధరల్లో స్థిరత్వం తీసుకురావడం లక్ష్యంగా ఒపెక్, నాన్ ఒపెక్ దేశాల మధ్య జరగాల్సిన టెలి కాన్ఫరెన్స్ విభేదాల కారణంగా గురువారానికి వాయిదా పడింది. రోజుకి ప్రతిపాదిత కోటి బ్యారెళ్ల చమురు ఉత్పత్తి కోత ఏ మాత్రం చాలదన్న అభిప్రాయాల నడుమ బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 33.36 డాలర్లు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ ధర 27.32 డాలర్ల వద్ద కదలాడుతోంది.
పీకల్లోతు తిరోగమనంలో ఫ్రాన్స్
ఫ్రాన్స్ సమీప చరిత్రలో కనివిని ఎరుగని తిరోగమనంలో పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1945లో ఏర్పడిన -2.2% ప్రతికూల వృద్ధి కన్నా తీవ్రత అధికంగా ఉండవచ్చునంటున్నారు. కరోనా వల్ల ఫ్రాన్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక క్షీణతకు ఇంతకన్నా దర్పణం ఏదీ ఉండదని విశ్లేషకులంటున్నారు. కోవిడ్-19ని కట్టడి చేసే వ్యూహంలో భాగంగా ప్రకటించిన లాక్ డౌన్ ప్రభావం వల్ల ఆర్థిక కార్యకలాపాలు 35 శాతం పడిపోయాయని గణాంకాల శాఖ లెక్కలు తెలుపుతున్నాయి. భారీ పరిశ్రమలు, నిర్మాణం, సేవల వంటి కీలక రంగాలు ఈ సంక్షుభిత వాతావరణంలో ఘోరంగా దెబ్బ తిన్నాయి.
జపాన్ లో ఎమర్జెన్సీ?
కరోనా వైరస్ కట్టడి వ్యూహంలో భాగంగా జపాన్ పలు ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించే యోచనలో ఉంది. ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఈ ప్రకటన వెలువడవచ్చునంటున్నారు. టోక్యో, ఒసాకా వంటి ప్రధాన నగరాల్లో కోవిడ్-19 కేసులు గత కొద్ది గంటల్లో భారీగా పెరగడం ఈ చర్యకు దోహదపడిందంటున్నారు. కాగా లాక్ డౌన్ వల్ల ఇప్పటికే నష్టపోయిన వ్యాపార సంస్థలను ఆదుకునేందుకు జపాన్ ప్రధాని షింజో అబే లక్ష కోట్ల డాలర్ల విలువ గల ఉద్దీపనలు ప్రకటించే ఆస్కారం సైతం ఉన్నదని ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయనే సూచన ప్రాయంగా ఈ విషయం చెప్పారు. ఎమర్జెన్సీ ప్రకటించినట్టయితే రాష్ర్టాల గవర్నర్లకు ప్రజలందరినీ నిర్బంధంగా ఇళ్లకే పరిమితం కావాలని కోరే అధికారం దత్తం అవుతుంది. ఎవరైనా ఆజ్ఞలను ధిక్కరిస్తే వారికి కఠిన దండనలు విధించే అధికారం సైతం లభిస్తుంది.
No comments:
Post a Comment