Monday, November 9, 2020

భార‌త స్టాక్ ఇండెక్స్ ల‌ కొత్త రికార్డు

 గ‌త కొద్ది కాలంగా క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల గ‌రిష్ఠ స్థాయిల నుంచి భారీగా దిగ‌జారిన స్టాక్ మార్కెట్ సూచీలు గ‌త వారం రోజులుగా ప‌రుగులు తీశాయి. అమెరికా అధ్య‌క్షుడుగా జో బైడెన్ ఎన్నిక కావ‌డం, వాణిజ్య బంధాలు ప‌టిష్ఠం అవుతాయ‌న్న ఇన్వెస్ట‌ర్ల ఆశ‌లు, బైడెన్ నాయ‌క‌త్వంలో అమెరికా ప్ర‌భుత్వం మ‌రో ఉద్దీప‌న ప్ర‌క‌టిస్తుంద‌న్న వార్త‌లు వెర‌సి ఇన్వెస్ట‌ర్ల‌ను ఉత్సాహంలో ముంచెత్తాయి. రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌పంచ మార్కెట్ల‌లో ఏర్ప‌డిన ర్యాలీ భార‌త మార్కెట్ కు కూడా విస్త‌రించ‌డంతో భార‌త మార్కెట్ సూచీలు కొత్త రికార్డుల‌కు నిచ్చెన‌లు వేశాయి. వ‌రుస‌గా ఆరో సెష‌న్ లో కూడా చిందులు తొక్కిన స్టాక్ మార్కెట్ అద్భుత‌మైన లాభాలు న‌మోదు చేసింది. దీని ప్ర‌భావంతో సెన్సెక్స్ 704.37 పాయింట్ల ర్యాలీ సాధించి జీవిత కాల గ‌రిష్ఠ స్థాయి 42597.43 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడేలో  సెన్సెక్స్ 42645.33 పాయింట్ల‌ను తాకింది. జ‌న‌వ‌రి 14వ తేదీన న‌మోదైన 41952.63 పాయింట్ల రికార్డు దీనితో చ‌రిత్ర పుట‌ల్లోకి చేరింది. ఎన్ఎస్ సి ప్ర‌ధాన సూచీ నిఫ్టీ 197.50 పాయింట్ల మేర‌కు దూసుకుపోయి 12461.05 వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడే గ‌రిష్ఠ స్థాయి 12474.05. దేశీయ ప‌రిణామాలు కూడా స్టాక్ మార్కెట్ ర్యాలీకి దోహ‌ద‌ప‌డ్డాయి. క్యు2 ఆర్థిక ఫ‌లితాల అనంత‌రం వ్యాపార వాతావ‌ర‌ణం మెరుగుప‌డ‌డం,  రుణ మార‌టోరియం ముగిసిపోవ‌డం, ఆర్థిక కార్య‌క‌లాపాలు పున‌రుజ్జీవం సాధించాయ‌న్న సంకేతాల కార‌ణంగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్ స్టాక్ లు అద్భుత‌మైన ర్యాలీ సాధించాయి. బిఎస్ఇ టెలికాం, బ్యాంకెక్స్, విద్యుత్‌, మెట‌ల్‌, ఫైనాన్స్, క‌న్స్యూమ‌ర్ డ్యూర‌బుల్స్, టెక్నాల‌జీ ఇండెక్స్ లు 4 శాతం మేర‌కు లాభ‌ప‌డ్డాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు కూడా 1 శాతానికి పైగా లాభ‌ప‌డ్డాయి.

- సెన్సెక్స్ షేర్ల‌లో ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ గ‌రిష్ఠంగా 4.95 శాతం లాభ‌ప‌డింది. ఐసిఐసిఐబ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, ప‌వ‌ర్ గ్రిడ్‌, టాటా స్టీల్‌, టైటాన్‌, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ కూడా లాభ‌ప‌డ్డాయి.  

- ఎక్స్చేంజి ద‌గ్గ‌ర అందుబాటులో ఉన్న స‌మాచారం ప్ర‌కారం విదేశీ ఇన్వెస్ట‌ర్లు సోమ‌వారం రూ.4548.39 కోట్లు, శుక్ర‌వారం రూ.4869.87 కోట్ల విలువ గ‌ల షేర్లు కొనుగోలు చేశారు. 


No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...