Tuesday, May 12, 2020

రూ.20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజి

కోవిడ్ క‌ష్టాల‌కు మోదీ లేప‌నం

కోవిడ్‌-19 కాటుకు క‌కావిక‌ల‌మైపోయిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తిరిగి ప‌ట్టాల పైకి తేవ‌డం ల‌క్ష్యంగా రూ.20 ల‌క్ష‌ల కోట్ల భారీ ప్యాకేజిని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌క‌టించారు. ఇంకా ఈ ప్యాకేజి వివ‌రాలు వెల్ల‌డి కావ‌ల‌సి ఉంది. ఆర్థికమంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వ‌రుస‌గా కొన్ని రోజుల పాటు ఈ ప్యాకేజి వివ‌రాలు ప్ర‌క‌టించ‌నున్నారు. దేశంలో మూడు ద‌శ‌లుగా అమ‌లులో ఉన్న 54 రోజుల లాక్ డౌన్ ముగింపు ద‌శ‌కు చేరిన నేప‌థ్యంలో ప్ర‌ధాని దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడుతూ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స్వ‌యం సమృద్ధం చేయ‌డానికి, ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ‌మైన‌దిగా తీర్చి దిద్ద‌డానికి ఈ ప్యాకేజి దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెప్పారు. ఈ ప్యాకేజి ప‌రిమాణం జీడీపీలో 10 శాతం మేర ఉంటుందన్నారు. క‌రోనా వైర‌స్  భార‌త్ ముందు ఒక చ‌క్క‌ని అవ‌కాశం ఆవిష్క‌రించింద‌ని, దాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అందుకోవ‌డ‌మే మ‌న బాధ్య‌త అని ప్ర‌ధాని అన్నారు. లాక్ డౌన్ ప్రారంభ ద‌శ‌లో నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించిన రూ.1.7 ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక ప్యాకేజికి, ఆర్ బిఐ ప్ర‌క‌టించిన ప‌లు లిక్విడిటీ చ‌ర్య‌ల‌కు ఈ ప్యాకేజి అద‌నం అని ఆయ‌న అన్నారు. 

ఎవ‌రెవ‌రికి ఈ ప్యాకేజి లాభం...?

ఈ ప్ర‌త్యేక ప్యాకేజి భూమి, కార్మిక శ‌క్తి, చ‌ట్టాలు అన్నింటి మీద దృష్టి సారిస్తుంద‌ని ప్ర‌ధాని చెప్పారు. అలాగే వ‌ల‌స కార్మికులు, రైతులు, నిజాయ‌తీప‌రులైన ప‌న్ను చెల్లింపుదారులు, ఎంఎస్ఎంఇలు, కుటీర ప‌రిశ్ర‌మ‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు అంద‌రికీ విస్త‌రిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. 

స్వ‌యంస‌మృద్ధ భార‌త్‌కు 5 మూల స్తంభాలు


ఆత్మ‌నిభార్ భార‌త్ అభియాన్ (స్వ‌యంస‌మృద్ధ భార‌త ప్ర‌చారోద్య‌మం) ముందుకు న‌డ‌ప‌డంలో ఈ ప్యాకేజి  కీల‌కంగా నిలుస్తుంద‌ని మోదీ చెప్పారు. స్వ‌యంస‌మృద్ధ భార‌త్ కు ఐదు మూల స్తంభాల‌ని ఆయ‌న వివ‌రించారు. అవి ఆర్థిక వ్య‌వ‌స్థ‌, మౌలిక వ‌స‌తులు, సాంకేతిక‌త ఆధారంగా న‌డుస్తున్న వ్య‌వ‌స్థ‌, జ‌నాభా, డిమాండు అని చెప్పారు. సంక్షోభాన్ని అవ‌కాశంగా మ‌లుచుకోవ‌డంలోనే మ‌న స‌మ‌ర్థ‌త బ‌య‌ట‌ప‌డుతుంద‌ని, అదే స్వ‌యంస‌మృద్ధ భార‌త్ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌ధాని చెప్పారు. స్వ‌యంస‌మృద్ధ భార‌తావ‌నే ప్ర‌పంచానికి ఆనందం, స‌హ‌కారం, శాంతిని అందించ‌గ‌లుగుతుంద‌ని మోదీ చెప్పారు. 

స్వార్థ‌ప‌ర‌త్వం కాదు
స్వ‌యంస‌మృద్ధి అంటే  స్వార్థ‌ప‌ర‌త్వం కాద‌ని ప్ర‌ధాని అన్నారు. ఈ ల‌క్ష్యంతోనే ప్ర‌పంచానికి మ‌న దేశం ఔష‌ధాలు స‌ర‌ఫ‌రా చేసింద‌ని చెబుతూ కోవిడ్ తో జీవ‌న్మ‌ర‌ణ పోరాటం సాగిస్తున్న దేశాల‌కు అవి కొత్త ఆశ‌లు చిగురింప‌చేశాయ‌న్నారు. కోవిడ్ సంక్షోభం ప్రారంభ‌మ‌య్యే నాటికి మ‌న దేశంలో ఒక్క పిపిఇ కిట్ కూడా త‌యార‌య్యేది కాద‌ని, ఇప్పుడు రోజుకి రెండు ల‌క్ష‌ల కిట్లు ఉత్ప‌త్తి చేయ‌గ‌ల సామ‌ర్థ్యం సాధించింద‌ని మోదీ చెప్పారు.

------------------------------------- 

మ‌నం ప్ర‌స్తుతం కీల‌క కూడ‌లిలో ఉన్నాం. మీకు చ‌క్క‌ని అవ‌కాశం క‌ల్పిస్తున్నా అని క‌రోనా మ‌న‌కి ఒక అద్భుత‌మైన అవ‌కాశం కూడా ముందుంచింది. 21వ శ‌తాబ్దికి దీటైన శ‌క్తివంత‌మైన భార‌త్ ఆవిష్కారానికి మ‌నంద‌రం శ్ర‌మిద్దాం.
- న‌రేంద్ర‌మోదీ 
------------------------------------- 

మ‌‌రింత భిన్నంగా లాక్ డౌన్‌-4


క‌రోనా వైర‌స్ ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి  రాలేదంటూ మే 17వ తేదీతో ముగుస్తున్న మూడో విడ‌త లాక్ డౌన్ కు పొడిగింపుగా నాలుగో విడ‌త లాక్ డౌన్ కూడా ఉంటుంద‌ని మోదీ చెప్పారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న మూడు విడ‌త‌ల లాక్  డౌన్ కు ఇది భిన్నంగా ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి ప్ర‌పంచ చ‌రిత్ర‌లోనే క‌నివిని ఎరుగ‌ని రీతిలో విసిరిన స‌వాలును ఎదుర్కొనే క్ర‌మంలో అలిసిపోవ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న ఉద్బోధించారు. కోవిడ్ మొత్తం ప్ర‌పంచాన్నే స‌ర్వ‌నాశ‌నం చేసింద‌ని ఆయ‌న చెప్పారు. ఈ కీల‌క‌ స్థితిలో మ‌న‌ని మ‌నం సంర‌క్షించుకుంటూనే ముందుకు పురోగ‌మించాల్సిన అవ‌స‌రం సైతం ఉన్న‌ద‌ని ప్ర‌ధాని సూచించారు.



No comments:

Post a Comment

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...