కరోనా కట్టడిలో భాగంగా దేశంలో 54 రోజుల పాటు సాగిన లాక్ డౌన్ నుంచి మంగళవారం నుంచి భారీగా విముక్తి కలిగించినప్పటికీ కార్లలో ఎక్కేందుకు కస్టమర్లే కనిపించడంలేదని కాబ్ డ్రైవర్లు వాపోతున్నారు. రెండు నెలల విరామం అనంతరం దేశంలోని పలు నగరాల్లో కాబ్ లు నడిపేందుకు సిద్దంగా ఉన్నామని కాబ్ అగ్రిగేటింగ్ కంపెనీలు ఓలా, ఉబర్ ప్రకటించాయి. అందుకు అనుగుణంగానే ఆయా కంపెనీలకు సేవలందిస్తున్న డ్రైవర్లు కార్లతో రోడ్లెక్కారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తాము కాబ్ సేవలందించడానికి సిద్ధంగా ఉన్నా కస్టమర్లు దొరకడమే పెద్ద సవాలయిందని వారు తమ తొలి రోజు అనుభవం గురించి చెప్పారు. ప్రస్తుతానికైతే కాబ్ లకు డిమాండు చాలా తక్కువగా ఉన్నదని అగ్రిగేటర్ల ప్రతినిధి ఒకరన్నారు. విమానాశ్రయాలు, రైల్వే వంటి పలు ప్రయాణ సాధనాలతో పాటు అంతర్ రాష్ట్ర ప్రయాణాలు, పర్యాటక స్థలాలపై ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉండడంతో కాబ్ సేవలకు డిమాండు కనిపించడంలేదని పలువురు వివరించారు. దీనికి తోడు రెండు నెలల సుదీర్ఘ సమయం కార్లు బయటకు తీయకపోవడంతో చాలా కార్లు కదలడానికి మొండికేస్తున్నాయని కొందరు డ్రైవర్లంటున్నారు. కార్లకు అవసరమైన మరమ్మత్తులు , సర్వీసింగ్ చేయించిన తర్వాతనే తిరిగి రోడ్ల పైకి రావడం సురక్షితం అనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడవచ్చునన్న ఆశ వారిలో మిణుకుమిణుకుమంటోంది. కాని ఓలా, ఉబర్ సంస్థలు మాత్రం కాబ్ ల డిమాండుపై ఎలాంటి కామెంట్ చేయలేదు.
సంపూర్ణ భద్రతకు భరోసా
ప్రయాణికులు, డ్రైవర్ పార్టనర్ల సంపూర్ణ భద్రతకు తాము చర్యలు తీసుకుంటున్నట్టు ఆ సంస్థలు ప్రకటించాయి. కార్లలో శానిటైజర్లు అందుబాటులో ఉంచడం, డ్రైవర్, ప్రయాణికులు మాస్క్ ధరించడాన్ని నిర్బంధం చేయడం, ప్రతీ ఒక్క ట్రిప్ తర్వాత కారు లోపలి భాగాన్ని పూర్తిగా శానిటైజ్ చేయడం, ఒక్కో రైడ్ ఇద్దరు ప్రయాణికులకే పరిమితం చేయడం ద్వారా భౌతిక దూరం పాటించడం వంటి ఆంక్షలు అమలుపరుస్తున్నట్టు వాటి ప్రతినిధులు చెప్పారు.
No comments:
Post a Comment