కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన కల్లోలానికి భారత ఈక్విటీ మార్కెట్లలో అస్థిర పరిస్థితులు నెలకొనడం విదేశీ ఇన్వెస్టర్లకు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుత వాతావరణంలో రిస్క్ కు దూరంగా ఉండాలన్న లక్ష్యంతో భారత ఈక్విటీ మార్కెట్ నుంచి వారు తమ సొమ్ము తరలించుకుపోతున్నారు. ప్రధానంగా మార్చి త్రైమాసికంలో (జనవరి-మార్చి) 640 కోట్ల డాలర్లు (రూ.48,000 కోట్లు) తరలించుకుపోయారు. అంతకు ముందు అక్టోబర్-డిసెంబర్ త్రై్మాసికంలో వారు 630 కోట్ల డాలర్లు భారత మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు. వాస్తవానికి జనవరి (171 కోట్ల డాలర్లు), ఫిబ్రవరి (26.5 నెలల్లో కోట్ల డాలర్లు) వారు నికరంగా పెట్టుబడులే పెట్టారు. కాని ఒక్క మార్చి నెలలో వారు 840 కోట్ల డాలర్ల విలువ గల ఈక్విటీలు విక్రయించడంతో మూడు నెలల కాలంలో నికరంగా పెట్టుబడులు ఉపసంహరించిన వారుగా నమోదైపోయారు. ఏప్రిల్ నెలలో కూడా వారి అమ్మకాల జోరు యథాతథంగానే కొనసాగిందని భారత ఈక్విటీ పెట్టుబడులపై మార్నింగ్ స్టార్ రూపొందించిన నివేదికలో తెలిపింది. ఏప్రిల్ నెల మొత్తం మీద 90.4 కోట్ల విలువ గల ఈక్విటీలు విక్రయించారు.
--------------------------------------
కోవిడ్ మహమ్మారి వ్యాప్తిపై నెలకొన్న సందిగ్ధపూరిత వాతావరణం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో కల్లోలం...వెరసి వారు ఎగ్జిట్ బటన్ నొక్కడానికి దారి తీశాయి
- మార్నింగ్ స్టార్
--------------------------------------
త్రైమాసికం ప్రారంభంలోనే అప్రమత్తం
అమెరికా-చైనా వాణిజ్య పోరాటం, త్వరితంగా మారుతున్న అమెరికా-ఇరాన్ సమీకరణలు వంటి కారణాల వల్ల ఎఫ్ పిఐలు త్రైమాసికం ప్రారంభంలో అప్రమత్త వైఖరి అవలంబించారని ఆ నివేదిక తెలిపింది. అయితే కొద్ది రోజులకే ఆ ధోరణికి స్వస్తి చెప్పి వారు కొనుగోళ్లు ప్రారంభించారు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం, వడ్డీరేట్ల విషయంలో సద్దుబాటు ధోరణి అనునసరించాలన్న ఆర్ బిఐ నిర్ణయం కారణంగా వారు తిరిగి పెట్టుబడులకు మొగ్గు చూపారు. కాని మార్చిలో కరోనా రెక్కలు విప్పుతున్న సంకేతాలు వెలువడడంతో మరోసారి వారిలో రిస్క్ పట్ల విముఖత ఏర్పడింది.
ఆరేళ్ల కనిష్ఠానికి పెట్టుబడులు
2020 మార్చి చివరి నాటికి భారత ఈక్విటీ మార్కెట్ లో ఎఫ్ పిఐ పెట్టుబడుల మొత్తం విలువ 28,100 కోట్ల డాలర్లు. డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి పెట్టుబడుల మొత్తం విలువ 43,200 కోట్ల డాలర్ల కన్నా ఇది చాలా తక్కువ. ఆరు సంవత్సరాల కనిష్ఠ స్థాయి ఇది. 2014 మార్చి చివరి నాటికి భారత మార్కెట్ లో ఎఫ్ పిఐ పెట్టుబడుల మొత్తం విలువ 23,800 కోట్ల డాలర్లుగా నమోదయింది. ఆ తర్వాత వారి పెట్టుబడులు పెరుగుతూనే వచ్చాయి. తిరిగి 2020 మార్చి త్రై్మాసికంలో వారి పెట్టబడుల విలువ ఆ నాటి స్థాయి కన్నా దిగజారింది.
మే నెలలో మళ్లీ కొనుగోళ్లు
ఎఫ్ పిఐలు మే నెలలో తిరిగి నికర కొనుగోలుదారులుగా ఉన్నారని మార్నింగ్ స్టార్ గణాంకాలు తెలుపుతున్నాయి. భారత ఈక్విటీ మార్కెట్ లో ఇటీవల ఏర్పడిన కరెక్షన్, అమెరికన్ డాలర్ తో రూపాయి బలహీనపడడం వారిని పెట్టుబడులకు పురిగొల్పింది. మే నెలలో 12వ తేదీ వరకు వారు 280 కోట్ల డాలర్ల విలువ గల పెట్టుబడులు నికరంగా పెట్టారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి సుమారు రెండు నెలలుగా సాగుతున్న లాక్ డౌన్ నుంచి క్రమంగా వైదొలగడం, మరిన్ని వాణిజ్య కార్యకలాపాలకు మార్గం సుగమం చేయడం వంటి చర్యలపై ఎఫ్ పిఐల భవిష్యత్ పెట్టబడులు ఆధారపడి ఉంటాయి.
No comments:
Post a Comment