కోటక్ మహీంద్రా కేపిటల్ కంపెనీ అంచనా
2025 సంవత్సరంలో భారత ఈక్విటీ మార్కెట్లో 3500 కోట్ల డాలర్ల (రూ. 2.99 లక్షల కోట్లు) విలువ గల పబ్లిక్ ఇష్యూలు జారీ కావచ్చునని కోటక్ మహీంద్రా కేపిటల్ కంపెనీ (కెఎంసిసి) అంచనా వేసింది. 2024 సంవత్సరంలో ప్రైమరీ మార్కెట్ నుంచి కంపెనీలు సమీకరించిన 2200 కోట్ల డాలర్లతో (రూ.1.88 లక్షల కోట్లు) పోల్చితే ఇది చాలా అధికం. ఒక్క ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలోని కంపెనీలే 900 కోట్ల డాలర్ల (రూ.76,950 కోట్లు) విలువ గల పబ్లిక్ ఇష్యూలకు రంగం సిద్ధం చేసుకున్నాయి. వాటిలో హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్, అవాన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా కేపిటల్ ఉన్నాయి. 500 కోట్ల డాలర్ల (రూ.42,750 కోట్లు) ఇష్యూలతో డిజిటల్ టెక్నాలజీ కంపెనీలు తర్వాతి స్థానంలో నిలిచాయి. ఇకామ్ ఎక్స్‌ప్రెస్, ఓలా, జెప్టో, పెప్పర్ ఫ్రై వాటిలో ఉన్నాయి. కంపెనీలు జారీ చేయాలనుకుంటున్న ఐపిఓల పరిమాణం కూడా నిరంతరం పెరుగుతూ వస్తోందని, పెట్టుబడుల కోసం నిధుల సమీకరణకు ఐపీఓలే చక్కని మార్గమని కంపెనీలు భావిస్తున్నాయని అంటున్నారు. 2024 సంవత్సరంలో జారీ అయిన ఐపీఓలు లిస్టింగ్ రోజున నమోదు చేసిన ప్రీమియం సగటు 32.8 శాతం ఉన్నట్టు కెఎంసిసి తెలిపింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులకు సెకండరీ మార్కెట్ కన్నా ఐపిఓలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొంది. 2024 సంవత్సరంలో జారీ అయిన రూ.27,000 కోట్ల విలువ గల హ్యుండై భారీ ఐపిఓ విజయవంతం కావడంతో పలు బహుళజాతి సంస్థలు తమ పెట్టుబడుల విలువను సొమ్ము చేసుకునేందుకు ఐపిఓ మార్కెట్ వైపే చూస్తున్నట్టు చెబుతోంది.
No comments:
Post a Comment