1260 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
మార్కెట్లో అమ్మకాలు హోరెత్తడంతో సోమవారం ఈక్విటీ సూచీలు భారీ నష్టాలు నమోదు చేశాయి. చైనాలో కొత్తగా కనుగొన్న హెచ్ఎంపివి వైరస్ భయాలతో పాటు మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలపై నెలకొన్న అనిశ్చితి, విదేశీ నిధుల భారీ తరలింపు మార్కెట్‌ను కుంగదీశాయి. రూపాయి క్షీణత, ఆసియా మార్కెట్లలో బలహీన ధోరణి కూడా సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. దీంతో సెన్సెక్స్ 1258.12 పాయింట్ల నష్టంతో 77,964.99 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 1441.49 పాయింట్లు దిగజారి 77,781.62 వరకు కూడా క్షీణించింది. బిఎస్ఇలో లిస్టయిన షేర్లలో 3474 షేర్లు నష్టపోగా 656 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. 114 షేర్ల ధరలు ఏ మాత్రం కదలిక లేకుండా తటస్థంగా ఉండిపోయాయి. నిఫ్టీ 388.70 పాయింట్లు నష్టపోయి 23,616.05 వద్ద ముగిసింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండూ 200 డిఎంఏ కన్నా దిగువకు పడిపోయాయి. బిఎస్ఇ స్మాల్‌క్యాప్ సూచీ 3.17%, మిడ్‌క్యాప్ సూచీ 2.44% నష్టపోయాయి. బిఎస్ఇలో రంగాలవారీ సూచీలన్నీ కూడా 2.74% నుంచి 4.16% మధ్యలో నష్టపోయాయి.
రూ.10.98 లక్షల కోట్లు ఆవిరి
సోమవారం నాటి పతనంలో రూ.10.98 లక్షల కోట్ల మార్కెట్ సంపద ఆవిరైపోయింది. బిఎస్ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ ఒక్క రోజులోనే రూ.10,98,723.54 కోట్లు దిగజారి రూ.4,38,79,406.58 కోట్ల (5.11 లక్షల కోట్ల డాలర్లు) వద్ద స్థిరపడింది. శుక్రవారంనాడు విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ నుంచి రూ.4227.25 కోట్లు తరలించుకుపోయారు.
No comments:
Post a Comment