Monday, January 6, 2025

వంటింట్లో ధ‌ర‌ల మంట‌

ట‌మాటా, బంగాళాదుంప వంట‌గ‌దుల్లో మంట‌లు రేపుతున్నాయి. ఈ రెండింటి ధ‌ర‌ల కార‌ణంగా ఇళ్ల‌లో వంట వ్య‌యాలు గ‌ణ‌నీయంగా పెరిగాయ‌ని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. ఒక ప్లేట్‌ సాధార‌ణ వెజిటేరియ‌న్ ఆహారం త‌యారీ వ్య‌యం 2023 డిసెంబ‌రులో రూ.29.7 ఉండ‌గా గ‌త డిసెంబ‌రు నాటికి 6 శాతం వృద్ధితో రూ.31.6కి చేరింద‌ని తాజా నివేదిక‌లో తెలియ‌చేసింది. అయితే న‌వంబ‌రులో న‌మోదైన ధ‌ర రూ.32.7తో పోల్చితే మాత్రం కొంత త‌గ్గింది. ఆహార వ‌స్తువుల త‌యారీపై స‌గ‌టు మ‌నిషి చేసే వ్య‌యాన్ని మ‌దింపు చేసేందుకు రోటీ, రైస్‌, రేట్ పేరిట నివేదిక రూపొందించింది. ఒక ప్లేట్ నాన్ వెజిటేరియ‌న్ ఆహారం త‌యారీ వ్య‌యం 2023 డిసెంబ‌రుతో పోల్చితే 12 శాతం, న‌వంబ‌రు నెల‌తో పోల్చితే 3 శాతం పెరిగి రూ.63.3కి చేరింది. 

ధ‌ర‌ల పెరుగుద‌ల ఇలా...

ఆహార ప‌దార్థాల త‌యారీ వ్య‌యాలు ఇంత‌గా పెరిగిపోవ‌డానికి కార‌ణం వివ‌రిస్తూ డిసెంబ‌రు నెల‌లో ట‌మాటా ధ‌ర 24 శాతం పెరిగి కిలో రూ.47 ప‌లికింద‌ని, బంగాళాదుంప ధ‌ర 50 శాతం పెరిగి కిలో రూ.36 ప‌లికింద‌ని పేర్కొంది. వెజిట‌బుల్ ఆయిల్‌పై ప్ర‌భుత్వం దిగుమ‌తి సుంకం పెంచిన కార‌ణంగా ధ‌ర 16 శాతం పెరిగిన‌ట్టు తెలిపింది. అయితే ఎల్‌పిజి ధ‌ర వార్షిక ప్రాతిప‌దిక‌న 11 శాతం త‌గ్గ‌డం వ‌ల్ల ఆహార త‌యారీ వ్య‌యంపై ప్ర‌భావం కొంత మేర‌కు అదుపులో ఉన్న‌ట్టు పేర్కొంది. అయితే న‌వంబ‌రు నెల‌తో పోల్చితే మార్కెట్లో స‌ర‌ఫ‌రా పెరిగిన కార‌ణంగా ట‌మాటా ధ‌ర 12 శాతం త‌గ్గిన‌ట్టు తెలిపింది. ఇది ఆహార ప‌దార్ధాల త‌యారీపై వ్య‌యం మూడు శాతం త‌గ్గ‌డానికి దోహ‌ద‌ప‌డింద‌ని పేర్కొంది. అలాగే ఉల్లి ధ‌ర 12 శాతం, బంగాళాదుంప ధ‌ర 2 శాతం త‌గ్గింది. ఇవ‌న్నీ వెజిట‌బుల్ ఆహార ధ‌ర‌ల పెరుగుద‌ల స్థాయి త‌క్కువ‌గా ఉండ‌డానికి దోహ‌ద‌ప‌డ్డాయి. ఇక నాన్ వెజిటేరియ‌న్ ఆహారాల విష‌యానికి వ‌స్తే బ్రాయిల‌ర్ ధ‌ర 20 శాతం పెరిగింది. దేశంలో శీత గాలుల తీవ్ర‌త ప్ర‌భావం బ్రాయిల‌ర్‌ ధ‌ర‌ల‌పై 11 శాతం ఉండ‌గా వివాహాలు, పండుగ‌ల సీజ‌న్ ప్ర‌భావం 3 శాతం ఉంది. 

No comments:

Post a Comment

కుంభ‌మేళాలో ఆర్తి సంగ్ర‌హ్ ఉచిత పంపిణీ

చేతులు క‌లిపిన అదానీ గ్రూప్‌, గీతా ప్రెస్‌ గీతా ప్రెస్ స‌హ‌కారంలో అదానీ గ్రూప్ కుంభ‌మేళాలో "ఆర్తి సంగ్ర‌హ్" ప్ర‌తుల‌ని భ‌క్తుల‌కి ...