కొత్త రికార్డు రూ.82,900 నమోదు
దేశంలో బంగారం ధరలు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జనవరి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం (99.9 స్వచ్ఛత) ధర రూ.170 పెరిగి రూ.82,900 పలికింది. అలాగే 99.5 స్వచ్ఛత గల ఆభరణాల బంగారం సైతం రూ.170 పెరిగి రూ.82,330కి చేరింది. బంగారం ధరలు పెరుగుతూ ఉండడం వరుసగా ఇది ఏడో రోజు. కాగా ఏడాది కాలంలో 10 గ్రాముల బంగారం ధర 32.17% అంటే రూ.20,180 పెరిగింది. గత ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన 10 గ్రాముల బంగారం ధర రూ.62,720 పలుకగా నేడది రూ.82,900 స్థాయిని తాకింది. కాగా గత ఏడు రోజుల కాలంలోనూ బంగారం ధరలు రూ.2320 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన పటిష్ఠ సంకేతాలతో పాటు దేశీయంగా ఆభరణాల వర్తకులు, రిటైలర్ల నుంచి కూడా డిమాండు పెరగడం ధరలకు రెక్కలు రావడానికి కారణమని బులియన్ ట్రేడర్లంటున్నారు. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు హెచ్చరికలు కూడా బుల్లిష్ ధోరణికి దోహదపడుతున్నాయి.
No comments:
Post a Comment