- కొత్త శిఖరాల్లో ఈక్విటీ సూచీలు
- మూడేళ్ల కాలంలో ఒక్క రోజులో అతి పెద్ద లాభం నమోదు
ఎగ్జిట్ పోల్ ఫలితాలు మార్కెట్లో ఉత్సాహం ఉరకలెత్తించాయి. బుల్ చెలరేగిపోయింది. ఎన్‌డిఏకి భారీ మెజారిటీతో కేంద్రంలో మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పడం పాజిటివ్ సెంటిమెంట్‌ను పెంచింది. ఈక్విటీ సూచీలు 3 శాతానికి పైబడి లాభపడ్డాయి. దీనికి తోడు శుక్రవారంనాడు విడుదలైన జిడిపి గణాంకాలు కూడా మార్కెట్ జోరుకు సహాయపడ్డాయి. అటు జిడిపి గణాంకాలు, ఇటు ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి మార్కెట్ మంచి జోరు మీద ఉంది. 2000 పాయింట్లకు పైగా గ్యాప్ అప్‌తో ప్రారంభమైన సెన్సెక్స్ ప్రారంభం నుంచి చివరి వరకు అదే జోరును కొనసాగిస్తూ చివరికి 2507.47 పాయింట్ల లాభంతో 76,468.78 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్ఠ స్థాయిలో క్లోజయింది. సెన్సెక్స్ లోని 30 షేర్లలో 25 లాభాలతో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2777.58 పాయింట్లు లాభపడి సరికొత్త ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 76,738.89 పాయింట్లను నమోదు చేసింది. ఎన్ఎస్ఇ ప్రధాన సూచీ నిఫ్టీ కూడా అదే జోరును కొనసాగించింది. ఇంట్రాడేలో 808 పాయింట్ల మేరకు లాభపడి జీవితకాల గరిష్ఠ స్థాయి 23,338.70 పాయింట్లను తాకిన నిఫ్టీ చివరికి 733.20 పాయింట్ల లాభంతో మరో జీవితకాల గరిష్ఠ స్థాయి 23,263.90 వద్ద ముగిసింది. మూడు సంవత్సరాల కాలవ్యవధిలో ఈక్విటీ మార్కెట్ సూచీలు ఒక్క రోజులో ఇంత భారీగా లాభపడడం ఇదే ప్రథమం. 2021 ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ ప్రతిపాదన అనంతరం ఈక్విటీ సూచీలు సుమారు 5 శాతం లాభపడిన తర్వాత ఒకే రోజులో ఇంత భారీగా లాభపడడం జరిగింది. 2019 మే 20వ తేదీన కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రభావం వల్ల ఈక్విటీ సూచీలు 3 శాతం పైబడి లాభపడడం యాదృచ్ఛికమే.
- ఇక రంగాలవారీగా చూస్తే పిఎస్‌యు, యుటిలిటీస్, ఆయిల్, ఎనర్జీ, యంత్రపరికరాలు, రియల్టీ సూచీలు 8 శాతానికి పైగా లాభపడ్డాయి.
- బ్లూచిప్ షేర్లయిన ఆర్ఐఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ మంచి ర్యాలీ సాధించి సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠ స్థాయిలకు దూసుకుపోవడంలో తమ వంతు పాత్ర పోషించాయి.
- అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కూడా మంచి ర్యాలీ సాధించడంతో వాటి ఉమ్మడి మార్కెట్ విలువ రూ.19.42 లక్షల కోట్లకు దూసుకుపోయింది. అదానీ పవర్ 16 శాతం, అదానీ పోర్ట్స్ 10 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 6 శాతం లాభపడ్డాయి.
- సెన్సెక్స్ లో భారీగా లాభపడిన షేర్లలో ఎన్‌టిపిసి, ఎస్‌బిఐ, పవర్ గ్రిడ్ (ఒక్కోటి 9 శాతం వంతున లాభం), ఎల్ అండ్ టి, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, అల్ర్టాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా స్టీల్ ఉన్నాయి.
మార్కెట్ సంపదలోనూ రికార్డు
ఈ ర్యాలీతో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ (ఇన్వెస్టర్ల సంపద) రూ.13,78,630.40 కోట్లు పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.4,25,91,511.54 కోట్లకు (5.13 లక్షల కోట్ల అమెరికన్ డాలర్లు) దూసుకుపోయింది.
No comments:
Post a Comment