Sunday, July 21, 2024

నిర్మ‌ల‌మ్మ రికార్డు


ర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మంగ‌ళ‌వారం 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి పూర్తి స్థాయి బ‌డ్జెట్‌ను మంగ‌ళ‌వారం అంటే జూలై 23వ తేదీన ప్ర‌తిపాదిస్తున్నారు. ఈ బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న ద్వారా ఆమె వ‌రుస‌గా ఏడు బ‌డ్జెట్లు ప్ర‌తిపాదించిన రికార్డు నెల‌కొల్ప‌బోతున్నారు. మాజీ ప్ర‌ధాని మొరార్జీ దేశాయ్ రికార్డు ఇక్క‌డితో చ‌రిత్ర పుట‌ల్లోకి జారుకోనుంది. వ‌చ్చే నెల‌లో 65 సంవ‌త్స‌రాల వ‌య‌సు పూర్తి కానున్న నిర్మ‌లా సీతారామ‌న్ 2019 సంవ‌త్స‌రంలో ఆర్థిక మంత్రిగా నియ‌మితుల‌య్యారు. ఆ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన అనంత‌రం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఆమెను ఆర్థిక మంత్రిగా త‌న కేబినెట్‌లో నియ‌మించుకున్నారు. స్వ‌తంత్ర భార‌త చ‌రిత్ర‌లో పూర్తి కాలం ప‌ని చేయ‌డానికి నియ‌మితురాలైన తొలి మ‌హిళా ఆర్థిక‌మంత్రిగా నిర్మ‌ల నాడు చ‌రిత్ర సృష్టించారు. అప్ప‌టి నుంచి ఆమె ఆరు పూర్తి స్థాయి బ‌డ్జెట్లు, ఒక తాత్కాలిక బ‌డ్జెట్ (2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు) క‌లిపి ఏడు బ‌డ్జెట్లు  ప్ర‌తిపాదించారు. మంగ‌ళ‌వారం ప్ర‌తిపాదించ‌నున్న‌ది ఏడో పూర్తి స్థాయి బ‌డ్జెట్‌. గ‌తంలో మొరార్జీ దేశాయ్ 1959 నుంచి 1964 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాలంలో ఐదు పూర్తి స్థాయి బ‌డ్జెట్లు, ఒక తాత్కాలిక బ‌డ్జెట్ ప్ర‌తిపాదించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఒక ఆర్థిక‌మంత్రికి ఇదే అత్య‌ధిక బ‌డ్జెట్ల రికార్డ్. ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది రెండు బ‌డ్జెట్లను మ‌నం చూడ‌బోతున్నాం. ఒక‌టి ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌తిపాదించిన తాత్కాలిక బ‌డ్జెట్ కాగా రెండోది మంగ‌ళ‌వారం ప్ర‌తిపాదించ‌నున్న‌ది ఏడో పూర్తి స్థాయి బ‌డ్జెట్‌. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు అప్ప‌టికి అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం పూర్తి స్థాయి బ‌డ్జెట్ ప్ర‌తిపాదించ‌కూడ‌దు అన్న నియ‌మావ‌ళిని అనుస‌రించి ఫిబ్ర‌వ‌రిలో ఆమె మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌కే ప‌రిమితం కావ‌ల‌సి వ‌చ్చింది. కాగా మంగ‌ళ‌వారం ప్ర‌తిపాదించ‌బోయే బ‌డ్జెట్  మోదీ 3.0 ప్ర‌భుత్వ తొలి బ‌డ్జెట్ కావ‌డం విశేషం.


బ‌డ్జెట్లు-రికార్డులు

తొలి బ‌డ్జెట్ :  స్వ‌తంత్ర భార‌త చ‌రిత్ర‌లో తొలి బ‌డ్జెట్‌ను 1947 న‌వంబ‌రు 26వ తేదీన అప్ప‌టి కేంద్ర ఆర్థిక‌మంత్రి ఆర్‌.కె.ష‌ణ్ముగం చెట్టి ప్ర‌తిపాదించారు.


అత్య‌ధిక బ‌డ్జెట్ల రికార్డు :   స్వ‌తంత్ర భార‌త చ‌రిత్ర‌లో అత్య‌ధిక బ‌డ్జెట్ల‌ను ప్ర‌తిపాదించిన ఘ‌న‌త ఇప్ప‌టివ‌ర‌కు మాజీ ప్ర‌ధాని మొరార్జీ దేశాయ్‌కే ఉంది. ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ, ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్ర్తి ఇద్దరి ప‌ద‌వీ కాలంలోనూ ఆర్థిక మంత్రిగా ప‌ని చేసిన దేశాయ్ మొత్తం 10 బ‌డ్జెట్లు ప్ర‌తిపాదించారు. 1959 ఫిబ్ర‌వ‌రి 28న ఆయ‌న తొలి బ‌డ్జెట్ ప్ర‌తిపాదించారు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు సంవ‌త్స‌రాలు పూర్తి స్థాయి బ‌డ్జెట్ ప్ర‌తిపాదించిన అనంత‌రం 1962లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు తాత్కాలిక బ‌డ్జెట్ ప్ర‌తిపాదించారు. ఆ త‌ర్వాత రెండు పూర్తి స్థాయి బ‌డ్జెట్లు ప్ర‌తిపాదించారు. 1967లో మ‌రో తాత్కాలిక బ‌డ్జెట్ ప్ర‌తిపాదించిన అనంత‌రం 1967, 1968, 1969 సంవ‌త్స‌రాల్లో వ‌రుస‌గా మూడు పూర్తి స్థాయి బ‌డ్జెట్ల‌ను ప్ర‌తిపాదించారు. ఆ ర‌కంగా మొత్తం ఆయ‌న 10 బ‌డ్జెట్లు ప్ర‌తిపాదించారు.


రెండో అత్య‌ధిక బ‌డ్జెట్ల రికార్డు :  మాజీ ఆర్థిక‌మంత్రి పి.చిదంబ‌రం మొత్తం 9 బ‌డ్జెట్లు ప్ర‌తిపాదించారు. హెచ్‌.డి.దేవెగౌడ్ ప్ర‌ధానిగా ఉండ‌గా 1996 మార్చి 19వ తేదీన యుపిఏ ప్ర‌భుత్వ ఆర్థిక‌మంత్రి హోదాలో చిదంబ‌రం తొలి బ‌డ్జెట్‌ను 1996 మార్చి 19వ తేదీన ప్ర‌తిపాదించారు. ఆ త‌ర్వాతి సంవ‌త్స‌రంలో కూడా ఆయ‌న మ‌రో బ‌డ్జెట్ ప్ర‌తిపాదించిన అనంత‌రం 2004 సంవ‌త్స‌రంలో కాంగ్రెస్ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వ హ‌యాంలో తిరిగి ఆర్థిక‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆ విడ‌త‌లో ఆయ‌న 2004 నుంచి 2008 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాలంలో వ‌రుస‌గా ఐదు బ‌డ్జెట్లు ప్ర‌తిపాదించారు. త‌దుప‌రి కొద్ది కాలం పాటు ర‌క్ష‌ణ మంత్రిగా ప‌ని చేసిన అనంత‌రం తిరిగి ఆర్థిక మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన చిదంబ‌రం 2013, 2014 సంవ‌త్స‌రాల్లో రెండు బ‌డ్జెట్లు ప్ర‌తిపాదించారు.


మూడో అత్య‌ధిక బ‌డ్జెట్ల రికార్డు :   ప్ర‌ణబ్ ముఖ‌ర్జీ ఆర్థిక‌మంత్రి హోదాలో ఎనిమిది బ‌డ్జెట్లు ప్ర‌తిపాదించారు. తొలి విడ‌త‌లో 1982, 1983, 1984 సంవ‌త్స‌రాల్లో మూడు బ‌డ్జెట్లు ప్ర‌తిపాదించారు. 2009లో కాంగ్రెస్ నాయ‌క‌త్వంలోని యుపిఏ ప్ర‌భుత్వంలో ఆర్థిక‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప్ర‌ణ‌బ్ దా 2009 నుంచి 2013 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాలంలో వ‌రుస‌గా ఐదు బ‌డ్జెట్లు ప్ర‌తిపాదించారు.


మ‌న్మోహ‌న్ సింగ్ :  ఆర్థిక మంత్రిగా మ‌న్మోహ‌న్ సింగ్ 1991 నుంచి 1995 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాలంలో ప్ర‌ధాని  పి.వి.న‌ర‌సింహారావు హ‌యాంలో ఐదు వ‌రుస బ‌డ్జెట్లు ప్ర‌తిపాదించారు.  


సుదీర్ఘ బ‌డ్జెట్ ప్ర‌సంగం :  ఇప్ప‌టి వ‌ర‌కు చ‌రిత్ర‌లో సుదీర్ఘ స‌మ‌యం బ‌డ్జెట్ ప్ర‌సంగం చేసిన రికార్డు నిర్మ‌లా సీతారామ‌న్ పేరు మీద ఉంది. 2020 ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన ఆమె బ‌డ్జెట్ ప్ర‌సంగం 2 గంట‌ల 40 నిముషాల పాటు సాగింది. ఆ ఏడాది ఇంకా రెండు పేజీలు మిగిలి ఉండ‌గా ఆమె ఆ రెండు పేజీల‌ను ఆమె చ‌ద‌వ‌కుండా వ‌దిలివేశారు. 


అతి త‌క్కువ నిడివి ప్ర‌సంగం : 1977లో అప్ప‌టి ఆర్థిక‌మంత్రి హీరూభాయ్ ముల్జీభాయ్ ప‌టేల్ ప్ర‌తిపాదించిన తాత్కాలిక బ‌డ్జెట్ ప్ర‌సంగం అతి చిన్న బ‌డ్జెట్ ప్ర‌సంగంగా చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. ఆ ప్ర‌సంగం కేవ‌లం 800 ప‌దాల్లో పూర్త‌యిపోయింది. 


బ‌డ్జెట్  ప్ర‌తిపాద‌న స‌మ‌యం :    దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన నాటి నుంచి సాంప్ర‌దాయికంగా కేంద్ర ప్ర‌భుత్వ బ‌డ్జెట్‌ను ప్ర‌తీ ఏడాది ఫిబ్ర‌వ‌రి చివ‌రి రోజు సాయంత్రం 5 గంట‌ల‌కు ప్ర‌తిపాదించే వారు. లండ‌న్‌లో కాలానికి అనుగుణంగా అటు లండ‌న్‌లోను, ఇటు భార‌త్‌లోను ఒకేసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం కోసం వ‌ల‌స పాల‌కులు నిర్ణ‌యించిన‌ స‌మ‌యం ఇది. బ్రిటిష్ వేస‌వి కాలానికి నాలుగున్న‌ర గంట‌ల ముందు భార‌త కాల‌మానం ఉంటుంది. ఆ ర‌కంగా చూసిన‌ట్ట‌యితే సాయంత్రం 5 గంట‌లంటే యుకెలో ప‌గ‌టి స‌మ‌యం అయ్యేది. భార‌త‌దేశం స్వాతంత్ర్యం పొందిన త‌ర్వాత కూడా అదే సాంప్ర‌దాయాన్ని కొన‌సాగించ‌డంలో అర్ధం లేద‌ని భావించిన ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి 1999 సంవ‌త్స‌రంలో బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న స‌మ‌యాన్ని ఉద‌యం 11 గంట‌ల‌కి మార్చారు. ఆ ఏడాది అప్ప‌టి ఆర్థిక‌మంత్రి య‌శ్వంత్ సింగ్ ఉద‌యం 11 గంట‌ల‌కి తొలిసారిగా బ‌డ్జెట్ ప్ర‌తిపాదించారు. అప్ప‌టి నుంచి ఆర్థిక మంత్రులంద‌రికీ ఉద‌యం 11 గంట‌ల‌కే బ‌డ్జెట్ ప్ర‌తిపాదించ‌డం సాంప్ర‌దాయంగా మారింది.  


బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న తేదీ : 2017 సంవ‌త్స‌రంలో బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న తేదీని కూడా ఫిబ్ర‌వ‌రి చివ‌రి రోజుకి బ‌దులుగా ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీకి మార్చారు. అలా ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన బ‌డ్జెట్  ప్ర‌తిపాదించిన‌ట్ట‌యితే మార్చి నెల చివ‌రి నాటికి పార్ల‌మెంట‌రీ అనుమ‌తుల ప్ర‌క్రియ అంతా పూర్తి చేసుకుని ఆర్థిక సంవ‌త్స‌రం తొలి రోజు ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి అమ‌లును ప్రారంభించ‌వ‌చ్చున‌ని భావించి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఫిబ్ర‌వ‌రి చివ‌రి రోజు బ‌డ్జెట్  ప్ర‌తిపాదించిన స‌మ‌యంలో పార్ల‌మెంట‌రీ అనుమ‌తుల ప్ర‌క్రియ పూర్త‌యి అది పూర్తి స్థాయిలో అమ‌లులోకి రావ‌డానికి మే లేదా జూన్ వ‌ర‌కు స‌మ‌యం ప‌ట్టేది. ఫిబ్ర‌వ‌రి 1కి మార్చ‌డంతో ఇప్పుడు బ‌డ్జెట్ అమ‌లు ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచే మొద‌ల‌వుతోంది. 

No comments:

Post a Comment

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...