"భారత్ రాబోయే నాలుగేళ్లలో... అంటే 2030 నాటికి "ఎగువ మధ్యాదాయ దేశంగా రూపాంతరం చెందనుంది. తద్వారా చైనా, ఇండోనీసియాల సరసన స్థానం సంపాదించుకోనుంది" అని ఎస్‌బీఐ రీసెర్చ్ తాజా నివేదికలో తెలిపింది. అంతేకాదు 2028 కన్నా ముందుగానే ప్రపంచంలోని మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనున్నట్టు కూడా తెలిపింది.
డాలర్ మారకంలో స్థూల జాతీయాదాయం (జిఎన్ఐ) ఆధారంగా దేశాలను అల్పాదాయ దేశాలు, దిగువ మధ్యాదాయ దేశాలు, ఎగువ మధ్యాదాయ దేశాలు, అధికాదాయ దేశాలుగా ప్రపంచ బ్యాంక్ వర్గీకరిస్తుంది. 1990 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు 218 దేశాలను వర్గీకరించగా వాటిలో 51 దేశాలు అల్పాదాయ దేశాల కోవలో ఉన్నాయి. మిగతా వాటిలో 56 దిగువ మధ్యాదాయ దేశాలు, 29 ఎగువ మధ్యాదాయ దేశాలు, 39 అధికాదాయ దేశాలు ఉన్నాయి. 2024 సంవత్సరం నాటి గణాంకాల ప్రకారం అల్పాదాయ దేశాలు 26 ఉండగా 50 దిగువ మధ్యాదాయ వర్గీకరణలోకి, 54 ఎగువ మధ్యాదాయ వర్గీకరణలోకి, 87 అధికాదాయ వర్గీకరణలోకి వచ్చాయి. సంవత్సరాలు గడుస్తున్న కొద్ది దేశాలు ఆదాయ నిచ్చెనలో ఒక్కో మెట్టు పైకి వెళ్తున్నాయని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.
ఆరు దశాబ్దాలు పట్టింది...
భారత్ 2007 సంవత్సరంలో దిగువ మధ్యాదాయ దేశంగా మారింది. అంటే అల్పాదాయ దేశం వర్గీకరణ నుంచి దిగువ మధ్యాదాయ దేశం వర్గీకరణలోకి రావడానికి 60 సంవత్సరాలు పట్టింది. భారత తలసరి జిఎన్ఐ 1962 సంవత్సరంలో 90 డాలర్లుండగా 2007 నాటికి 910 డాలర్లకు పెరిగింది. అంటే జిఎన్ఐలో 5.3% వార్షిక వృద్ధి సాధిస్తూ వచ్చింది. అలాగే భారత్ లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 60 సంవత్సరాలు పట్టిందని ఎస్‌బిఐ రీసెర్చ్ ఆ నివేదికలో తెలిపింది. ఆ తర్వాత 2014 సంవత్సరంలో 2 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారింది. ఇందుకు ఏడేళ్లు పట్టింది. తదుపరి 2021లో 3 లక్షల కోట్ల డాలర్లకు, 2025లో 4 లక్షల కోట్ల డాలర్లకు ఎదిగింది. 3 నుంచి 4 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు పట్టిన సమయం నాలుగు సంవత్సరాలే కావడం విశేషం. కాగా మరో రెండేళ్లలో భారత్ 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారనుందని పేర్కొంది.
1000 డాలర్ల తలసరి ఆదాయానికి 62 సంవత్సరాలు
భారత తలసరి ఆదాయం 1000 డాలర్లకు చేరడానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 62 సంవత్సరాలు పట్టింది. 2009 సంవత్సరంలో భారత్ ఈ ఘనత సాధించింది. తలసరి ఆదాయం 2019 సంవత్సరంలో 2000 డాలర్లకు చేరింది. అంటే ఈ స్థాయికి వచ్చేందుకు 10 సంవత్సరాలు పట్టింది. మరో ఏడేళ్లలో తలసరి ఆదాయం 3000 డాలర్లకు చేరింది. మరో నాలుగు సంవత్సరాల కాలంలో అంటే 2030 నాటికి ఇది 4000 డాలర్లవుతుందని ఎస్‌బిఐ రీసెర్చ్ అంచనా వేసింది.
తలసరి జిఎన్ఐలో 7.5% వృద్ధి అవసరం
"వికసిత్ భారత్ విజన్ ప్రకారం 2047 నాటికి 13,936 డాలర్ల తలసరి జిఎన్ఐతో అధికాదాయ వర్గీకరణలోకి చేరాలంటే భారత్ ఏటా తలసరి జిఎస్ఐలో 7.5% వృద్ధిని సాధించడం అవసరం. గత 23 సంవత్సరాల కాలంలో (2001-2024) తలసరి జిఎన్ఐలో వృద్ధి 8.3% ఉన్ననేపథ్యంలో ఈ లక్ష్యం చేరడం సాధ్యంగానే కనిపిస్తోంది" అని ఆ నివేదిక పేర్కొంది. అయితే అప్పటికి అధికాదాయ దేశంగా పరిగణనలోకి వచ్చేందుకు తలసరి ఆదాయ పరిమితి కూడా పెరుగుతుందంటున్నారు. ఈ కోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని అప్పటికి అధికాదాయ దేశంగా మారాలంటే తలసరి జిఎన్ఐ పరిమితి 18,000 డాలర్లవుతుందనుకుంటే రాబోయే 23 సంవత్సరాల కాలంలో భారత్ తలసరి జిఎస్ఐ 8.9% పెరగాల్సి ఉంటుందని ఆ నివేదిక అంచనా వేసింది. ఈ లక్ష్యం చేరాలంటే భారత్ సంస్కరణల అజెండాను కొనసాగించక తప్పదని తేల్చి చెప్పింది.
No comments:
Post a Comment