Tuesday, April 14, 2026

భార‌తీయుల ఇళ్లు... "బంగారం ఖ‌జానా"లు


భార‌తీయుల ఇళ్లు బంగారం ఖ‌జానాలుగా మారాయి. ఇటీవ‌ల అంత‌ర్జాతీయ, దేశీయ మార్కెట్ల‌లో బంగారం ధ‌ర‌లు చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయిల‌కు చేరిన‌ప్ప‌టికీ భార‌తీయుల‌కు బంగారంపై మోజు మాత్రం త‌గ్గ‌లేదు.భార‌తీయ గృహ‌స్థుల ద‌గ్గ‌ర ఉన్న బంగారం నిల్వ‌లు ప్ర‌పంచంలోని 10 అగ్ర‌శ్రేణి కేంద్రీయ బ్యాంకుల వ‌ద్ద ఉన్న నిల్వ‌ల క‌న్నా అధికంగా ఉన్న‌ట్టు గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. అసోచాం తాజా నివేదిక‌లో ఈ విష‌యం వెల్ల‌డించింది. భార‌త‌దేశ ప్ర‌స్తుతం బంగారం నిల్వ‌ల విష‌యంలో  ప్ర‌పంచంలోనే 8వ స్థానంలో ఉన్న‌ద‌ని వ‌ర‌ల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డ‌బ్ల్యుజిసి) చెబుతోంది. భార‌త్ వ‌ద్ద ప్ర‌స్తుతం 880 ట‌న్నుల బంగారం నిల్వ‌లున్నాయ‌ని, ప్ర‌పంచంలో అత్యంత సంప‌న్న దేశం అమెరికా వ‌ద్ద ఉన్న బంగారం నిల్వ‌ల్లో ఇది ప‌దింట ఒక‌టో వంతు క‌న్నా అధిక‌మేన‌ని తెలిపింది.  

విలువ 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు
భార‌త్ వ‌ద్ద ఉన్న బంగారం నిల్వ‌ల విలువ 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌ని ప‌లు అంచ‌నాలు తెలుపుతున్నాయి. ప్ర‌పంచంలో అతి పెద్ద‌ బంగారు ఆభ‌ర‌ణాల కొనుగోలు దేశంగా భార‌త్ నిలుస్తోంది. భార‌తీయుల ప్ర‌ధాన పెట్టుబ‌డి సాధ‌నం కూడా బంగార‌మే. గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా బార్‌లు, నాణేల రూపంలో కూడా కొనుగోళ్లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. భార‌త‌దేశంలో గృహ‌స్థుల ద‌గ్గ‌ర ఉన్న బంగారం నిల్వ‌ల విలువ అమెరికా, చైనా మిన‌హా ప్ర‌పంచంలోని ఇత‌ర ప్ర‌ధాన‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల జిడిపి క‌న్నా అధికమ‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో బంగారం ధ‌ర‌ల పెరుగుద‌ల గృహ‌స్థుల సంప‌ద‌పై అత్యంత సానుకూల ప్ర‌భావం చూపింద‌ని అంటున్నారు. దీని వ‌ల్ల బంగారం వినియోగం ఉత్తేజిత‌మై త‌యారీ సామ‌ర్థ్యాలు విస్త‌రించడంతో పాటు మ‌రింత మందికి ఉపాధి కూడా ల‌భిస్తుంది. 

ఇదే మ‌దుపుగా మారితే...
ఈ బంగారం అంతా గృహ‌స్థుల బీరువాల్లో వృధాగా మూలుగుతూ ఉండ‌డం విచారించ‌ద‌గ్గ అంశ‌మ‌ని అసోచాం అంటోంది. ఇదే బంగారాన్ని ఉత్పాత‌క కార్య‌క‌లాపాల‌కు మ‌ర‌లించిన‌ట్ట‌యితే భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ఎన్నో రెట్లు ఉత్తేజితం అవుతుంద‌ని చెబుతోంది. ఈ బంగారాన్ని మ‌దుపుగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోకి తీసుకురావ‌డం వ‌ల్ల ఆర్థిక రంగానికి ఎంతో కీల‌క‌మైన త‌యారీ, మౌలిక వ‌స‌తులు, వ్య‌వ‌సాయం వంటి రంగాల‌ను వృద్ధిప‌థంలో న‌డిపించ‌వ‌చ్చున‌న్న‌ది అసోచాం అభిప్రాయం. మొత్తం బంగారంలో 2% బంగారాన్ని ప్ర‌తీ ఏడాది ఆర్థిక‌ప‌ర‌మైన ఆస్తులుగా మార్చినా 2047 నాటికి భార‌త జిడిపికి 7.5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు జోడ‌వుతుంద‌ని నిపుణులంటున్నారు. 2047 నాటికి భార‌త జిడిపి 34 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా. దానికి ఈ 7.5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌ను జోడించిన‌ట్ట‌యితే మొత్తం జిడిపి 4.15 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుతుంద‌ని చెబుతున్నారు.

బంగారం రుణాలు రూ.24.34 ల‌క్ష‌ల కోట్లు
ఇటీవ‌ల కాలంలో దేశంలో బంగారం రుణాలు గ‌ణ‌నీయంగా పెరిగాయి. 2025-26 సంవ‌త్స‌రంలో బంగారం, ఆభ‌ర‌ణాల రుణాల విలువ రూ.24.34 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది. 

గోల్డ్ ఇటిఎఫ్‌ల‌కు ఆద‌ర‌ణ‌
ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో గోల్డ్ ఇటిఎఫ్‌ల‌లో నిధుల రాక రూ.31,561 కోట్లుగా న‌మోద‌యింది. ప్ర‌స్తుత అస్థిర‌, క‌ల్లోలిత ప్ర‌పంచంలో సుర‌క్షిత పెట్టుబ‌డి సాధ‌నంగా ప్ర‌జ‌లు బంగారానికి మొగ్గు చూప‌డ‌మే ఇందుకు కార‌ణం. గ‌త ఏడాది ఇదే త్రైమాసికంలో గోల్డ్ ఇటిఎఫ్‌ల‌లోకి రూ.5,654 కోట్ల నిక‌ర పెట్టుబ‌డులు వ‌చ్చాయి. జ‌న‌వ‌రిలో రికార్డు స్థాయిలో రూ.24,040 కోట్లు రాగా ఫిబ్ర‌వ‌రిలో రూ.5,255 కోట్లు, మార్చిలో రూ.2,266 కోట్ల నిక‌ర పెట్టుబ‌డులు వ‌చ్చాయి. 

గోల్డ్ ఇటిఎఫ్ అంటే ఏమిటి?
భౌతికంగా కాకుండా యూనిట్ల రూపంలో బంగారంలో పెట్టుబ‌డుల‌కు అవ‌కాశం క‌ల్పించేవే గోల్డ్ ఇటిఎఫ్‌లు. అంత‌ర్జాతీయ‌, దేశీయ విప‌ణిలో బంగారం ధ‌ర‌ల‌ ఆధారంగా ఈ యూనిట్ల విలువ పెరుగుతూ, త‌గ్గుతూ ఉంటుంది. సాధార‌ణంగా మ‌నం కొనే బంగారం ఆభ‌ర‌ణాలు, క‌డ్డీలు, నాణాల రూపంలో ఉంటే ఈ యూనిట్లు డీమ్యాట్ లేదా ప‌త్రాల రూపంలో ఉంటాయి. ప్ర‌తీ యూనిట్ విలువ ఒక గ్రాము బంగారంతో స‌మానం. పైగా వాటిని అత్య‌ధిక స్వ‌చ్ఛ‌త గ‌ల బంగారం ధ‌ర‌తో దీటుగా నిర్ణ‌యిస్తారు. 

No comments:

Post a Comment

భార‌తీయుల ఇళ్లు... "బంగారం ఖ‌జానా"లు

భార‌తీయుల ఇళ్లు బంగారం ఖ‌జానాలుగా మారాయి. ఇటీవ‌ల అంత‌ర్జాతీయ, దేశీయ మార్కెట్ల‌లో బంగారం ధ‌ర‌లు చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయిల‌కు చేరిన‌ప్ప‌టికీ భ...