ఏప్రిల్ వసూళ్లు రూ.2.10 లక్షల కోట్లు
దేశంలో జిఎస్‌టి వసూళ్లు కొత్త రికార్డును నమోదు చేశాయి. నూతన ఆర్థిక సంవత్సరానికి శుభారంభాన్ని అందించాయి. జిఎస్‌టి వసూళ్లు గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే 12.4 శాతం పెరిగి రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. దేశంలో జిఎస్‌టి ప్రవేశపెట్టిన తర్వాత వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మైలురాయిని చేరడం ఇదే ప్రథమం. బలమైన ఆర్థిక వృద్ధికి తోడు దేశీయ లావాదేవీలు, దిగుమతుల్లో ఏర్పడిన వృద్ధి ఇందుకు దోహదపడింది. "ఏప్రిల్ నెలలో జిఎస్‌టి వసూళ్లు కొత్త మైలురాయిని చేరాయి. రూ,2.10 లక్షల కోట్లు పరోక్ష పన్నుల రూపంలో వసూలయింది. గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఇది 12.4 శాతం అధికం. దేశీయ లావాదేవీల్లో 13.4 శాతం వృద్ధితో పాటు దిగుమతి లావాదేవీలు 8.3 శాతం పెరగడం ఇందుకు దోహదపడింది" అని ఆర్థిక శాఖ తెలిపింది. జిఎస్‌టి వసూళ్లు మార్చి నెలలో రూ.1.78 లక్షల కోట్లు కాగా గత ఏడాది ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్లు.
జిఎస్‌టి వసూళ్ల వివరాలు
సెంట్రల్ జిఎస్‌టి (సిజిఎస్‌టి) - రూ.43,846 కోట్లు
స్టేట్ జిఎస్‌టి (ఎస్‌జిఎస్‌టి) - రూ.53,538 కోట్లు
ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి (ఐజిఎస్‌టి) - రూ.99,623 కోట్లు
(దిగుమతి వస్తువులపై లెవీ రూ.37,826 కోట్లు సహా)
మొత్తం సెస్ వసూళ్లు - రూ.13,260 కోట్లు
(దిగుమతి వస్తువులపై సెస్ రూ.1008 కోట్లు సహా)
అధికారులకు ప్రశంస
ఏప్రిల్ నెలలో జిఎస్‌టి వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాటినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను శాఖ అధికారులను ప్రశంసించారు. "జిఎస్‌టి వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాటడం ప్రశంసనీయం. ఆర్థిక వ్యవస్థలో బలమైన వృద్ధితో పాటు పన్ను వసూళ్లలో సమర్థతకు ఇది గీటురాయి" అని ఆమె ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.
వ్యాపార వర్గాలు స్వచ్చందంగా పన్నులు చెల్లించే ధోరణిని అనుసరించడం; సకాలంలో ఆడిట్, పరిశీలన; పన్నుల శాఖ తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని పన్ను నిపుణులంటున్నారు. రాబోయే కాలంలో జిఎస్‌టి సంస్కరణలు మరింత వేగం పుంజుకోవచ్చునని వారు అభిప్రాయపడ్డారు.
No comments:
Post a Comment