72 సంవత్సరాల వయసులో తొలిసారి ఓటు వేస్తున్న పనగడియా
అర్వింద్ పనగడియా. వయసు 72 సంవత్సరాలు (జననం 1952 సెప్టెంబరు 30). ఆయన ప్రముఖ ఆర్థికవేత్త. కొలంబియా విశ్వవిద్యాలయంలో అర్థ శాస్ర్తంలో ప్రొఫెసర్. ప్రస్తుతం ఆయన 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలోని ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌కు తొలి వైస్ చైర్మన్‌గా 2015 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు పని చేశారు. 72 సంవత్సరాల వయసులో తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నదని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదేమిటి 72 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఓటు వేయలేదా, ఎందుకలా అనుకుంటున్నారా! నిజమే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కాని ఆయన స్వదేశంలో కన్నా అమెరికాలో ఉన్న రోజులే ఎక్కువ. ఈ కారణంగా దేశంలో ఎన్నికలు జరిగిన సమయాల్లో ఇక్కడ లేకపోవడమే ఆయన జీవితంలో ఓటు హక్కు వినియోగించుకోలేకపోవడానికి కారణం. మీరు ఇన్నాళ్లూ ఓటు హక్కు వినియోగించుకోకపోవడానికి కారణం అమెరికన్ పౌరసత్వం కలిగి ఉండడమా లేక ఎన్నికల సమయంలో దేశంలో లేకపోవడమా అన్న ప్రశ్నకు రెండోదే సరైన సమాధానమని ఆయన చెప్పారు. ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ నేడు (2024 మే 25) జరుగనుంది. ఈ సారి దేశంలో ఉన్న కారణంగా ఆయన జీవితంలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. "ప్రపంచాన్ని రెండుగా విభజించవచ్చు. ఓటు వేసిన వారు, ఓటు వేయని వారు. రేపు నేను మొదటి వర్గంలో చేరబోతున్నందుకు ఉత్సాహంగా ఉంది. జీవితంలో తొలిసారి ఓటు వేయబోతుండడం ఎంతో ఆనందంగా ఉంది" అని ఆయన తన ఎక్స్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 2012 సంవత్సరంలో కేంద్రప్రభుత్వం పనగడియాను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్‌తో సత్కరించింది.
No comments:
Post a Comment