10 గ్రాముల ధర లక్షకు చేరువలో...
ఈ ఏడాది ఇప్పటికి 23.56% వృద్ధి
ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధర చుక్కలనంటుతోంది. మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1650 పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.98,100కి చేరింది. అలాగే ఆభరణాల బంగారం ధర సైతం అంతే మొత్తంలో పెరిగి రూ.97,650 పలికింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం చెలరేగవచ్చునన్న భయాల నేపథ్యంలో ప్రజలు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయడం ఇందుకు కారణం. గత శుక్రవారంనాడు (ఏప్రిల్ 11) 10 గ్రాముల బంగారం ధర కనివిని ఎరుగని స్థాయిలో రూ.6,250 పెరిగి ఒక్క రోజు వృద్ధిలో చారిత్రక రికార్డును నమోదు చేసింది. స్థానిక మార్కెట్లలో ఒక్క రోజులో అత్యధిక పెరుగుదల నమోదయింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఇప్పటికి బంగారం రూ.18,710 (23.56%) పెరిగింది. వెండి ధర సైతం కిలో రూ.1900 పెరిగి రూ.99,400 పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజిలో కూడా గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1,984 పెరిగి 10 గ్రాములు కొత్త రికార్డు రూ.95,435 ని నమోదు చేసింది.
అంతర్జాతీయ విపణిలోనూ అదే జోరు
అంతర్జాతీయ విపణిలో కూడా ఔన్సు బంగారం ధర ఇంట్రాడేలో చారిత్రక రికార్డు 3318 డాలర్లకు తాకి ట్రేడింగ్ పూర్తయ్యే సమయానికి 3299.99 డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయంపై మార్కెట్ వర్గాలు కన్నేసి ఉంచాయని, ఈ సారి ఫెడ్ వడ్డీరేటును తగ్గించవచ్చునన్న అంచనాలు బంగారానికి డిమాండును పెంచాయని విశ్లేషకులంటున్నారు.
No comments:
Post a Comment