భారత, పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం; అమెరికా-చైనా మధ్య కుదిరిన సుంకాల సంధి సోమవారం ప్రపంచ మార్కెట్లను ఉరకలెత్తించాయి. ఆసియా, యూరప్ దేశాల మార్కెట్లతో పాటు భారత మార్కెట్ కూడా అద్భుత లాభాలు సాధించింది. కడపటి వార్తలందే సమయానికి అమెరికన్ మార్కెట్లు కూడా జోరు మీదే ఉన్నాయి. భారత మార్కెట్ సోమవారం ఉదయం నుంచి మంచి జోరు మీదనే ట్రేడయింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఒక రోజులో చారిత్రక గరిష్ఠ లాభం నమోదు చేశాయి. సెన్సెక్స్ 2975.43 పాయింట్ల లాభంతో 82429.90 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో ఈ సూచీ 3041.5 పాయింట్లు లాభపడి 82495.97 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ 916.70 పాయింట్ల లాభంతో 24924.70 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 936.80 పాయింట్లు లాభపడి 24944.80 స్థాయిని తాకింది. రెండు సూచీలు జీవితకాలంలో ఇంత భారీగా లాభపడడం ఇదే ప్రథమం. 2024 జూన్ 3వ తేదీన ఒక్క రోజులో సెన్సెక్స్ లాభపడిన 2507.45 పాయింట్లు, నిఫ్టీ లాభపడిన 733.20 పాయింట్ల రికార్డును ఈ రికార్డు చెరిపేసింది.
రూ.16 లక్షల కోట్లు లాభపడిన ఇన్వెస్టర్లు
ఈ అద్భుతమైన ర్యాలీతో దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లు ఒక్క రోజులో రూ.16,15,275.19 కోట్లు లాభపడ్డారు. బిఎస్ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.4,32,56,125.65 కోట్లకు (5.05 లక్షల కోట్ల డాలర్లు) చేరింది. నిలకడగా వస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు, మెరుగైన రిటైల్ భాగస్వామ్యం ఈ జోరుకు ఇంధనంగా నిలిచాయి.
విదేశీ మార్కెట్లలోనూ అదే జోరు...
భారత, పాక్‌ల మధ్య అవగాహన కుదిరిన నేపథ్యంలో విదేశీ మార్కెట్లు కూడా అదే జోరును ప్రదర్శించాయి. పాకిస్తాన్‌కు చెందిన కెఎస్ఇ-100 సూచీ ఒక్క రోజులోనే 9 శాతం మేరకు లాభపడింది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, షాంఘైకు చెందిన ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్ అన్నీ జోరుమీదే ఉన్నాయి.
No comments:
Post a Comment