10 గ్రాముల బంగారం ఢిల్లీలో జీవితకాల గరిష్ఠం రూ.1,13,800
ఈ ఏడాదిలో ఇప్పటికి రూ.42,300 అప్
(12వ తేదీన సవరణ)
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. శుక్రవారం (సెప్టెంబరు 12) బంగారం ధర రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల 99.9% స్వచ్ఛత గల బంగారం ధర రూ.700 పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.1,13,800 పలికింది. ఇంతకు ముందు మంగళవారం ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం ధర రూ.5080 పెరిగింది. 99.5% స్వచ్ఛత గల బంగారం ధర కూడా అదే మొత్తంలో పెరిగి రూ.1,13,300 పలికింది. ఇక వెండి ధర కిలోరూ.4,000 పెరిగి సరికొత్త రికార్డు రూ.1,32,000 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. శుక్రవారం ఔన్సు బంగారం 12.69 డాలర్లు పెరిగి 3646.69 డాలర్లు పలికింది. అయితే మంగళవారం నాటి ధర 3652.72 డాలర్ల కన్నా తక్కువగానే ఉంది.
ఏడాదిలో ఇప్పటికి 44.14% పెరుగుదల
2025 సంవత్సరంలో ఇప్పటివరకు ( సెప్టెంబరు 12) దేశంలో 10 గ్రాముల బంగారం 44.14% అంటే రూ.34,850 పెరిగింది. కిలో వెండి ధర కూడా ఇదే సమయంలో 47.16% అంటే రూ.42,300 పెరిగింది. గత ఏడాది డిసెంబరు 31 నాటికి 10 గ్రాముల బంగారం ధర దేశీయ విపణిలో రూ.78,950; కిలో వెండి ధర రూ.89,700 పలికాయి.
సురక్షిత పెట్టుబడి
ప్రపంచంలో అస్థిరతలు తీవ్రంగా ఉండడంతో పాటు గత వారం అమెరికా ప్రకటించిన కార్మిక శక్తి గణాంకాలు బలహీనంగా ఉండడం, ద్రవ్య విధానం సడలింపు ఉండవచ్చునన్న ఊహాగానాలు ఇన్వెస్టర్లను బులియన్ మార్కెట్ వైపు పరుగు తీయించాయి. ఇలాంటి ఒడిదుడుకుల సమయంలో బంగారం, వెండిపై పెట్టుబడులే సురక్షితం అన్న భావంతో బంగారం, వెండి కొనుగోలుకు పరుగులు తీశారు. డాలర్ తిరోగమనం సైతం బంగారం, వెండి ధరల పెరుగుదలకు దోహదపడింది. ఆరు కరెన్సీల బాస్కెట్‌తో డాలర్ ఇండెక్స్ 0.17% దిగజారి 97.29 వద్ద స్థిరపడింది. సెంట్రల్ బ్యాంకుల నుంచి డిమాండు పెరగడం, బంగారం ఈటీఎఫ్‌లలోకి కూడా నిధులు వెల్లువెత్తడం రికార్డు స్థాయికి ధరల పెరుగుదలకు దారి తీసిందని హెచ్‌డీఎఫ్‌సీ సెకూ్యరిటీస్ సీనియర్ కమోడిటీ అనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల కల్లోలం నేపథ్యంలో ప్రజలు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారని ఆయన చెప్పారు.
ఏడాదిలో వెండి లక్షన్నర
కిలో వెండి ధర రాబోయే ఏడాది కాలంలో రూ.1.5 లక్షలకు చేరవచ్చునని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. పారిశ్రామిక డిమాండు అధికంగా ఉండడంతో పాటు సురక్షిత పెట్టుబడి అనే నమ్మకం కూడా ఇందుకు దోహదపడనున్నట్టు పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్సు వెండి 50 డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది అన్ని రకాల పెట్టుబడి సాధనాలను తోసి రాజన్న వెండి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజిలో ఇప్పటి వరకు పెట్టుబడులపై 37% రాబడి అందించినట్టు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో కిలో వెండి ఆరు నెలల్లో రూ.1.35 లక్షలు, 12 నెలల్లో రూ.1.5 లక్షలు చేరవచ్చునని అంచనా వేసింది. ఈ ఏడాది మొత్తం ఉత్పత్తిలో పారిశ్రామిక డిమాండు 60% మేరకు ఉంటుందని అంచనా అని తెలిపింది. సౌర విద్యుత్తు, విద్యుత్ వాహనాలు, 5జి మౌలిక వసతులు వెండి డిమాండు పెరిగేందుకు కారణం కాగలవని అంచనా వేసింది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా పెట్టుబడుల వివిధీకరణలో భాగంగా వెండి కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొంది. తమ నిల్వల కోసం వెండి కొనుగోలు చేయనున్నట్టు ఇటీవల రష్యా ప్రకటించింది. ఈ రకమైన ప్రకటన చేసిన తొలి దేశం రష్యా కావడం విశేషం. వెండి కొనుగోళ్లకు రాబోయే మూడు సంవత్సరాల కాలానికి 53.5 కోట్ల డాలర్లు కేటాయించినట్టు తెలిపింది. సౌదీ అరేబియా కేంద్ర బ్యాంకు ఈ ఏడాది వెండితో అనుసంధానమైన ఎక్స్ఛేంజి ట్రేడెడ్ ఫండ్లలో 4 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. దేశీయంగా చూసినా భారత్ 2025 సంవత్సరం ప్రథమార్ధంలో 3 వేల టన్నుల వెండి దిగుమతి చేసుకుంది. పారిశ్రామిక అవసరాలతో పాటు సాధారణ ఇన్వెస్టర్ల నుంచి కూడా డిమాండు అధికంగా ఉండడం ఇందుకు కారణం.
No comments:
Post a Comment