రెడ్‌సీర్ నివేదిక
2030 నాటికి దేశ జనాభాలో 27 శాతానికి చేరనున్న యువతరం దేశంలో వ్యయాలకు చోదకశక్తిగా మారనున్నారు. వారు 1.3 లక్షల కోట్ల డాలర్ల వినియోగాన్ని శాసిస్తూ వినియోగ మార్కెట్ల దిశను నిర్దేశించనున్నట్టు రెడ్‌సీర్ స్ర్టాటజీ కన్సల్టెంట్స్ తాజా నివేదికలో తెలిపింది. వారు ప్రధానంగా అనుభవం, సుస్థిరత, డిజిటల్ సానుకూలతలపై దృష్టి సారించనున్నట్టు అంచనా వేసింది. 1997 నుంచి 2012 సంవత్సరాల మధ్య కాలంలో జన్మించిన వారు మార్కెట్ ధోరణులను ఏ విధంగా శాసించనున్నారనే అంశంపై రెడ్‌సీర్ ఆ నివేదిక ప్రచురించింది.
వారు బ్రాండ్ లేబుల్స్ మీద కాకుండా కొత్త అనుభూతులు, ఆహ్లాదంపై దృష్టి సారించనున్నట్టు తెలిపింది. బ్యూటీ, పర్సనల్ కేర్ (బిపిసి) రంగాలపై వారు అధిక ఆసక్తి ప్రదర్శిస్తూ ఉండడమే అందుకు కారణమని పేర్కొంది. 2030 నాటికి మొత్తం భారత బిపిసి మార్కెట్లో 1900 కోట్ల డాలర్ల వ్యయానికి వారే బాధ్యులవుతారని పేర్కొంది.
నివేదిక ప్రధానాంశాలు...
- ప్రతీ ఇద్దరు జెన్ జి మహిళల్లో ఒకరు తమ వద్ద ఖర్చు చేయడానికి అందుబాటులో ఉండే ఆదాయంలో 20% బిపిసి ఉత్పత్తుల పైనే ఖర్చు చేస్తారు.
- కొన్ని బ్రాండ్లపై మక్కువ ప్రదర్శించే కన్నా తమ అవసరాలు తీర్చేందుకు సహాయపడే ఉత్పత్తులకే వారు ప్రాధాన్యం ఇస్తారు.
- బ్యూటీ ధోరణులు ఇక ఏ మాత్రం మహిళలకే పరిమితం కాదు. మేకప్, వ్యక్తిగత సౌందర్య సాధనాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్న పురుషుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది.
- పురుషులు చర్మసంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చర్మసౌందర్య ఉత్పత్తుల కోసం అన్వేషణ గత ఐదేళ్లుగా 850% పెరిగింది. పురుషుల కాస్మెటాలజీ, మేక్ రంగాలు వర్థమాన రంగాలుగా మారాయి.
- ఫ్యాషన్ పరిశ్రమలో (దుస్తులు, పాదరక్షలు, యాక్సెసరీలు) సగ భాగాన్ని నవతరమే శాసిస్తుంది. రూ.1,000 లోపు ధరలోని ఫ్యాషన్ ఉత్పత్తులు వారి ప్రాధాన్య ఎంపికగా నిలుస్తాయి.
- జెన్ జి ప్రాధాన్యతల్లో మరో కీలక విభాగం ఫిట్నెస్. వారి ఆదాయాల్లో కనీసం 20% ఫిట్నెస్, స్పోర్ట్స్ ఉత్పత్తులకు కేటాయిస్తారు. ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న స్పోర్ట్స్ ఫుట్‌వేర్‌లో ప్రతీ పదింటిలో ఆరు ఉత్పత్తులు రూ.500-1000 శ్రేణిలోనివే.
- ఆరోగ్యవంతమైన ఆహారానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగా ప్రత్యామ్నాయ ప్రోటీన్ ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉంటుంది. 2024, 2025 సంవత్సరాల్లో క్విక్ కామర్స్ వేదికలపై ప్రోటీన్ ప్రత్యామ్నాయాల లిస్టింగ్‌లు 230% పెరగడమే ఇందుకు తార్కాణం. 2030 నాటికి ఫిట్నెస్, స్పోర్ట్స్ ఉత్పత్తుల వినియోగంలో4000 కోట్ల డాలర్లు జెన్ జి ద్వారానే జరుగుతాయి.

No comments:
Post a Comment