Friday, March 13, 2026

2 వారాలు-రూ.34 ల‌క్ష‌ల కోట్లు న‌ష్టం

- ప‌శ్చిమాసియా మంట‌ల్లో బూడిదైన మార్కెట్ సంప‌ద‌

గ‌త రెండు వారాలుగా ప్ర‌పంచం యావ‌త్తు ప‌శ్చిమాసియా సంక్షోభంతో అట్టుడికిపోతోంది. అందుకు దీటుగానే స్టాక్ మార్కెట్లు కూడా భారీ ఆటుపోట్ల‌కు లోనై తీవ్ర న‌ష్టాల పాల‌వుతున్నాయి. ప్ర‌పంచ మార్కెట్ల ధోర‌ణుల‌ను అనుస‌రించి భార‌త స్టాక్ మార్కెట్ కూడా రెండు వారాల్లో భారీ న‌ష్టాలు మూట‌గ‌ట్టుకుంది. శుక్ర‌వారం వారాంత‌పు రోజున ప్ర‌తికూల సంకేతాల న‌డుమ ఈక్విటీ మార్కెట్ వ‌రుస‌గా మూడో రోజు భారీ న‌ష్టాలు న‌మోదు చేసింది. ప‌శ్చిమాసియా సంక్షోభం ఇప్ప‌ట్లో ముగిసే సంకేతాలేవీ లేని నేప‌థ్యంలో ఇన్వెస్ట‌ర్లు భ‌యోత్పాతంతో అమ్మ‌కాలు సాగించారు. అంత‌ర్జాతీయ విప‌ణిలో బ్యారెల్ క్రూడాయిల్ 100 డాల‌ర్లు దాట‌డం, ద్ర‌వ్యోల్బ‌ణ ఒత్తిడులు పెరిగిపోవ‌డం, ప్ర‌పంచ ఆర్థిక స్థిర‌త్వానికి సైతం ముప్పు ఏర్ప‌డ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ తీవ్రంగా ప్ర‌భావితం అయింది. ఇన్ని స‌మ‌స్య‌ల న‌డుమ‌న శుక్ర‌వారం ఈక్విటీ మార్కెట్ పెట్టుబ‌డుల ప్ర‌ధాన సూచీ అయిన సెన్సెక్స్ ఇంట్రాడేలో 1579.82 పాయింట్లు న‌ష్ట‌పోయి 74454.60 పాయింట్ల క‌నిష్ఠ స్థాయి వ‌ర‌కు దిగ‌జారింది. చివ‌రికి1470.50 పాయింట్ల నిక‌ర న‌ష్టంతో 74563.92 వ‌ద్ద ముగిసింది. బిఎస్ఇలో లిస్ట‌యిన షేర్ల‌లో 3348 షేర్లు న‌ష్ట‌పోగా 941 షేర్లు లాభ‌ప‌డ్డాయి. 132 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా త‌ట‌స్థంగా ఉండిపోయాయి. నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్ఛేంజి ప్ర‌ధాన సూచీ ఎన్ఎస్ఇ-50 సైతం 488.05 పాయింట్లు న‌ష్ట‌పోయి 23151,10 వ‌ద్ద ముగిసింది. దీంతో ఒక్క రోజులోనే బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.10,24,181.74 కోట్లు న‌ష్ట‌పోయి రూ.4,29,82,252.27 (4.65 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు) వ‌ద్ద స్థిర‌ప‌డింది. 
- వారం మొత్తం మీద సెన్సెక్స్ 4354.98 పాయింట్లు న‌ష్ట‌పోగా నిఫ్టీ 1299.35 పాయింట్లు న‌ష్ట‌పోయింది.  
- ఫిబ్ర‌వ‌రి 27వ తేదీ నుంచి రెండు వారాల కాలంలో సెన్సెక్స్ 6723.27 పాయింట్లు న‌ష్ట‌పోయింది. 
- బిఎస్ఇలో లిస్ట‌యిన కంపెనీల మార్కెట్ విలువ రెండు వారాల వ్య‌వ‌ధిలో రూ.33,68,419 కోట్లు న‌ష్ట‌పోయింది.
- శుక్ర‌వారం నాటి ట్రేడింగ్‌లో బిఎస్ఇ స్మాల్ క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 2.48%, మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 2.87% న‌ష్ట‌పోయాయి. 
- ప్ర‌ధానంగా మెట‌ల్స్, ఆటో రంగాల షేర్లు భారీ న‌ష్టాల మూట‌గ‌ట్టుకున్నాయి. సెన్సెక్స్ షేర్ల‌లో ఎల్ అండ్ టి షేరు గ‌రిష్ఠంగా 7.52% న‌ష్ట‌పోయింది. మెట‌ల్స్ ఇండెక్స్ గ‌రిష్ఠంగా 4.83% న‌ష్ట‌పోయింది. 
- విదేశీ సంస్థాగ‌త పెట్టుబ‌డిదారులు (ఎఫ్‌పిఐ) గురువారం రూ.7049.87 కోట్ల విలువ గ‌ల షేర్లు విక్ర‌యించారు. 

No comments:

Post a Comment

2 వారాలు-రూ.34 ల‌క్ష‌ల కోట్లు న‌ష్టం

- ప‌శ్చిమాసియా మంట‌ల్లో బూడిదైన మార్కెట్ సంప‌ద‌ గ‌త రెండు వారాలుగా ప్ర‌పంచం యావ‌త్తు ప‌శ్చిమాసియా సంక్షోభంతో అట్టుడికిపోతోంది. అందుకు దీటుగా...