విమానయానం కొత్త రికార్డు
దేశీయంగా విమానయాన రంగం ఒక కొత్త రికార్డును నమోదు చేసింది. ఆదివారం అంటే 2024 ఏప్రిల్ 21వ తేదీన దేశీయంగా 4,71,751 మంది ప్రయాణికులు వివిధ గమ్యాలకు విమానాల్లో ప్రయాణించారు. ఒకే రోజులో అధిక సంఖ్యలో ప్రయాణించిన రికార్డు ఇది. కొవిడ్ ముందు ఒక రోజు ప్రయాణికుల సగటు 3,98,579తో పోల్చితే ఇది 14 శాతం అధికం. ఇప్పటివరకు ఒక రోజు అధిక ప్రయాణికుల రికార్డు 2023 ఏప్రిల్ 21వ తేదీన నమోదైన 5899 విమానాల్లో 4,28,389 మంది ప్రయాణికులు కాగా ఈ ఏప్రిల్ 21న 6128 విమానాల్లో 4,75,751 మంది ప్రయాణించి ఆ రికార్డును చెరిపేశారు. ప్రతీ రోజూ విమానయానం కొత్త శిఖరాలకు చేరుతోందని పౌర విమానయాన శాఖ ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది. స్థిరమైన విధానాలు, ఆర్థిక పురోగతి, తక్కువ వ్యయంతో ప్రయాణ సౌకర్యం కల్పించే విమానయాన సంస్థల విస్తరణ దేశీయ విమానయానానికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి-మార్చి నెలల మధ్య కాలంలో దేశీయ విమానయాన సంస్థలు వివిధ గమ్యాలకు తరలించిన ప్రయాణికుల సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 375.04 లక్షల నుంచి 391.46 లక్షలకు పెరిగినట్టు పౌరవిమానయాన రెగ్యులేటర్ డిజిసిఏ గత వారంలో ప్రకటించింది. అంటే విమాన ప్రయణికుల వృద్ధిరేటు నెలవారీగా 3.68 శాతం ఉండగా వార్షికంగా 4.38 శాతం ఉంది.
No comments:
Post a Comment