కొత్త ఆర్థిక సంవత్సరం కొత్త రికార్డులు, శుభసూచికలతో ప్రారంభమయింది. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి రోజునే స్టాక్ మార్కెట్ కొత్త రికార్డులతో ప్రారంభం కాగా ఆదివారంతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ రంగంలోని ప్రధాన కంపెనీలు రికార్డు అమ్మకాలు ప్రకటించాయి. అలాగే జిఎస్‌టి వసూళ్లు కూడా మార్చి నెలలో రెండో చారిత్రక రికార్డును నమోదు చేశాయి.
ఈక్విటీ మార్కెట్లో కొత్త రికార్డు
సర్వత్రా సానుకూల సంకేతాల నడుమ స్టాక్ మార్కెట్ నూతన ఆర్థిక సంవత్సరానికి శుభారంభాన్నిచ్చింది. ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఇంట్రాడేలో చారిత్రక గరిష్ఠ స్థాయిలు నమోదు చేసినప్పటికీ ముగింపు చారిత్రక గరిష్ఠ స్థాయిల కన్నా స్వల్పంగా దిగువన ఉంది. వరుసగా మూడో సెషన్లో కూడా లాభాలు నమోదు చేసిన సెన్సెక్స్ సోమవారం (ఏప్రిల్ 1, 2024) ఇంట్రాడేలో 603.27 పాయింట్ల లాభంతో 74254.62 పాయింట్ల చారిత్రక గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. చివరికి 363.20 పాయింట్ల లాభంతో 74014.55 వద్ద ముగిసింది. సెన్సెక్స్ చారిత్రక ముగింపు మార్చి 27వ తేదీన నమోదైన 74119.39 పాయింట్లు. నిఫ్టీ కూడా సోమవారం 203.05 పాయింట్ల లాభంతో 22529.95 పాయింట్ల చారిత్రక రికార్డును నమోదు చేసింది.. అయితే చివరికి లాభాలను 135.10 పాయింట్లకు పరిమితం చేసుకుని 22462 వద్ద ముగిసింది. నిఫ్టీ చారిత్రక ముగింపు మార్చి 27న నమోదైన 22493.55 పాయింట్లు.
---------------------------------------
ఆటోమొబైల్ మార్కెట్ జిలుగులు
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ మార్కెట్ అమ్మకాల్లో కొత్త రికార్డులు నమోదు చేసింది. 2022-23తో పోల్చితే కార్ల అమ్మకాలు 9 శాతం పెరిగి 38.9 లక్షల యూనిట్ల నుంచి 42.3 లక్షల యూనిట్లకు పెరిగాయి. ఇప్పటి వరకు ఆటోమొబైల్ రంగం అమ్మకాల్లో ఇది కొత్త రికార్డు. ప్రధానంగా కార్ల మార్కెట్లో అగ్రగామి అయిన మారుతి సుజుకీ, ప్రత్యర్థి హుండై మోటార్ ఇండియాతో పాటు టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ అమ్మకాల్లో కొత్త రికార్డులు నమోదు చేశాయి. దేశంలో కార్ల అమ్మకాలు ఒక ఏడాదిలో 40 లక్షలు దాటడం ఇదే ప్రథమం. ఎస్ యువిల పట్ల ప్రజలు అధిక ఆదరణ చూపడం ఇందుకు దోహదపడింది. మొత్తం కార్ల విక్రయాల్లో ఎస్‌యువిల వాటా 2022-23తో పోల్చితే 43 శాతం నుంచి 50.4 శాతానికి పెరిగింది.
- మారుతి సుజుకీ ఇండియా ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చరిత్రలోనే గరిష్ఠ స్థాయిలో 17,93,644 కార్లు విక్రయించడంతో పాటు విదేశాలకు రికార్డు స్థాయిలో 2,83,067 కార్లు ఎగుమతి చేసింది.
- హుండై మోటార్స్ ఇండియా కూడా 7,77,876 కార్లు విక్రయించి కొత్త రికార్డు నమోదు చేసింది. 2022-23లో విక్రయించిన 7,20,565 కార్లతో పోల్చితే అమ్మకాల్లో 8 శాతం వృద్ధి నమోదయింది.
- టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరంలో 2,63,512 కార్లు విక్రయించింది. కంపెనీ అమ్మకాల్లో ఇది కొత్త రికార్డు. 2022-23 సంవత్సరం అమ్మకాలు 1,77,683 యూనిట్లతో పోల్చితే అమ్మకాలు 48 శాతం పెరిగాయి.
- ద్విచక్ర వాహన కంపెనీలు టివిఎస్ మోటార్, సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కూడా అమ్మకాల్లో కొత్త రికార్డులు నమోదు చేశాయి. టివిఎస్ మోటార్ కంపెనీ చారిత్రక గరిష్ఠ స్థాయిలో 4.19 లక్షల వాహనాలు (14 శాతం వృద్ధి) విక్రయించగా సుజుకి మోటార్ సైకిల్ ఇండియా 11,33,902 వాహనాలు (21 శాతం వృద్ధి) విక్రయించింది.
--------------------------------------
జిఎస్‌టి కలెక్షన్లలోనూ అదే జోరు
2022-24 ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో జిఎస్‌టి వసూళ్లు రూ.1.78 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022-23 మార్చితో పోల్చితే ఇది 11.5 శాతం అధికం. దేశంలో జిఎస్‌టి ప్రవేశపెట్టిన తర్వాత వసూళ్లలో రెండో గరిష్ఠ స్థాయి ఇది. 2023 ఏప్రిల్‌లో నమోదైన రూ.1,87,035 కోట్లు ఇప్పటివరకు జిఎస్‌టి వసూళ్లలో చారిత్రక గరిష్ఠ స్థాయి. కాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు వసూలు రూ.1.68 లక్షల కోట్లుగా ఉంది. 2022-23లో ఈ సగటు రూ.1.5 లక్షల కోట్లు.
No comments:
Post a Comment