శాకాహార భోజనం ధరలపై ఉల్లి ఘాటు, టొమాటో, బంగాళాదుంప ధరల కాటు పడింది. మార్చిలో శాకాహార భోజనం ధరలు 7 శాతం పెరిగాయని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అనుబంధ విభాగం అధ్యయనంలో తేలింది. ఇదే నెలలో పౌల్ర్టీ ధరలు గణనీయంగా తగ్గిన కారణంగా మాంసాహార భోజనం ధరలు మాత్రం 7 శాతం తగ్గినట్టు క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలిసిస్ "రోటీ రైస్ రేట్" పేరిట రూపొందించిన నివేదికలో తెలిపింది.
సాధారణంగా రొట్టె, కూర (ఉల్లిపాయ, టొమాటా, బంగాళాదుంప), అన్నం, పప్పు, పెరుగు, సలాడ్ భాగమైన శాకాహార భోజనం ప్లేటు ధర గత ఏడాది మార్చిలో రూ.25.50 ఉంటే ఈ మార్చిలో రూ.27.30కి చేరింది. అయితే ఫిబ్రవరి ధర రూ.27.40 కన్నా తక్కువగానే ఉంది. ఉల్లి ధర 40 శాతం, టొమాటా ధర 36 శాతం, బంగాళాదుంప ధర 22 శాతం పెరగడం వల్ల శాకాహార భోజనం ధర పెరిగింది. సరఫరా తగ్గడం వల్ల గత ఏడాది మార్చితో పోల్చితే బియ్యం ధర 14 శాతం, పప్పుల ధర 22 శాతం పెరిగిందని ఆ నివేదికలో తెలిపారు. అయితే మాంసాహార భోజనంలో పప్పు స్థానంలో చికెన్ పెట్టడంతో ఈ భోజనం ప్లేటు ధర గత ఏడాది మార్చితో పోల్చితే రూ.59.20 నుంచి రూ.54.90కి తగ్గింది. ఈ కాలంలో బ్రాయిలర్ చికెన్ ధర 16 శాతం తగ్గింది. భోజనం మొత్తం ధరలో చికెన్ వాటా 50 శాతం ఉంటుంది. అయితే ఫిబ్రవరితో పోల్చితే రంజాన్ మాసం కావడం వల్ల బ్రాయిలర్ చికెన్ ధర 5 శాతం పెరిగింది.
No comments:
Post a Comment