Monday, March 30, 2026

అయ్యో...రూపాయి


భార‌త క‌రెన్సీ రూపాయి 2026 ఆర్థిక సంవ‌త్స‌రంలో భారీ ప‌త‌నాన్ని చ‌వి చూసింది. గ‌త ఏప్రిల్ నుంచి మార్చి 30 మ‌ధ్య కాలంలో ఏకంగా 9.88% ప‌త‌నాన్ని న‌మోదు చేసింది. 14 సంవ‌త్స‌రాల కాలంలో రూపాయికిది అతి భారీ ప‌త‌నం. ఇంత‌కు ముందు 2012 ఆర్థిక సంవ‌త్స‌రంలో డాల‌ర్ మార‌కంలో రూపాయి విలువ 12.4% ప‌డిపోయింది. క‌రెంట్ అకౌంట్ లోటు 4.2 శాతానికి దూసుకుపోయింది. ఒక్క రూపాయే కాదు...ఇత‌ర ఆసియా దేశాల క‌రెన్సీలు కూడా 2026 ఆర్థిక సంవ‌త్స‌రంలో భారీగా న‌ష్ట‌పోయాయి. జ‌పాన్ యెన్ 6%, ఫిలిప్పీన్స్ పెసో 5.74% క్షీణించాయి. 

ఎందుక‌లా జ‌రిగింది..?

మ‌న మార్కెట్ నుంచి గ‌త ఏడాది కాలంలో విదేశీ నిధులు భారీ ఎత్తున త‌ర‌లిపోవ‌డం రూపాయిని బ‌ల‌హీన‌ప‌రిచింది. దీనికి తోడు పెరిగిన క్రూడాయిల్ ధ‌ర‌లు, ప్ర‌పంచ క‌రెన్సీల‌తో డాల‌ర్ బ‌ల‌ప‌డ‌డం, ప్ర‌పంచ‌ ఫైనాన్షియ‌ల్ మార్కెట్ల‌లో ఆటుపోట్లు, వ్య‌వ‌స్థ‌లో లిక్విడిటీ కొర‌త‌ కూడా రూపాయిని కుంగ‌దీశాయి. 2026 సంవ‌త్స‌రం విదేశీ ఉప్పెన వంటిద‌ని, దేశీయ ప‌రిస్థితుల వ‌ల్ల కాకుండా విదేశీ ప‌రిణామాల‌కే రూపాయి కుప్ప‌కూలింద‌ని ద‌క్షిణ కొరియాకు చెందిన షిన్‌హాన్ బ్యాంక్ ట్రెజ‌రీ హెడ్ సునాల్ సోధానీ అన్నారు. ప్ర‌ధానంగా భారత దిగుమ‌తి ఆధార‌నీయ‌త ప‌రిస్థితిని మ‌రింత సంక్లిష్టం చేసింద‌ని చెప్పారు. భార‌తీయ వ‌స్తు, సేవ‌ల‌పై అమెరికా భారీగా సుంకాలు విధించ‌డంతో ఈ ప‌త‌నం తీవ్ర‌త‌ మ‌రింత పెరిగింద‌ని, దానికి ప‌శ్చిమాసియా సంక్షోభం అగ్నికి ఆజ్యం అయింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప‌శ్చిమాసియా సంక్షోభంతో క్రూడాయిల్ ధ‌ర బ్యారెల్ 100 డాల‌ర్ల‌కు పై స్థాయికి దూసుకుపోయి రూపాయిని కోలుకోలేని దెబ్బ తీసింది. నానాటికీ ప‌త‌మ‌వుతున్న రూపాయిని ఆదుకునేందుకు ఈ ఏడాది కాలంలో జ‌న‌వ‌రి వ‌ర‌కు ఆర్‌బిఐ 5507.3 కోట్ల డాల‌ర్ల‌ను మార్కెట్లో విక్ర‌యించినా ఫ‌లితం లేక‌పోయింది. చిట్ట‌చివ‌రికి సంవ‌త్స‌రం చివ‌రి రోజున (మార్చి 30) ఒక ద‌శ‌లో 95 స్థాయి క‌న్నా దిగ‌జారిన రూపాయి 94.70 వ‌ద్ద ఏడాదికి ముగిసింది.  


No comments:

Post a Comment

అయ్యో...రూపాయి

భార‌త క‌రెన్సీ రూపాయి 2026 ఆర్థిక సంవ‌త్స‌రంలో భారీ ప‌త‌నాన్ని చ‌వి చూసింది. గ‌త ఏప్రిల్ నుంచి మార్చి 30 మ‌ధ్య కాలంలో ఏకంగా 9.88% ప‌త‌నాన్ని...