Friday, March 27, 2020

రెపో రేటు 0.75 శాతం త‌గ్గింపు

రెపో రేటు 0.75 శాతం త‌గ్గింపు
కోవిడ్-19ని ఎదుర్కొనేందుకు ఆర్ బిఐ అసాధార‌ణ‌ చ‌ర్య‌
------------------------------------------------ 
ఆర్ బిఐ పాల‌సీ స‌మీక్ష ముఖ్యాంశాలు...
- రెపోరేటు భారీగా 0.75 శాతం త‌గ్గింపు, ఈ త‌గ్గింపుతో 4.4 శాతానికి రెపోరేటు
- దేశ చ‌రిత్ర‌లో ఇంత క‌నిష్ఠ స్థాయిలో రెపోరేటు ఉండ‌డం ఇదే ప్ర‌థ‌మం
- 0.90 శాతం త‌గ్గ‌నున్న‌ రివ‌ర్స్ రెపో రేటు
- సిఆర్ఆర్ 1 శాతం త‌గ్గింపు, ఈ త‌గ్గింపుతో 3 శాతానికి సిఆర్ఆర్‌
- బ్యాంకుల చేతికి రూ.1.37 ల‌క్ష‌ల కోట్ల నిధులు
- ఇఎంఐలు 3 నెల‌ల పాటు వాయిదా వేయ‌డానికి బ్యాంకుల‌కు అనుమ‌తి
- రుణాల‌ను రీ షెడ్యూల్ చేయ‌డానికి కూడా అనుమ‌తి
- డిపాజిట‌ర్ల సొమ్ము భ‌ద్రం, బ్యాంకు షేర్ల‌లో క్షీణ‌తకు క‌ల‌త వ‌ద్దు: ఆర్ బిఐ భ‌రోసా
------------------------------------------------ 

దేశంలో కోవిడ్-19 వ‌ల్ల ఎదుర‌వుతున్న సంక్షోభం నుంచి స‌గ‌టు ప్ర‌జ‌లు స‌హా అన్ని వ‌ర్గాల‌ను ఆదుకునేందుకు ఆర్ బిఐ రెపోరేటును 0.75 శాతం త‌గ్గించింది. దీంతో రెపోరేటు 4.4 శాతానికి దిగి వ‌చ్చింది. ఇంత‌వ‌ర‌కు రెపోరేటు ఇంత క‌నిష్ఠ స్థాయికి రావ‌డం దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం. గ‌తంలో 2009 ఆర్థిక సంక్షోభం స‌మ‌యంలో ఏప్రిల్ నెల నాటికి రెపోరేటు 4.74 శాతానికి త‌గ్గించారు. ఇంత‌వ‌ర‌కు చ‌రిత్ర‌లో అదే అతి క‌నిష్ఠ రెపోరేటు కాగా ఇప్పుడు ఆర్ బిఐ చ‌ర్య ఆ రికార్డుని చెరిపేసింది. అలాగే క్యాష్ రిజ‌ర్వ్ రేషియోను కూడా 1 శాతం మేర‌కు త‌గ్గించిన‌ట్టు ఆర్ బిఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్ ప్ర‌క‌టించారు. దాంతో అది 3 శాతానికి దిగి వ‌చ్చింది. మార్చి 28 నాటికి ఇది అమ‌లులోకి వ‌స్తుంది. క‌స్ట‌మ‌ర్ల నుంచి తాము సేక‌రించే డిపాజిట్ల‌పై ఆర్ బిఐ వ‌ద్ద చ‌ట్ట‌బ‌ద్ధంగా దాచి ఉంచాల్సిన సొమ్మునే సిఆర్ఆర్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. అలాగే బ్యాంకుల‌కి ఆర్ బిఐ స్వ‌ల్ప‌కాలానికి అందించే రుణాల‌పై వ‌సూలు చేసే వ‌డ్డీని రెపోరేటుగా వ్య‌వ‌హ‌రిస్తారు. సిఆర్ఆర్‌, రెపోరేటు త‌గ్గించ‌డం వ‌ల్ల బ్యాంకుల చేతిలో ఉండే రూ.1.37 ల‌క్ష‌ల కోట్ల న‌గ‌దు నిల్వ అందుబాటులో ఉంటుంది. అంటే బ్యాంకులు వ్యాపార‌వ‌ర్గాల‌కు, వినియోగ‌దారుల‌కు అవ‌స‌ర‌మైనంత మేర‌కు రుణాలు అందించ‌గ‌లుగుతాయి. వ్యాపార‌వ‌ర్గాల‌కు త‌క్కువ వ‌డ్డీకి రుణాలు అందించ‌డం వ‌ల్ల వారు ఆ సొమ్ముని ఉత్పాద‌క కార్య‌క‌లాపాల‌కు వినియోగించ‌గ‌లుగుతారు. 

ముందుగానే చ‌ర్య‌
వ్యాపార కార్య‌క‌లాపాలు విస్త‌రించ‌డం వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ ఉత్తేజితం అవుతుంది. వాస్త‌వానికి ఆర్ బిఐ పాల‌సీ స‌మీక్ష‌ను కాస్తంత ముందుగానే నిర్వ‌హించి ముంద‌స్తుగానే ఈ రేట్ల కోత‌ను ప్ర‌క‌టించింది. ఆర్ బిఐ మంగ‌ళ‌, బుధ‌, గురు వారాల్లో అత్య‌వ‌స‌ర ద్ర‌వ్య విధాన క‌మిటీ (ఎంపిసి) స‌మావేశం నిర్వ‌హించి ఈ రేట్ల కోత ప్ర‌క‌టించింది. దేశంలో క‌నివిని ఎరుగ‌ని సంక్షుభిత స్థితిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని తాజా ప‌రిస్థితిని విశ్లేషించింది. ప్ర‌స్తుతం దేశాన్ని కోవిడ్‌-19 కుదిపివేస్తున్న నేప‌థ్యంలో స‌త్వ‌రం ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఆదుకోవ‌ల‌సిన అవ‌స‌రాన్ని ఎంపిసి గుర్తించింద‌ని ఆర్ బిఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్ ప్ర‌క‌టించారు. ఎంపిసిలోని ఆరుగురు స‌భ్యుల్లో న‌లుగురు రేట్ల త‌గ్గింపున‌కు అనుకూలంగా ఓటు వేశార‌ని ఆయ‌న చెప్పారు. "ఎప్పుడైనా ఎలాంటి పోరాటానికైనా మ‌నం సిద్ధంగా ఉండాలి" అని దాస్ ఆ ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేశారు. "క్లిష్ట ప‌రిస్థితులు ఎల్ల‌కాలం ఉండ‌వు" అని కూడా ఆయ‌న అన్నారు. ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కంనేందుకు ఆర్ బిఐ ఉద్య‌మ స్ఫూర్తితో ప‌ని చేస్తుంద‌ని, మార్కెట్లు సాధార‌ణ స్థితికి వ‌చ్చే స‌జావుగా ప‌ని చేసేందుకు అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంద‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు.


మూడు నెల‌లు ఇఎంఐల‌కు విరామం
కార్పొరేట్ క‌స్ట‌మ‌ర్లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి రుణ‌గ్ర‌హీత‌ల‌కు ఊర‌ట క‌ల్పించేందుకు ఇఎంఐల చెల్లింపును మూడు నెల‌ల పాటు వాయిదా వేసేందుకు ఆర్ బిఐ బ్యాంకుల‌కు అనుమ‌తి ఇచ్చింది. దీని వ‌ల్ల వాహ‌న రుణాలు, గృహ‌రుణాలు పొందిన వారంద‌రికీ ఊర‌ట క‌లుగుతుంది. కార్పొరేట్ క‌స్ట‌మ‌ర్ల‌కు కూడా రుణ‌బ‌కాయిల చెల్లింపులు వాయిదా ప‌డ‌తాయి. ఫ‌లితంగా భిన్న వ‌ర్గాల‌కు బ్యాంకులు అందించిన‌ రుణాలు మొండి బ‌కాయిలుగా మార‌డాన్ని నివారించేందుకు ఈ చ‌ర్య ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ చ‌ర్య‌ల వ‌ల్ల కార్పొరేట్ కంపెనీల‌పై వ‌ర్కింగ్ కాపిట‌ల్ భారం గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ని, భిన్న రంగాల‌పై ఒత్తిడి త‌గ్గుతుంద‌ని బార్ క్లేస్ చీఫ్ ఎక‌నామిస్ట్ రాహుల్ బ‌జోరియా అన్నారు. ఆర్ బిఐ తీసుకున్న చ‌ర్య వ‌ల్ల 2020 ఆగ‌స్టు నాటికి రుణాల‌పై వ‌డ్డీరేట్లు 3.5 శాతానికి త‌గ్గుతాయ‌ని ఆయన చెప్పారు.

No comments:

Post a Comment

మే నెల‌లోనూ మార్కెట్లు ముందుకే...

స్టాక్ మార్కెట్లు గ‌త కొద్ది రోజులుగా తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటూనే కొత్త రికార్డులు న‌మోదు చేస్తున్నాయి. అయితే ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ బ‌లంగా...