Monday, March 2, 2020

వృద్ధికి క‌రోనా కాటు...?

కోవిడ్-19 (క‌రోనా) విజృంభ‌ణ కార‌ణంగా ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ఈ త్రైమాసికంలో తిరోగ‌మ‌నంలో ప‌డే ఆస్కారం ఉన్న‌ట్టు ఒఇసిడి (ఆర్థిక స‌హ‌కార‌, అభివృద్ధి సంస్థ‌) హెచ్చ‌రించింది. అదే జ‌రిగితే సుమారు ద‌శాబ్ది క్రితం అంత‌ర్జాతీయ ఆర్థిక సంక్షోభం త‌ర్వాత తొలి తిరోగ‌మ‌నం ఇదే అవుతుంది. గ‌తంలో 2008 సంవ‌త్స‌రం చివ‌రి త్రైమాసికంలో అంత‌కు ముందు ఏడాది అదే త్రైమాసికంతో పోల్చితే వృద్ధిరేటు క్షీణించింది. అలాగే 2009 సంవ‌త్స‌రంలో అంత‌కు ముందు సంవ‌త్స‌రంతో పోల్చితే వృద్ధిరేటులో క్షీణ‌త న‌మోద‌యింది. కాని ఈ ఏడాది ఇప్ప‌టికీ ఆర్థిక సంవ‌త్స‌రం మొత్తం మీద ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధి ప‌థంలోనే ఉండ‌వ‌చ్చున‌ని, వ‌చ్చే ఏడాది పున‌రుజ్జీవానికి ఆస్కారం ఉన్న‌ద‌ని ఒఇసిడి త‌న నివేదిక‌లో తెలిపింది. ఆ నివేదిక ముఖ్యాంశాలు...
- 2020 సంవత్స‌రం ప్ర‌థ‌మార్ధంలో ప్ర‌పంచ వృద్ధిరేటు 2.4 శాతం  ఉండ‌వ‌చ్చు. వైర‌స్ దీర్ఘ‌కాలం కొన‌సాగితే మాత్రం ఇది 1.5 శాతానికి ప‌డిపోయినా ఆశ్చ‌ర్యం ఉండ‌దు.
- గ‌తంలో వ‌చ్చిన వివిధ వైర‌స్ ల క‌న్నా కోవిడ్‌-19 అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది, తీవ్ర‌త‌ర‌మైన‌ది కావ‌డం వ‌ల్ల దాని వ్యాప్తిని అరిక‌ట్టి వినియోగ‌దారుల్లో విశ్వాసాన్ని పున‌రుద్ధ‌రించేందు ప్ర‌భుత్వాల‌న్నీఉమ్మ‌డిగా చ‌ర్య‌లు చేప‌ట్టాలి.
- ప్ర‌పంచం యావ‌త్తు అత్య‌ధికంగా అనుసంధానితం కావ‌డంతో పాటు అంత‌ర్జాతీయ వ‌స్తూత్ప‌త్తి, వాణిజ్యం, టూరిజం, క‌మోడిటీ మార్కెట్ల‌లో చైనా అగ్ర‌గామిగా ఉన్నందు వ‌ల్ల వైర‌స్ వ్యాపించిన కొద్ది ప‌రిస్థితి మ‌రింత క్షీణించే అవ‌కాశం ఉంది.
- యూరోపియ‌న్ యూనియ‌న్ మార్కెట్ల క‌మిష‌న‌ర్ థియెరీ బ్రెట‌న్ అంచ‌నా ప్ర‌కారం క‌రోనా వైర‌స్ ప్ర‌భావం వ‌ల్ల ఒక్క యూర‌ప్ ప్రాంతం టూరిజం ఆదాయాల‌కే 220 కోట్ల డాల‌ర్ల న‌ష్టం వాటిల్లింది.
---------------------------
భార‌త్ పై ప్ర‌భావం ఎంత‌...?
క‌రోనా వైర‌స్ ప్ర‌భావం వ‌ల్ల కీల‌క రంగాల‌కు అవ‌స‌ర‌మైన దిగుమ‌తులు ప‌డిపోయినందు వ‌ల్ల భార‌త్ లో మార్చి త్రైమాసికం జిడిపి వృద్ధిరేటు 0.20 శాతం క్షీణించ‌వ‌చ్చున‌ని విదేశీ బ్రోక‌రేజి సంస్థ‌లంటున్నాయి. భార‌త‌దేశంలో వృద్ధిరేటు ఇప్ప‌టికే గ‌ణ‌నీయంగా దిగ‌జారి ద‌శాబ్ది క‌నిష్ఠం 5 శాతానికి దిగ‌జారే ఆస్కారం ఉంది.
ఒఇసిడి : కోవిడ్‌-19 ప్ర‌భావం వ‌ల్ల భార‌త‌దేశంలో జిడిపి వృద్ధిరేటు 2020 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ప్రారంభ‌మ‌య్యే లో 5.1 శాతానికే ప‌రిమితం అయ్యే ఆస్కారం ఉంది.ఆ పై సంవ‌త్స‌రం మాత్రం 5.6 శాతానికి పుంజుకోవ‌చ్చు.
యుబిఎస్ సెక్యూరిటీస్ : ఎల‌క్ర్టానిక్స్, ఫార్మా, ఆటోమొబైల్ విభాగాల్లో ఉత్ప‌త్తుల‌కు విలువ‌ను జోడించే వ్య‌వ‌స్థ‌ల్లో స‌ర‌ఫ‌రాలు ఇప్ప‌టికే ప్ర‌భావితం అయ్యాయి. ఇది దేశీయ వృద్ధిరేటుపై కూడా ప్ర‌భావం చూప‌వ‌చ్చు. అయితే ప‌రిస్థితి ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉన్నందు వ‌ల్ల ఆర్థిక ప్ర‌భావం ఏ మేర‌కు ఉంటుంద‌నే విష‌యంపై ప్ర‌స్తుతం అత్యంత అనిశ్చితి నెల‌కొని ఉంది. ఈ కార‌ణంగా 2020-21లో భార‌త జిడిపి వృద్ధిరేటు 5.6 శాత‌మే ఉండ‌వ‌చ్చు.
ఫిచ్ :  మార్చి 31వ తేదీతో ముగియ‌నున్న ఆర్థిక సంవ‌త్స‌రంలో జిడిపి వృద్ధిరేటు 4.9 శాతానికి దిగ‌జార‌వ‌చ్చు. దేశీయంగా డిమాండు స్త‌బ్ధంగా ఉండ‌డం, క‌రోనా వైర‌స్ ప్ర‌భావం వ‌ల్ల త‌యారీ రంగంపై ఒత్తిడులు పెర‌గ‌వ‌చ్చు.

No comments:

Post a Comment

మే నెల‌లోనూ మార్కెట్లు ముందుకే...

స్టాక్ మార్కెట్లు గ‌త కొద్ది రోజులుగా తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటూనే కొత్త రికార్డులు న‌మోదు చేస్తున్నాయి. అయితే ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ బ‌లంగా...