Wednesday, March 18, 2020

క‌రోనా సునామీ


మూడో రోజూ న‌ష్టాల్లో మార్కెట్‌

29 వేల దిగువ‌కు సెన్సెక్స్ 

కోవిడ్‌-19 ప్ర‌భావం స్టాక్ మార్కెట్ ను పీడ‌క‌ల‌లా వెన్నాడుతోంది. ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ భారీ ప‌త‌నాలు చ‌వి చూసిన ప్ర‌భావంతో భార‌త స్టాక్ ఇండెక్స్ లు వ‌రుస‌గా మూడో రోజూ న‌ష్టాల్లో న‌డిచాయి. ఉద‌యం స్వ‌ల్ప‌లాభాల్లో ఉన్న‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ రోజు గ‌డుస్తున్న కొద్దీ న‌ష్టాల్లోకి జారుకున్నాయి. ప్ర‌పంచ మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు మార్కెట్ ఊపిరి తీసుకోగ‌లిగే ప‌రిస్థితి ఏ మాత్రం అందించ‌లేదు. దీనికి తోడు ఎస్ అండ్ పి సంస్థ భార‌త వృద్ధి అంచ‌నాను మ‌రింత‌గా త‌గ్గించ‌డం, టెలికాం ఎజిఆర్ బ‌కాయిల విష‌యంలో టెల్కోలు, ప్ర‌భుత్వ వైఖ‌రిని సుప్రీం కోర్టు త‌ప్పు ప‌ట్ట‌డం వంటి ప‌రిణామాలు మార్కెట్ కోలుకోలేని విఘాతం క‌లిగించాయి. రోజు మొత్తంలో సుమారు 2500 పాయింట్ల మేర ఊగిసలాడిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి 1709.58 పాయింట్ల న‌ష్టంతో 28869.51 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. 2017 జ‌న‌వ‌రి త‌ర్వాత ఇండెక్స్ 29000 క‌న్నా దిగ‌జార‌డం ఇదే ప్ర‌థ‌మం. నిఫ్టీ 498.25 పాయింట్ల న‌ష్టంతో 8468.80 వ‌ద్ద ముగిసింది. ఇండెక్స్ లు వ‌రుస‌గా మ‌ద్ద‌తు స్థాయిల‌న్నింటినీ కోల్పోతున్నాయి. ఈ ప‌త‌నం ఎంత‌వ‌ర‌కు సాగుతుందో అంచ‌నా వేయ‌డం మార్కెట్ పండితుల‌కు కూడా సాధ్యం కావ‌డంలేదు. ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూస్తుంటే నిఫ్టీ మ‌రో 1000 పాయింట్ల వ‌ర‌కు న‌ష్ట‌పోయి 7500 వ‌ద్ద స్థిర‌ప‌డ‌వ‌చ్చునంటున్నారు.
- సెన్సెక్స్ లో ఒఎస్ జిసి, ఐటిసి మిన‌హా అన్ని షేర్లు న‌ష్టాల్లోనే ట్రేడ‌య్యాయి. 23.90 శాతం న‌ష్టంతో ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ అగ్ర‌గామిగా ఉంది.

- మూడు రోజుల్లో భార‌త స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట‌ర్లు న‌ష్టపోయిన సంప‌ద విలువ‌ రూ.15.72 ల‌క్ష‌ల కోట్లు. స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.1,13,53,329.30 కోట్ల‌కు దిగ‌జారింది.

- 1056 క‌న్నా ఎక్కువ‌ కంపెనీల షేర్ల ధ‌ర‌లు ఏడాది క‌నిష్ఠ స్థాయికి దిగ‌జారిపోయాయి.
5 సెష‌న్ల‌లో ఇండెక్స్ ల న‌ష్టాలిలా ఉన్నాయి...
 ------------------------------------------------------------------------- 
                   సెన్సెక్స్        నిఫ్టీ        సంప‌ద న‌ష్టం
 -------------------------------------------------------------------------   

మార్చి   9      1942         538         రూ. 7.00 ల‌క్ష‌ల కోట్లు 
మార్చి 12       2919        868         రూ.11.28 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 16       2713        758         రూ. 7.62 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 17         811         231        రూ.  2.12 ల‌క్ష‌ల కోట్లు
 మార్చి 18      1709         495         రూ.5.98 ల‌క్ష‌ల కోట్లు   
మొత్తం నష్టం  10104       2890         రూ.37.76 ల‌క్ష‌ల కోట్లు   
-------------------------------------------------------------------------       

భారీ న‌ష్టాల్లో ప్ర‌పంచ మార్కెట్లు
ప‌లు దేశాలు కోవిడ్‌-19 వ‌ల్ల ఏర్ప‌డిన న‌ష్టాల నుంచి కోలుకునేందుకు ప్ర‌క‌టించిన ఉద్దీప‌న చ‌ర్య‌లు కూడా ప్ర‌పంచ మార్కెట్ల‌ను ఆదుకోలేదు. ఫ్రాంక్ ఫ‌ర్ట్, లండ‌న్‌, పారిస్ ఇండెక్స్ లు 5 శాతానికి పైగా న‌ష్ట‌పోయాయి. ఆసియాలో టోక్యో (1.7%), సిడ్నీ (6%), హాంకాంగ్ (4%) షాంఘై (1.8%) ఇండెక్స్ లు భారీగా న‌ష్ట‌పోయాయి. 

17 సంవ‌త్స‌రాల క‌నిష్ఠానికి క్రూడాయిల్ ధ‌ర
అంత‌ర్జాతీయ విప‌ణిలో క్రూడాయిల్ ధ‌ర‌లు 17 సంవ‌త్స‌రాల క‌నిష్ట స్థాయికి దిగ‌జారాయి. న్యూయార్క్ మార్కెట్ లో డ‌బ్ల్యుటిఐ క్రూడాయిల్ ధ‌ర బ్యారెల్ 25.08 డాల‌ర్లు ప‌లికింది.   

1985 క‌నిష్ఠ స్థాయికి స్టెర్లింగ్‌
బ్రిట‌న్ క‌రెన్సీ స్టెర్లింగ్ పౌండ్ డాల‌ర్ మార‌కంలో 1985 క‌నిష్ఠ స్థాయిల‌కు ప‌డిపోయింది.బుధ‌వారం 1.9 శాతం దిగ‌జారి 1.1828కి ప‌డిపోయి చివ‌రికి 1.1861 వ‌ద్ద ముగిసింది.           

No comments:

Post a Comment

మే నెల‌లోనూ మార్కెట్లు ముందుకే...

స్టాక్ మార్కెట్లు గ‌త కొద్ది రోజులుగా తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటూనే కొత్త రికార్డులు న‌మోదు చేస్తున్నాయి. అయితే ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ బ‌లంగా...