Tuesday, March 31, 2020

మార్కెట్ కు ఎంత క‌ష్టం

ఏడాది చివ‌రి రోజు లాభాలు
కొంప ముంచిన క‌రోనా
స్టాక్ మార్కెట్ ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి రోజున లాభాల‌తో ముగిసింది. అయితే ఆర్థిక సంవ‌త్స‌రం మొత్తం మీద భారీగా న‌ష్ట‌పోయింది. మార్చి చివ‌రిలో క‌రోనా వ్యాప్తి వ‌ల్ల ఏర్ప‌డిన భ‌యాల‌తో మార్కెట్లు భారీ క్షీణ‌త‌లు న‌మోదు చేయ‌డ‌మే ఇందుకు కార‌ణం. క‌రోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్ర‌భుత్వాలు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటూ ఉండ‌డం, ఆసియా మార్కెట్లు లాభాల్లో న‌డ‌వ‌డం, చైనాలో మాన్యుఫాక్చ‌రింగ్ ఇండెక్స్ పెర‌గ‌డం వంటి చ‌ర్య‌లు ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ బ‌ల‌ప‌డేలా చేశాయ‌ని ట్రేడ‌ర్లంటున్నారు. ఫిబ్ర‌వ‌రిలో రికార్డు స్థాయిలో 35.7 పాయింట్ల‌కు ప‌డిపోయిన చైనా మాన్యుఫాక్చ‌రింగ్ పిఎంఐ మార్చిలో 52 పాయింట్ల‌కు దూసుకుపోయింది. అలాగే టోక్యో మిన‌హా షాంఘై, హాంకాంగ్‌, సియోల్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. ఈ వార్త‌లు భార‌త మార్కెట్ లో ఉత్తేజం నింపాయి. సెన్సెక్స్ రోజంతా లాభాల‌తో న‌డిచి చివ‌రికి 1028.17 పాయింట్ల లాభంతో 29468.49 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 316.65 పాయింట్లు లాభ‌ప‌డి 8597.75 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. అన్ని సెక్టోర‌ల్ సూచీలు లాభాల‌తో ముగిశాయి. మార్కెట్ ఆటుపోట్ల సూచీ 10 శాతం త‌గ్గుద‌ల న‌మోదు చేసింది.
ఏడాదిలో రూ.37.59 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరి
కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి స్టాక్ మార్కెట్ల కొంప ముంచింది. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం మొత్తం మీద బిఎస్ఇ ప్ర‌ధాన సూచి సెన్సెక్స్ 9204.42 పాయింట్లు (23.8%) దిగ‌జారింది. ఎన్ఎస్ఇ కీల‌క సూచి నిఫ్టీ 3926.15 పాయింట్లు క్షీణించింది. ఫ‌లితంగా ఇన్వెస్ట‌ర్ల సంప‌ద ఏడాదిలో రూ.37.59 ల‌క్ష‌ల కోట్లు ఆవిరైపోయింది. ఒక్క మార్చిలోనే స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు భారీగా న‌ష్ట‌పోయాయి. మార్చి నెల మొత్తం మీద సెన్సెక్స్ 8828.80 పాయింట్లు న‌ష్ట‌పోయింది. మార్చి 24వ తేదీన సెన్సెక్స్ ఏడాది క‌నిష్ఠ స్థాయి 25638.90 పాయింట్లు న‌మోదు చేసింది. ఫ‌లితంగా బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.37,59,954.42 కోట్లు క్షీణించి రూ.1,13,48,756.59 కోట్ల‌కు ప‌డిపోయింది. అంత‌కు ముందు ఆర్థిక సంవ‌త్స‌రంలో (2018-19) ఈ మార్కెట్ విలువ ఏకంగా రూ.8.83,714.01 కోట్లు పెరిగి రూ.1,51,08,711.01 కోట్ల‌కు చేరింది. 
కీల‌క మైలురాళ్లు
2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డులు నెల‌కొల్పాయి. సెన్సెక్స్ 40000 పాయింట్ల మైలురాయిని దాట‌గా నిఫ్టీ 12000 పాయింట్ల మైలు రాయిని దాటింది. జ‌న‌వ‌రి 20వ తేదీన సెన్సెక్స్ 42273.87 పాయింట్ల చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయిని చేరింది. ఆ త‌ర్వాత రెండు నెల‌ల కాలంలో భారీగా క్షీణించి ఏడాది క‌నిష్ఠ స్థాయిల్లో క‌ద‌లాడుతోంది. 
ఆర్ఐఎల్ దే అగ్ర‌స్థానం
ప్ర‌స్తుతం ఆర్ఐఎల్ దేశంలో అత్యంత విలువైన కంపెనీగా కొన‌సాగుతోంది. ఒక ద‌శ‌లో రూ.10 ల‌క్ష‌ల కోట్ల మార్కెట్ విలువ‌ను దాటిపోయి ఆ ఘ‌న‌త సాధించిన తొలి కంపెనీగా రికార్డు న‌మోదు చేసిన ఆర్ఐఎల్‌ త‌దుప‌రి ఏర్ప‌డిన ప్ర‌తికూల‌త‌లో షేరు భారీగా ప‌త‌నం కావ‌డంతో ప్ర‌స్తుతం రూ.7,05,211.81 కోట్ల వ‌ద్ద నిలిచింది. రూ.6,84,078.49 కోట్ల‌తో టిసిఎస్ రెండో స్థానంలో ఉంది.
రూపాయి మ‌హా ప‌త‌నం
దేశీయ క‌రెన్సీ రూపాయి కూడా అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో ఏడాది మొత్తం మీద భారీగా క్షీణించింది. 2019-20 సంవ‌త్స‌రం మొత్తం మీద రూపాయి 646 పైస‌లు (9.36%) ప‌త‌న‌మ‌యింది.మంగ‌ళ‌వారంనాడు సంవ‌త్స‌రం చివ‌రి రోజున రూపాయి 75.60 వ‌ద్ద ముగిసింది. ఏడాది మొత్తంలో ఏర్ప‌డిన 9.36% క్షీణ‌త‌లో జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికంలోనే 5.94% క్షీణ‌త (424 పైస‌లు) న‌మోద‌యింది. 2019 మార్చి 31వ తేదీన అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో రూపాయి 69.14 వ‌ద్ద ఉంది.  
నేడు, రేపు సెల‌వు
బ్యాంకుల ఆర్థిక సంవ‌త్స‌రం ముగింపు రోజు కావ‌డం వ‌ల్ల ఏప్రిల్ 1వ‌ తేదీన, శ్రీ‌రామ న‌వ‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఏప్రిల్ 2వ తేదీన‌ ఫారెక్స్ మార్కెట్ మూసి ఉంటుంది. 

No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...