Wednesday, March 25, 2020

ఆగ‌ని బుల్ చిందు

రెండో రోజు కూడా కొన‌సాగిన జోరు
2011 త‌ర్వాత అతి పెద్ద లాభం న‌మోదు

భార‌త స్టాక్ మార్కెట్ వ‌రుస‌గా రెండో రోజున కూడా జోరు ఆప‌లేదు. బుల్స్ రెచ్చిపోయి చిందులు తొక్కాయి. క‌రోనాను అదుపు చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా ప్ర‌ధాని 21 రోజుల పాటు దేశ‌వ్యాప్తంగా లాకౌట్ ప్ర‌క‌టించ‌డం, ఆ మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డుతున్న భారీ న‌ష్టాన్ని త‌ట్టుకునేందుకు అమెరికా, యూరోపియ‌న్ యూనియ‌న్ స‌హా ప‌లు కేంద్ర బ్యాంకులు ఉద్దీప‌న ప్యాకేజిలు ప్ర‌క‌టించ‌డం, ఉద్దీప‌న ప్యాకేజి సిద్ధం అవుతున్న‌ద‌ని ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించ‌డం మార్కెట్ల‌లో బుల్స్ కు ప్రాణం పోసింది. మార్కెట్ లో కీల‌క ఇండెక్స్ సెన్సెక్స్ 1862 పాయింట్లు (6.98 %) లాభ‌ప‌డి 28536 పాయింట్ల వ‌ద్ద ముగియ‌గా నిఫ్టీ 497 పాయింట్లు లాభ‌ప‌డి 8298 వ‌ద్ద ముగిసింది. 2011 త‌ర్వాత ఇండెక్స్ లు ఒక రోజులో ఇంత భారీగా వృద్ధిని న‌మోదు చేయ‌డం ఇదే ప్ర‌థ‌మం. కాగా మంగ‌ళ‌వారం సాధించిన వృద్ధి 693 పాయింట్ల‌తో క‌లిపితే రెండు సెష‌న్ల‌లో లాభం 2555 పాయింట్లు కాగా నిఫ్టీ 688 పాయింట్లు లాభ‌ప‌డింది. మంగ‌ళ‌వారం అమెరిక‌న్ మార్కెట్ ఆర్జించిన లాభంతో పాటు ఇత‌ర మార్కెట్ల‌లో కూడా ఏర్ప‌డిన లాభాలు అందించిన ఉత్తేజం కూడా భార‌త మార్కెట్ చిందులు తొక్క‌డానికి దారి తీసింది.   

ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.4.7 ల‌క్ష‌ల కోట్లు వృద్ధి
బుధ‌వారం ఒక్క రోజులోనే ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.4.7 ల‌క్ష‌ల కోట్లు వృద్ధి చెందింది. మంగ‌ళ‌వారం పెరిగిన సంప‌ద విలువ రూ.1.82 ల‌క్ష‌ల కోట్లు. దీంతో రెండు రోజుల వ్య‌వ‌ధిలో మొత్తం సంప‌ద రూ.6.52 ల‌క్ష‌ల కోట్లు పెరిగి రూ.1,08,40,165.20 కోట్ల‌కు చేరింది.

ర్యాలీ కొన‌సాగుతుందా...?
స్టాక్ మార్కెట్ లో ఏర్ప‌డిన ఈ ర్యాలీ నిల‌దొక్కుకుంటుందా లేక ఇది తాత్కాలిక‌మేనా అనే ప్ర‌శ్న‌లు ప‌లువురిలో త‌లెత్తుతున్నాయి. డెయిలీ చార్టుల ప్ర‌కారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ డైవ‌ర్జెన్స్ సాధించాయ‌ని, రిక‌వ‌రీ అవ‌కాశాలున్నాయ‌నేందుకు ఇది తొలి సంకేత‌మ‌ని విశ్లేష‌కులంటున్నారు. ప్ర‌స్తుతం నిఫ్టీకి మ‌ద్ద‌తు స్థాయిల ప‌రిధి 7600-7650 కాగా నిరోధ స్థాయిల ప‌రిధి 8050-8200 వ‌ద్ద ఉన్న‌ట్టు ఎల్ కెపి సెక్యూరిటీస్ సీనియ‌ర్ అన‌లిస్ట్ రోహిత్ షింగ్రే చెబుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో నిఫ్టీలో రిలీఫ్ ర్యాలీ 9000 వ‌ర‌కు ఉండ‌వ‌చ్చున‌ని అంచ‌నా.

నెల రోజుల్లో క‌నివిని ఎరుగ‌ని న‌ష్టం
భార‌త స్టాక్ మార్కెట్ కోవిడ్-19 మ‌హ‌మ్మారి ప్ర‌భావం వ‌ల్ల గ‌త నెల రోజుల్లో క‌నివిని ఎరుగ‌నంత భారీ క‌ల్లోలానికి గుర‌యింది. అస‌లు మార్కెట్ ప‌య‌నం ఏ దిశ‌గా సాగుతుంద‌న్న‌ది అన‌లిస్టుల ఊహాగానాల‌కు అంద‌నంత‌గా న‌ష్టాలు ఏర్ప‌డ్డాయి. గ‌త నెల రోజుల్లో మార్కెట్ న‌డ‌క ఒక వైకుంఠ‌పాళిని గుర్తుకి తెచ్చింది. ఒక చిన్న నిచ్చెన దొరికి కాస్తంత లాభ‌ప‌డింద‌న్న స‌మ‌యంలో ఒక పెద్ద పాము నోటికి చిక్కి పాతాళానికి ప‌డిపోయే విధంగా ఈ ప‌య‌నం సాగింది. సెన్సెక్స్, మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ల‌న్నీ 35 శాతం మేర‌కు న‌ష్ట‌పోయాయి. ప్ర‌స్తుత వాతావ‌ర‌ణంలో ఇన్వెస్ట‌ర్లు పెట్టుబ‌డి విష‌యంలో దీర్ఘ‌కాలిక దృక్ప‌థం అనుస‌రించ‌డ‌మే మంచిద‌ని, తాత్కాలిక ఎగుడుదిగుడుల ప్ర‌భావానికి లోను కారాద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. 

No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...