Thursday, March 19, 2020

నాలుగో రోజూ ఆగ‌లేదు...

కొన‌సాగిన స్టాక్ మార్కెట్ల న‌ష్టాలు
క‌రోనా సునామీ - 6
కోవిడ్‌-19 ప్ర‌భావానికి భార‌త ఈక్విటీ మార్కెట్ వ‌రుస‌గా నాలుగో రోజు కూడా ప‌తనం న‌మోదు చేసింది. ఉద‌యం స‌మ‌యంలో కొంత సేపు పాజిటివ్ ధోర‌ణిలోనే ట్రేడ‌యినా అంత‌ర్జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో తిరోగ‌మ‌నం భ‌యాల‌తో ప్ర‌పంచ మార్కెట్ల‌లో అమ్మ‌కాలు పోటెత్తిన ప్ర‌భావం దేశీయ ఇన్వెస్ట‌ర్ల‌పై కూడా ప‌డింది. మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి రిటైల్ ఇన్వెస్ట‌ర్లు భారీ ఎత్తున అమ్మ‌కాల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో రోజు మొత్తంలో 2650 పాయింట్ల‌కు పైబ‌డి ఎగుడుదిగుడులు సాధించిన సెన్సెక్స్ చివ‌రికి 581.28 పాయింట్ల న‌ష్టంతో 28288.23 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఒక ద‌శ‌లో కీల‌క మాన‌సిక అవ‌ధి 7900 క‌న్నా దిగ‌జారినా చివ‌రికి 205.35 పాయింట్ల న‌ష్టంతో 8263.45 వ‌ద్ద ముగిసింది. అయితే మ‌ధ్యాహ్నం సెష‌న్ లో మార్కెట్లు ఒక మోస్త‌రు పుల్ బ్యాక్ సాధించ‌డం కాస్తంత ఊర‌ట క‌లిగించింది. కాని ఆ ఆనందం ఎంతో స‌మ‌యం నిల‌వ‌లేదు.
మ‌రో రూ.3.74 ల‌క్ష‌ల కోట్లు ఢ‌మాల్‌
గురువారం మార్కెట్ లో ఏర్ప‌డిన న‌ష్టం ప్ర‌భావం వ‌ల్ల ఇన్వెస్ట‌ర్ల సంప‌ద మ‌రో్ రూ.3.74 ల‌క్షల కోట్లు ఆవిరైపోయింది.దీంతో వ‌రుస‌గా నాలుగు రోజులుగా తుడిచిపెట్టుకుపోయిన ఇన్వెస్ట‌ర్ల సంప‌ద ప‌రిమాణం రూ.19.49 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.19,49,461.82 కోట్లు దిగ‌జారి రూ.1,09,76,781 కోట్ల‌కు చేరింది. 
6 సెష‌న్ల‌లో ఇండెక్స్ ల న‌ష్టాలిలా ఉన్నాయి...
(గ‌త వారం రెండు రోజులు స‌హా)
------------------------------------------------------------------------- 
                   సెన్సెక్స్        నిఫ్టీ        సంప‌ద న‌ష్టం
------------------------------------------------------------------------- 

మార్చి   9      1942         538         రూ. 7.00 ల‌క్ష‌ల కోట్లు 
మార్చి 12       2919        868         రూ.11.28 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 16       2713        758         రూ. 7.62 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 17         811         231        రూ. 2.12 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 18      1709         495         రూ. 5.98 ల‌క్ష‌ల కోట్లు 
 మార్చి 19        581         206         రూ. 3.74 ల‌క్ష‌ల కోట్లు      
మొత్తం నష్టం  10104       2890         రూ.57.25 ల‌క్ష‌ల కోట్లు   
------------------------------------------------------------------------- 

ప్ర‌పంచ మార్కెట్లూ న‌ష్టాల బాట‌లోనే...
కోవిడ్‌-19 భ‌యాల కార‌ణంగా ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ వ‌రుస న‌ష్టాల్లోనే ట్రేడ‌వుతున్నాయి. ప‌లు దేశాలు ఉద్దీప‌న‌లు ప్ర‌క‌టించినా ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ ను పెంచ‌లేక‌పోయాయి. ఆసియా దేశాల స్టాక్ ఎక్స్ఛేంజిల‌న్నీ భారీ ప‌త‌నాలు న‌మోదు చేశాయి. ద‌క్షిణ కొరియాకు చెందిన కోస్పి 8 శాతం న‌ష్ట‌పోయి దారుణంగా దిగ‌జారిన సూచీగా నిలిచింది. హాంగ్ సెంగ్‌, నిక్కీ, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ తో పాటు యూరో్పియ‌న్ దేశాల సూచీలు కూడా భారీ న‌ష్టాల‌నే న‌మోదు చేశాయి.
రూపాయి మ‌రింత బ‌ల‌హీనం
అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో రూపాయి మ‌రింత‌గా దిగ‌జారింది. ఒక ద‌శ‌లో జీవిత కాల క‌నిష్ఠ స్థాయి 75.30 వ‌ర‌కు దిగ‌జారి గుబులు పుట్టించింది. చివ‌రికి 86 పైస‌లు దిగ‌జారి 75.12 వ‌ద్ద క్లోజ‌యింది. 2019 సెప్టెంబ‌ర్ 3వ తేదీ త‌ర్వాత రూపాయి ఒక రోజులో ఇంత భారీగా న‌ష్ట‌పోవ‌డం ఇదే ప్ర‌థ‌మం. దీంతో ఈ నెల మొత్తం మీద రూపాయి విలువ 4 శాతం క్షీణించిన‌ట్ట‌యింది. 
- సోమ‌-గురు వారాల మ‌ధ్య‌న‌ 4 రోజుల్లో భార‌త స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట‌ర్లు న‌ష్టపోయిన సంప‌ద విలువ‌ రూ.19.49 ల‌క్ష‌ల కోట్లు. స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.1,09,76,781 కోట్ల‌కు దిగ‌జారింది. గ‌త వారంలో సోమ‌, గురు వారాల్లో (9,12 తేదీలు) ఏర్ప‌డిన భారీ న‌ష్టాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే మొత్తం సంప‌ద న‌ష్టం రూ.57.25 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది.
- ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 173కి చేర‌గా మృతుల సంఖ్య 4కి పెరిగింది. పంజాబ్ కు చెందిన 70 సంవ‌త్స‌రాల వృద్ధుడు క‌రోనా వ్యాధి కార‌ణంగా గురువారం మ‌ర‌ణించాడు.
- క్రూడాయిల్ ధ‌ర‌ల త‌గ్గుద‌ల వ‌ల్ల ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ.1.40 ల‌క్ష‌ల కోట్లు ఆదా     

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...