Saturday, March 21, 2020

వారం మొత్తంలో క‌ల్లోల‌మే

స్టాక్ మార్కెట్ వారం మొత్తంలో తీవ్ర క‌ల్లోలాన్ని చ‌వి చూసింది. ఐదు రోజుల ట్రేడింగ్ లో నాలుగు రోజులు బేర్స్ తో బుల్స్ పోరాట స్ఫూర్తిని ఏ మాత్రం చూప‌లేక‌పోయాయి. బేర్ ధాటికి చ‌తికిల‌బ‌డిపోయి లేవ‌లేని స్థితిలో ఉన్న బుల్స్ శుక్ర‌వారం ఉన్న‌ట్టుండి విశ్వ‌రూపం చూపించాయి. నాలుగు రోజుల విశ్రాంతికి ప్ర‌తీకారం చూపించాయి. ఒక్క రోజులోనే సెన్సెక్స్ 1628 పాయింట్లు, నిఫ్టీ 482 పాయింట్లు లాభ‌ప‌డ్డాయి. కాని వారం మొత్తం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే మాత్రం బుల్స్ భారీ ఓట‌మిని అంగీక‌రించ‌క త‌ప్ప‌లేదు. వారం మొత్తం మీద సెన్సెక్స్ 4188 పాయింట్లు,నిఫ్టీ 1203 పాయింట్ల భారీ న‌ష్టం మూట‌గ‌ట్టుకున్నాయి. ఇంత‌కు ముందు వారంలో సోమ‌, గురు వారాల్లో ఏర్ప‌డిన న‌ష్టాల‌ను కూడా క‌లిపితే మొత్తం ఆరు రోజులుగా ఏర్ప‌డిన క‌ల్లోలంలో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.57.25 ల‌క్ష‌ల కోట్లు క్షీణించినా చివ‌రి రోజున సాధించిన లాభంతో ఆ న‌ష్టం రూ.50.93 ల‌క్ష‌ల కోట్ల‌కు ప‌రిమితం అయింది. కోవిడ్‌-19 వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌కు ఏర్ప‌డ‌నున్న న‌ష్టం నుంచి భిన్న రంగాల‌ను కాపాడేందుకు ప‌లు దేశాలు ఉద్దీప‌న ప్యాకేజిలు ప్ర‌క‌టించ‌డం, ఎక‌నామిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌క‌టించ‌డం మార్కెట్ కు ఊపిరులు పోసింది. అయితే శుక్ర‌వారం నాడు క‌నిష్ఠ స్థాయిల నుంచి కోలుకోవ‌డం వ‌చ్చే వారం సూచీలు కాస్తంత రిక‌వ‌రీ బాట ప‌ట్టే ఆశ‌ల‌ను రేకెత్తించింద‌ని ప‌రిశీల‌కులంటున్నారు.

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...