Sunday, March 1, 2020

క‌రోనా ప్ర‌భావంతో విడిభాగాల స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

టాటా మోటార్స్, మ‌హీంద్రా, ఎంజి మోటార్స్
చైనాను క‌రోనా వైర‌స్ అత‌లాకుత‌లం చేసిన కార‌ణంగా విడిభాగాల స‌ర‌ఫ‌రా విష‌యంలో తాము తీవ్ర‌మైన స‌వాళ్లు ఎదుర్కొంటున్నామ‌ని టాటా మోటార్స్, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, ఎంజి మోటార్స్ ప్ర‌క‌టించాయి. ఇదే స‌మ‌యంలో మారుతి సుజుకి, హుండై మోటార్స్, ట‌యోటా కిర్లోస్క‌ర్ మోటార్స్ మాత్రం త‌మ‌పై త‌క్ష‌ణ ప్ర‌భావం ఏమీ క‌నిపించ‌లేద‌ని, చైనా ప్లాంట్ల నుంచి విడిభాగాల స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డ‌లేద‌ని స్ప‌ష్టం చేశాయి. అయితే భ‌విష్య‌త్తులో ఏర్ప‌డ‌బోయే ప‌రిస్థితిని స‌త్వ‌రం అంచ‌నా వేసుకుని త‌గు నివార‌ణ చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్ర‌ధాన స‌ర‌ఫ‌రాదారుల కార్య‌క‌లాపాలు ఎలా జ‌రుగుతున్న‌ది నిరంత‌రం ప‌రిశీలిస్తూ ఉంటామ‌ని, అవ‌స‌రాన్ని బ‌ట్టి నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించాయి.
మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా
ఫిబ్ర‌వ‌రి నెల‌లో మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా అమ్మ‌కాలు 42 శాతం త‌గ్గి 32,476కి చేరాయి. అనూహ్య‌మైన క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా చైనా నుంచి విడిభాగాల స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌డంతో బిఎస్ 6 వాహ‌నాల త‌యారీ ప్ర‌క్రియ ప్ర‌భావితం అయింద‌ని ఆటోమోటివ్ డివిజ‌న్ చీఫ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విజ‌య్ రామ్ న‌క్రా తెలిపారు. క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల డీల‌ర్ల వ‌ద్ద ఇన్వెంట‌రీ 10 రోజుల క‌న్నా త‌క్కువ‌కు ప‌డిపోయింద‌ని, సాధార‌ణ స్థితి రావ‌డానికి ముందు మ‌రికొన్ని వారాల పాటు ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతుంద‌ని భావిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. 
టాటా మోటార్స్ 
కోవిడ్‌-19 విజృంభ‌ణ‌తో పాటు త‌మ  కీల‌క‌మైన  వెండార్ల‌లో ఒక‌రి ప్లాంట్ లో అగ్ని ప్ర‌మాదం వ‌ల్ల వాహ‌నాల ఉత్ప‌త్తి, టోకు అమ్మ‌కాల‌కు అందుబాటులో ఉన్న వాహ‌నాల సంఖ్య త‌గ్గిన‌ట్టు టాటా మోటార్స్ ప్ర‌యాణికుల వాహ‌నాల ప్రెసిడెంట్ మ‌యాంక్ ప‌రీఖ్ అన్నారు. 
ఎంజి మోటార్స్ 
ఈ కంపెనీ అమ్మ‌కాలు ఫిబ్ర‌వ‌రి నెల‌లో 1376కి ప‌డిపోయాయి. చైనా, ఇత‌ర ప్రాంతాల నుంచి విడిభాగాల స‌ర‌ఫ‌రా గ‌ణ‌నీయంగా త‌గ్గిన‌ట్టు కంపెనీ ప్ర‌క‌టించింది. అలాగే ఎల‌క్ర్టిక్ వాహ‌నాల విభాగంలో కూడా కేవ‌లం 150 వాహ‌నాలు మాత్ర‌మే క‌స్ట‌మ‌ర్ల‌కు అందించ‌గ‌లిగామ‌ని ఎంజి మోటార్స్ ఇండియా డైరెక్ట‌ర్ రాకేశ్ సైదానా తెలిపారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో త‌మ యూరోపియ‌న్‌, చైనా స‌ర‌ఫ‌రాల వ్య‌వ‌స్థ‌కు కూడా తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డి అమ్మ‌కాలు గ‌ణ‌నీయంగా ప‌డిపోయిన‌ట్టు ఆయ‌న చెప్పారు. మార్చిలో కూడా ఇదే ప‌రిస్థితి కొన‌సాగ‌వ‌చ్చునంటూ ఈ నెలాఖ‌రు నాటికి ప‌రిస్థితి చాలా వ‌ర‌కు మెరుగుప‌డ‌వ‌చ్చున‌న్న ఆశాభావం ప్ర‌క‌టించారు.

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...