కరోనా వైరస్ ప్రభావానికి దేశంలో కోళ్ల పరిశ్రమ కుదేలయింది. కోళ్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందంటూ సోషల్ మీడియాలో చెలరేగిన వదంతుల కారణంగా ఒక్క నెలలోనే పౌల్ర్టీ బ్రీడర్లు రూ.1750 కోట్లు నష్టపోయారని అఖిల భారత పౌల్ర్టీ బ్రీడర్ల సంఘం ప్రకటించింది. ఈ నష్టాన్ని తట్టుకునేందుకు తమకు ప్రభుత్వం ప్యాకేజి ప్రకటించాలని కూడా డిమాండు చేసింది. చికెన్ కు, కరోనాకు ముడిపెడుతూ వ్యాపింపచేసిన వదంతుల కారణంగా ఫారం స్థాయిలో కిలో కోడిమాంసం సగటు ధర రూ.80 నుంచి 10 నుంచి 30 రూపాయల పరిధిలోకి పడిపోయిందని వారు చెప్పారు. ఈ మేరకు వారు కేంద్ర పశు సంవర్థక శాఖకు వినతి పత్రం సమర్పించారు. ఆ వదంతులతో పౌల్ర్టీ పరిశ్రమ కనివిని ఎరుగని సంక్షోభంలో చిక్కుకోవడమే కాకుండా దివాలా పరిస్థితికి చేరిందని ఆ సంఘం చైర్మన్ బహదూర్ అలీ అన్నారు. భారత పౌల్ర్టీ రంగంపై దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైబడి రైతులు ఉపాధి పొందుతున్నారు. దేశ జిడిపిలో పౌల్ర్టీ రంగం వాటా రూ.1.2 లక్షల కోట్ల మేరకు ఉంది.
సోయాబీన్ రైతులకూ చిక్కే
ఇది సోయాబీన్ రైతులను కూడా దెబ్బ తీస్తుందని అలీ అంటున్నారు. కోళ్లకు ప్రధాన దాణా సోయాబీన్ మీల్, జొన్న అయినందు వల్ల వారి అమ్మకాలు కూడా క్షీణించినట్టు ఆయన చెప్పారు. ఈ వదంతులు వ్యాపించిన జనవరి మూడో వారం నుంచి ఫిబ్రవరి మూడో వారం మధ్య కాలంలో జొన్న దరలు కిలో రూ.25 నుంచి రూ.15కి పడిపోయినట్టు ఆయన తెలిపారు.
కోర్కెలివే...
- ప్రభుత్వం తక్షణం సహాయ ప్యాకేజి అందించి ఆదుకోవాలి.
- అదనపు వర్కింగ్ క్యాపిటల్ అందించాలి.
- పౌల్ట్రీ కంపెనీల రుణాల చెల్లింపులు 90 రోజులకు దాటి బకాయి పడినా వాటిని ఎన్ పీఏలుగా ప్రకటించకూడదు.
- ప్రస్తుత కాలపరిమితి రుణాల చెల్లింపులకు ఏడాది గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి.
- పౌల్ర్టీ రంగానికి ఇచ్చిన రుణాలపై 5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలి.
- పౌల్ర్టీ రంగానికి కిలో రూ.10 సబ్సిడీ రేటుపై ప్రభుత్వ నిల్వల నుంచి కనీసం 30 లక్షల టన్నుల గోధుమ, బియ్యం విడుదల చేయాలి.
No comments:
Post a Comment