- కరోనా మహమ్మారి దెబ్బకు వారంలోనే రెండు భారీ పతనాలు నమోదు
- మార్చి 12న 2919 పాయింట్లు, 10న 1941 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- రెండు సెషన్లలోనూ రూ.19 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
కోవిడ్-19ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించడం స్టాక్ మార్కెట్లలో భారీ ప్రకంపనలు సృష్టించింది. కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా 107 దేశాలకు విస్తరించగా 4200 వందల మంది ప్రాణాలు కోల్పోయారు.1,17,330 మందికి కరోనా సోకింది. దీనికి తోడు కోవిడ్-19ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించడం మార్కెట్లలో కల్లోలాన్ని పతాక స్థాయికి చేర్చింది. ఇన్వెస్టర్లు భయోత్పాతంతో సాగించిన భారీ అమ్మకాల ప్రభావానికి స్టాక్ ఇండెక్స్ లు చారిత్రక మహాపతనాలు నమోదు చేశాయి.
గురువారంనాడు (2020 మార్చి, 12) సెన్సెక్స్ భారీ స్థాయిలో 2919 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ చరిత్రలో మహా పతనం ఇదే. రెండు రోజుల క్రితమే సోమవారంనాడు (మార్చి 10) నమోదైన 1941 పాయింట్ల భారీ పతనం రికార్డును ఇది తుడిచిపెట్టేసింది. ఇలా రెండు రోజుల విరామంలో ఏర్పడిన రెండు భారీ పతనాల్లో సెన్సెక్స్ 4860 పాయింట్లు నష్టపోగా ఇన్వెస్టర్ల సంపద రూ.19 లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయింది.
12 లక్షల కోట్లు హాంఫట్
కరోనా స్టాక్ మార్కెట్ లో సృష్టించిన కల్లోలానికి ఇన్వెస్టర్ల సంపద రూ.11,27,160.65 కోట్ల మేరకు తుడిచిపెట్టుకుపోయింది. బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ గురువారం మార్కెట్ ముగిసే సమయానికి రూ.1,25,86,398.07 కోట్లకు దిగజారింది.
17 నెలల కనిష్ఠానికి రూపాయి
కరోనాతో ఏర్పడిన అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్ తో పాటు ఫారెక్స్ మార్కెట్ కూడా ప్రభావితం అయింది. అమెరికన్ డాలర్ మారకంలో రూపాయి 60 పైసలు నష్టపోయి తాజాగా 17 నెలల కనిష్ఠ స్థాయి 74.28కి దిగజారింది. వరుసగా నాలుగో రోజున కూడా విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఈ నెలలో ఇప్పటి వరకు ఎఫ్ పిఐలు 446 కోట్ల డాలర్లు (రూ.33,163 కోట్లు) ఉపసంహరించినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి.
ప్రపంచ మార్కెట్లదీ అదే దారి
కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యూరప్ నుంచి అమెరికాకు ప్రయాణాలను నెల రోజుల పాటు నిషేధించడం, క్రూడాయిల్ ధరల భారీ పతనం ప్రభావంతో ప్రపంచ మార్కెట్లన్నీ చారిత్రక పతనాలు నమోదు చేశాయి. ప్రపంచం మరోసారి తిరోగమనంలోకి పోతుందన్న భయాలు ఇన్వెస్టర్లు తెగబడి అమ్మకాలు సాగించడానికి కారణమయింది. సిడ్నీ మార్కెట్ 7.4% పతనం నమోదు చేసింది. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో ఏర్పడిన భారీ పతనం తర్వాత నమోదైన మరో భారీ పతనం ఇదే.
- టోక్యో మార్కెట్ 4.4 శాతం నష్టపోయింది. దీంతో ఇటీవల గరిష్ఠ స్థాయిల నుంచి 20 శాతం పతనం పూర్తి కావడంతో ఆ మార్కెట్ బేర్ దశలోకి పడిపోయింది.
- చైనాలో పరిస్థితి అదుపులోకి వస్తున్నదన్న వార్తలతో షాంఘై మార్కెట్ అతి తక్కువగా 1.5 శాతం పతనం నమోదు చేసింది.
- ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో దతర్తే కరోనా పరీక్ష చేయించుకుంటారన్న వార్తల ప్రభావంతో మనీలా ఎక్స్ఛేంజి 10 శాతం నష్టపోయింది.
- గల్ఫ్ ప్రాంత సూచీల్లో దుబాయ్ ఎక్స్ఛేంచి 8 శాతం, సౌదీ ఎక్స్ఛేంజి 3 శాతం, కతార్ ఎక్స్ఛేంజి 4.5 శాతం నష్టపోయాయి.
17 నెలల కనిష్ఠానికి రూపాయి
కరోనాతో ఏర్పడిన అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్ తో పాటు ఫారెక్స్ మార్కెట్ కూడా ప్రభావితం అయింది. అమెరికన్ డాలర్ మారకంలో రూపాయి 60 పైసలు నష్టపోయి తాజాగా 17 నెలల కనిష్ఠ స్థాయి 74.28కి దిగజారింది. వరుసగా నాలుగో రోజున కూడా విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఈ నెలలో ఇప్పటి వరకు ఎఫ్ పిఐలు 446 కోట్ల డాలర్లు (రూ.33,163 కోట్లు) ఉపసంహరించినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి.
---------------------------------
బేర్ మార్కెట్ అంటే...
అడ్డూ ఆపూ లేకుండా నిరాటంకంగా అమ్మకాలు సాగిన స్థితిని బేర్ మార్కెట్ గా వ్యవహరిస్తారు. ఏదైనా ఒక షేరు లేదా ఇండెక్స్ ఇటీవల ట్రేడయిన గరిష్ఠ స్థాయి నుంచి 20 శాతం పతనమైతే అది బేర్ మార్కెట్ అని నిర్వచించారు. ఈ నిర్వచనం ప్రకారం 2020 మార్చి 12వ తేదీన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి ఇండెక్స్ నిఫ్టీ బేర్ దశలోకి జారుకోగా సెన్సెక్స్ బేర్ స్థితికి స్వల్పదూరంలో ఉంది. జనవరిలో నమోదైన గరిష్ఠ స్థాయిల నుంచి స్టాక్ ఇండెక్స్ లు 20 శాతం పతనమయ్యాయి. జనవరి 14వ తేదీన జీవిత కాల గరిష్ఠ స్థాయిలను నమోదు చేసిన ఇండెక్స్ లు గురువారం నాటికి రెండున్నర సంవత్సరాల కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి.
బేర్ మార్కెట్ల చరిత్ర ఇదీ...
చరిత్రలో ఇప్పటికి పలు బేర్ మార్కెట్లు వచ్చాయి. ప్రతీ సందర్భంలోనూ బేర్ మార్కెట్ ఏర్పడడానికి ఒక్కో కారణం ఉంది. 1980 దశకంలో బేర్ మార్కెట్ కు ద్రవ్యోల్బణం పెరుగుదల, అధిక వడ్డీరేట్లు కారణం. అలాగే 2000 సంవత్సరంలో బేర్ మార్కెట్ కు టెక్ బబుల్ కారణం కాగా 2008లో బేర్ మార్కెట్ కు అమెరికాలో హౌసింగ్, సబ్ ప్రైమ్ సంక్షోభం కారణమయింది. 2020లో వాణిజ్య యుద్దం, చమురు యుద్ధంతో మార్కెట్ తీవ్ర ఆటుపోట్లలో నడుస్తున్న తరుణంలో పేట్రేగిన కరోనా వైరస్ పతనాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అమెరికా మార్కెట్ సహా పలు మార్కెట్లు బేర్ గుప్పిట్లోకి ప్రవేశించాయి.
----------------------------------
మార్చి 31 వరకు ఢిల్లీలో సెలవులు
కరోనా మహమ్మారిని మరింతగా వ్యాపించకుండా అరికట్టే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం మార్చి 31 వరకు పాఠశాలలు, కళాశాలలన్నింటికీ సెలవు ప్రకటించింది. అలాగే సినిమా హాళ్లు కూడా మార్చి 31 వరకు మూసి ఉంటాయి.
No comments:
Post a Comment