Wednesday, March 18, 2020

క‌రోనా క‌ల్లోల క‌డ‌లి

2 వారాలు-4 సెష‌న్ల‌లో క‌నివిని ఎరుగ‌ని ప‌త‌నాలు
చారిత్ర‌క క‌నిష్ఠ స్థాయిల‌కు ఇండెక్స్ లు


క‌రోనా ప్ర‌భావానికి స్టాక్ మార్కెట్ల‌లో క‌ల్లోలం య‌థేచ్ఛ‌గా కొన‌సాగుతూనే ఉంది. ఏ క్ష‌ణాన ఏమౌతుందో అన్న భ‌యాల‌తో స‌గ‌టు ఇన్వెస్ట‌ర్టు తెగ‌బ‌డి అమ్మ‌కాలు సాగిస్తున్నారు. ఫ‌లితంగా ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ కుప్ప‌కూలుతున్నాయి. భార‌త్ లో దీర్ఘ‌కాలం పాటు ఎదుర‌నేదే లేద‌న్న‌ట్టు క‌దం తొక్కిన బుల్స్ క‌రో్నా దాడికి కుదేలైపోయాయి. కోలుకోలేని విధంగా బ‌క్క‌చిక్కిపోయి స‌రైన ఆస‌రా కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్నాయి. భార‌త స్టాక్ మార్కెట్ ఈ వారంలో వ‌రుస‌గా రెండో రోజు భారీ న‌ష్టాల‌ను న‌మోదు చేసింది. మంగ‌ళ‌వారం ప్రారంభంలో మార్కెట్ల‌లో రిక‌వ‌రీ ఏర్ప‌డిన‌ట్టు సంకేతాలు క‌నిపించినా మ‌ధ్యాహ్నానికి అవి ఆవిరైపోయాయి. చివ‌రిలో భారీగా సాగిన అమ్మ‌కాల జోరుతో సెన్సెక్స్ వ‌రుస‌గా రెండో రోజున కూడా 811 పాయింట్ల మేర‌కు న‌ష్ట‌పోయింది. సెన్సెక్స్ 30579.09 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 230.35 పాయింట్ల న‌ష్టంతో మాన‌సిక అవ‌ధి 9000 క‌న్నా దిగువ‌న 8967.05 వ‌ద్ద ముగిసింది. దీంతో సోమ‌, మంగ‌ళ‌వారాల్లో ఏర్ప‌డిన న‌ష్టాల‌తో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.9.74 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు (సోమ‌వారం రూ.7.62 ల‌క్ష‌ల కోట్లు)  క్షీణించి
 రూ.1,19,52,066.11 కోట్ల‌కు చేరింది.


ఇన్వెస్ట‌ర్ల సంప‌ద న‌ష్టం రూ.25 ల‌క్ష‌ల కో్ట్లు
గ‌త సోమ‌, గురు వారాలు (2020 మార్చి 9, 12 తేదీలు), ఈ వారంలో సోమ‌, మంగ‌ళ‌వారాలు (తేదీలు 16, 17) క‌లిపి నాలుగు రోజుల్లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద భారీ స్థాయిలో రూ.25 ల‌క్ష‌ల కోట్లు ప‌త‌న‌మై రూ.1,19,52,066.11 కోట్ల‌కు ప‌డిపోయింది. నాలుగు సెష‌న్ల‌లో సెన్సెక్స్ న‌ష్టం 8385 పాయింట్లు కాగా నిఫ్టీ న‌ష్టం  2395 పాయింట్లు. 

ఇండెక్స్ ల న‌ష్టాలిలా ఉన్నాయి...
                   సెన్సెక్స్     నిఫ్టీ        సంప‌ద న‌ష్టం

మార్చి   9     1942        538        రూ. 7.00 ల‌క్ష‌ల కోట్లు      
మార్చి 12     2919        868        రూ.11.28 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 16     2713        758        రూ. 7.62 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 17       811         231        రూ. 2.12 ల‌క్ష‌ల కోట్లు


ప్ర‌పంచ మార్కెట్ల‌లోనూ అదే తీరు..
ఆసియా అంత‌టా స్టాక్ మార్కెట్లు వ‌రుస‌గా భారీ న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. షాంఘై, సియోల్ మార్కెట్లు న‌ష్టాల్లో ముగియ‌గా హాంకాంగ్‌, టోక్యో మార్కెట్లు మాత్రం స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. యూర‌ప్ మార్కెట్లు 3 శాతం న‌ష్టాల‌తో న‌డిచాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధ‌ర బ్యారెల్ కు 29.73 డాల‌ర్ల‌కు ప‌డిపోయింది.


క‌రోనా ఎఫెక్ట్...
భార‌త్ లో మూడో క‌రోనా మ‌ర‌ణం : క‌రోనా బారిన ప‌డిన వారిలో భార‌త్ లో మ‌రొక‌రు మ‌ర‌ణించ‌డంతో మ‌ర‌ణాల సంఖ్య మూడుకి పెరిగింది. అలాగే క‌రోనా వ్యాధి సోకిన‌ట్టుగా అనుమానిస్తున్న లేదా నిర్ధార‌ణ అయిన కేసుల సంఖ్య కూడా 125కి చేరుకుంది. మ‌రోప‌క్క  ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోవిడ్‌-19 ఏడు వేల మందిని బ‌లి తీసుకోగా బాధితుల సంఖ్య 1.75 ల‌క్ష‌ల‌కు చేరింది.
ప్లాట్ ఫారం టికెట్‌ ధ‌ర భారీగా పెంపు :  దేశ‌వ్యాప్తంగా ప్ర‌యాణికుల ర‌ద్దీ అధికంగా ఉండే250 ప్ర‌ధాన రైల్వే స్టేష‌న్ల‌లో ప్లాట్ ఫారం టికెట్ ధ‌ర రూ.10 నుంచి రూ.50కి పెంచారు. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో భాగంగా భారీ స‌మూహాలు గుమిగూడ‌డాన్ని నివారించేందుకు ఈ చ‌ర్య తీసుకున్నారు. ఇది మార్చి 18 నుంచి త‌దుప‌రి ఉత్త‌ర్వులు వెలుప‌డే వ‌ర‌కు అమ‌లులో ఉంటుంది. ఈ స్టేష‌న్ల జాబితాలో సికింద్రాబాద్ కూడా ఉంది.
రాజ్ ఘాట్ మూసివేత :  న్యూఢిల్లీలో అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు నిత్యం సంద‌ర్శించే గాంధీ మ‌హాత్ముని స్మార‌కం రాజ్ ఘాట్ ను త‌దుప‌రి ఉత్త‌ర్వులు వెలువ‌డే వ‌ర‌కు సంద‌ర్శ‌కుల‌కు మూసివేస్తున్నారు. 
తాజ్ మ‌హ‌ల్ మూసివేత :  చారిత్ర‌క ప్రేమ చిహ్నం తాజ్ మ‌హ‌ల్ కు సంద‌ర్శ‌కుల‌ను అనుమ‌తించ‌రాద‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. క‌రోనా అదుపులో భాగంగా ఈ చ‌ర్య తీసుకుంది. 
పెరిగిన డిజిట‌ల్ పేమెంట్లు : క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో భాగంగా ప్ర‌జ‌లు డిజిట‌ల్ పేమెంట్ సాధ‌నాలు వినియోగించ‌డాన్ని ప్రోత్స‌హించాల‌న్న ఆర్‌బీఐ అడ్వైజరీ అనంత‌రం డిజిట‌ల్ పేమెంట్ల విభాగంలోని కంపెనీల‌కు కొత్త ఉత్తేజం ఏర్ప‌డింది. నెఫ్ట్, ఐఎంపిఎస్‌, యూపిఐ, భార‌త్ బిల్ పే వంటి మాధ్య‌మాల్లో చెల్లింపులు కూడా పెరిగాయి.

No comments:

Post a Comment

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...