Monday, March 16, 2020

మార్కెట్లు కల్లోలితం 

మార్కెట్ రివ్యూ 

ప్ర‌పంచాన్ని చుట్టుముడుతున్న కోవిడ్‌-19

క‌రోనా (కోవిడ్‌-19) ప్ర‌భావానికి ప్ర‌పంచం యావ‌త్తు అత‌లాకుత‌లం అయిపోతోంది. దీన్ని దీటుగా ఎదుర్కోవాలంటే ప్ర‌పంచం యావ‌త్తు ఒక‌టిగా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంది. ఇందుకు సంఘ‌టిత చ‌ర్య‌లు అత్యంత కీల‌కం. ఆ దిశ‌గా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కీల‌క‌మైన ప్ర‌తిపాద‌న ఒక‌టి చేశారు. సార్క్ దేశాల‌న్నీ క‌లిసి ఒక అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు చేసుకోవాల‌న్న‌ది ఆయ‌న ప్ర‌తిపాద‌న‌. ఆ నిధికి భార‌త్ ప్రాథ‌మికంగా కోటి డాల‌ర్లు (రూ.72 కోట్లు) త‌న వాటాగా అందిస్తుంద‌ని కూడా ఆయ‌న చెప్పారు. సార్క్ స‌భ్య‌దేశాల అగ్ర‌నేత‌ల‌తో ఆయ‌న వీడియో  కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఆ కాన్ఫ‌రెన్స్ లో శ్రీ‌లంక అధ్య‌క్షుడు గొటాబ‌యా రాజ‌ప‌క్సా, మాల్దీవుల అధ్య‌క్షుడు మ‌హ‌మ్మ‌ద్ సోలిహ్‌, నేపాల్ ప్ర‌ధాని కెపి శ‌ర్మ సోలి, భూటాన్ ప్ర‌ధాని లోట్సే షెరింగ్‌, బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా, ఆఫ్గ‌న్ అధ్య‌క్షుడు అష్రాఫ్ ఘ‌ని, పాక్ ప్ర‌ధాని ప్ర‌త్యేక ప్ర‌తినిధి జాఫ‌ర్ మీర్జా పాల్గొన్నారు. అగ్ర‌రాజ్యం అమెరికాతో పాటు జి-7 సంస‌న్న దేశాల కూట‌మి కూడా చేయి క‌లిపి ఇలాంటి గ్లోబ‌ల్  నిధి ఒక‌టి ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల ప్ర‌భావం మ‌రింత విస్తృతంగా, అధికంగా ఉంటుంది.

ఈక్విటీ మార్కెట్లలో భారీ విధ్వంసం 
కోవిడ్‌-19 ప్ర‌భావానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు భారీ క‌ల్లోలంలో చిక్కుకున్నాయి. గ‌త కొంత కాలంగా బుల్స్ చిందుల‌ను చ‌వి చూసిన భార‌త మార్కెట్ కూడా ఈ ప్ర‌భావానికి అతీతం కాలేదు. ఇన్వెస్ట‌ర్లు తెగ‌బ‌డి అమ్మ‌కాలు సాగిస్తున్నారు. దీని ప్ర‌భావం వ‌ల్ల గ‌త వారంలో కేవ‌లం రెండే రెండు రోజుల్లో భారీ విధ్వంసం జ‌రిగింది. మంగ‌ళ, గురు (2020 మార్చి 9, 11 తేదీ లు )  వారాల్లో కేవ‌లం 48 గంట‌ల్లో జ‌రిగిన క‌ల్లోలంలో భార‌త స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు సెన్సెక్స్ 3473 పాయింట్లు (9.24%), నిఫ్టీ 1034 పాయింట్లు (9.41%) న‌ష్ట‌పోయాయి. దీంతో ఒక్క వారంలోనే ఇన్వెస్ట‌ర్ల సంప‌ద 15 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు తుడిచిపెట్టుకుపోయింది. తాజా స‌మాచారం ప్ర‌కారం (15వ తేదీ) దేశంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 108కి చేర‌గా ఒక్క మ‌హారాష్ట్రలోనే 32 కేసులు న‌మోద‌య్యాయి.

ట్రేడింగ్ విరామం
శుక్ర‌వారంనాడు కూడా భారీ స్థాయిలో ఆటుపోట్లు త‌లెత్తి సూచీలు 10 శాతానికి పైగా న‌ష్ట‌పోవ‌డంతో స్వ‌ల్ప స‌మ‌యం పాటు స‌ర్క్యూట్ బ్రేక‌ర్లు యాక్టివేట్ చేసి ట్రేడింగ్ నిలిపివేయాల్సి వ‌చ్చింది. గ‌త 12 సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌లో ట్రేడింగ్ నిలిపివేయ‌డం ఇదే ప్ర‌థ‌మం. ఇన్వెస్ట‌ర్లు తెగ‌బ‌డి అమ్మ‌కాలు సాగించి భారీ స్థాయిలో న‌ష్టాలు మూట‌గ‌ట్టుకోవ‌ల‌సిన ప‌రిస్థితిని త‌ప్పించ‌డానికి ఈ స‌ర్క్యూట్ బ్రేక‌ర్లు ఉప‌యోగిస్తారు.

గ‌త వారంలో జ‌రిగిన భారీ విధ్వంసంలో దేశంలో మార్కెట్ విలువ‌లో టాప్ 10 స్థానంలో ఉన్న కంపెనీలు రూ.4,22,393.44 కోట్ల సంప‌ద న‌ష్ట‌పోయాయి. మార్కెట్ కు చోద‌క శ‌క్తులుగా ఉండే టిసిఎస్, ఆర్ఐఎల్ భారీ న‌ష్టాన్ని చ‌వి చూశాయి. న‌ష్టంలో టిసిఎస్ అగ్ర‌గామిగా ఉంది. ఈ కంపెనీ రూ.1,16,549.07 కోట్లు న‌ష్ట‌పోవ‌డంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.6,78,168.49 కోట్ల‌కు దిగ‌జారింది. రూ.1,03,425.15 కోల్పోయిన ఆర్ఐఎల్ రెండో స్థానంలో ఉంది. గ‌త వారం ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ.7,01,693.52 కోట్ల‌కు క్షీణించింది. ఒక ద‌శ‌లో ఈ కంపెనీ 10 వేల కోట్ల రూపాయ‌ల మార్కెట్ విలువ‌ను దాటి భార‌త స్టాక్ మార్కెట్ చ‌రిత్ర‌లో ఒక రికార్డు నెల‌కొల్పింది. వీటితో పాటు ఇన్ఫోసిస్‌, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్‌, హిందుస్తాన్ యునీలీవ‌ర్‌, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, బ‌జాజ్ ఫైనాన్స్, భార‌తి ఎయిర్ టెల్‌, హెచ్ డిఎఫ్ సి ఉన్నాయి. ఇప్ప‌టికీ ఆర్ఐఎల్ దేశంలో మార్కెట్ విలువ‌లో అగ్ర‌గామి కంపెనీగా కొన‌సాగుతోంది.

మ‌రి కొంత కాలం ప‌రిస్థితి ఇంతేనా...?
ఈ వారంలో స్టాక్ మార్కెట్ మ‌రింత అధికంగా ఆటుపోట్లు ఎదుర్కొన‌డం లేదా రిలీఫ్ ర్యాలీ సాధించే ఆస్కారం ఉన్న‌ద‌ని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇన్వెస్ట‌ర్లు మ‌రి కొంత కాలం క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నిశితంగా గ‌మనిస్తూ ఉండ‌డంతో పాటు కేంద్రీయ బ్యాంకులు, ప్ర‌భుత్వాలు ఏవైనా ఉద్దీప‌న‌లు ప్ర‌క‌టిస్తాయా అని నిశితంగా దృష్టి సారిస్తార‌ని వారంటున్నారు. మార్కెట్ లో స్వ‌ల్ప రిలీఫ్ ర్యాలీలు వ‌చ్చినా అవి స్వ‌ల్ప‌కాలిక‌మే అవుతాయ‌న్న‌ది వారి అభిప్రాయం. 2008 ప్ర‌పంచ ఆర్థిక సంక్షోభం త‌ర్వాత తొలిసారిగా మార్కెట్లు క‌నిష్ఠ స‌ర్క్యూట్ల‌ను తాకాయ‌ని, కాని త్వ‌ర‌లోనే మంచి బౌన్స్ బ్యాక్ ఏర్ప‌డ‌వ‌చ్చున‌ని ఇండియా నివేశ్ ఇన్ స్టిట్యూష‌న‌ల్ ఈక్విటీస్ హెడ్ విన‌య్ పండిట్ అంటున్నారు. 


No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...