Monday, March 23, 2020

చారిత్ర‌క మ‌హాప‌త‌నం

క‌రోనా సునామీ - 8  
భార‌త స్టాక్ మార్కెట్ మ‌రో మ‌హాప‌త‌నాన్ని న‌మోదు చేసింది. ఇది ఇంత‌వ‌ర‌కు భార‌త మార్కెట్ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ప‌త‌నం. కోవిడ్‌-19 ప్ర‌భావానికి 2020 మార్చి 12వ తేదీ న‌మోదైన భారీ ప‌త‌నం ఈ దెబ్బ‌తో రెండో స్థానానికి దిగ‌జారిపోయింది. కోవిడ్‌-19ని అదుపు చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా భార‌త్ స‌హా భిన్న దేశాలు లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డం, ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ఇప్ప‌టికే తిరోగ‌మ‌నంలోకి జారుకోవ‌డం మార్కెట్ వ‌ర్గాల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాయి. దీనికి తోడు ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ప్రారంభం కాబోయే కొత్త ఆర్థిక సంవ‌త్స‌రానికి కూడా ప‌లు అంత‌ర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు వృద్ధిరేటు అంచ‌నాను గ‌ణ‌నీయంగా కుదించ‌డం ప‌రిస్థితిని మ‌రింత తీవ్రం చేసింది. బిఎస్ఇ సెన్సెక్స్ 3935 పాయింట్లు (13.15%) న‌ష్ట‌పోయి 25981.24 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ సూచీ నిఫ్టీ 1135.20 పాయింట్లు (12.98%) దిగ‌జారి 7610.25 వ‌ద్ద ముగిసింది. వైర‌స్ విస్త‌ర‌ణ విష‌యంలో తీవ్ర అనిశ్చితి నెల‌కొన‌డంతో జ‌రిగిన ఈ క‌ల్లోలం తీవ్ర‌త చాలా అధికంగా ఉంది. ఆసియా, యూరోపియ‌న్ మార్కెట్ల‌లో ఏర్ప‌డిన ప‌త‌నాల క‌న్నా భార‌త మార్కెట్ ప‌త‌నంలో శాతం అధికంగా ఉంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 25880.83 పాయింట్ల క‌నిష్ఠ స్థాయిని తాకింది.

ఉద‌యం 45 నిముషాలు ట్రేడింగ్ హాల్ట్

సోమ‌వారం ఉద‌యం ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 10 శాతానికి పైగా న‌ష్ట‌పోయాయి. దీంతో స‌ర్క్యూట్ బ్రేక‌ర్లు అప్లై చేయ‌క త‌ప్ప‌లేదు. ఫ‌లితంగా 45 నిముషాల పాటు ట్రేడింగ్ నిలిచిపోయింది. విరామం త‌ర్వాత మార్కెట్ తిరిగి తెరుచుకున్నా మార్కెట్ ఎక్క‌డా కోలుకునే సూచ‌న ఇవ్వ‌లేదు.

ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.14.22 ల‌క్ష‌ల కోట్లు ఫ‌ట్
ఈ మ‌హాప‌త‌నంలో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.14.22 ల‌క్ష‌ల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఫ‌లితంగా బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.1,01,86,936.28 కోట్ల‌కు దిగ‌జారింది.
- సెన్సెక్స్ లో న‌ష్ట‌పోయిన కంపెనీల్లో యాక్సిస్ బ్యాంక్ 28 శాతం న‌ష్టంతో అగ్ర‌గామిగా నిలిచింది. బ‌జాజ్ ఫైనాన్స్, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, మారుతి, ఎల్ అండ్ టి అన్నీ భారీ న‌ష్టాలు న‌మోదు చేశాయి.

రూపాయి చారిత్ర‌క ప‌త‌నం
ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి కూడా చారిత్ర‌క ప‌త‌నం న‌మోదు చేసింది. ఒక్క‌రోజులోనే అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో రూపాయి 102 పైస‌లు దిగ‌జారి 76.22 వ‌ద్ద ముగిసింది. రూపాయి చ‌రిత్ర‌లో ఇదే అతి పెద్ద ప‌త‌నం. ఇంట్రాడేలో రూపాయి గ‌రిష్ఠ స్థాయి 75.86, క‌నిష్ఠ స్థాయి 76.30 న‌మోదు చేసింది. 

7 సెష‌న్ల‌లో ఇండెక్స్ ల న‌ష్టాలిలా ఉన్నాయి...
(గ‌త రెండు వారాల్లో 6 రోజులు + ఈ వారంలో 1)
 ------------------------------------------------------------------------- 
                   సెన్సెక్స్        నిఫ్టీ        సంప‌ద న‌ష్టం
-------------------------------------------------------------------------   

మార్చి   9       1942         538         రూ. 7.00 ల‌క్ష‌ల కోట్లు 
మార్చి 12       2919        868         రూ.11.28 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 16       2713        758         రూ. 7.62 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 17         811         231        రూ. 2.12 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 18       1709         495         రూ. 5.98 ల‌క్ష‌ల కోట్లు 
 మార్చి 19         581        206        రూ. 3.74 ల‌క్ష‌ల కోట్లు
మార్చి  23       3935        1135        రూ.14.22 ల‌క్ష‌ల కోట్లు       
మొత్తం నష్టం  14039       4025       రూ.71.47 ల‌క్ష‌ల కోట్లు   
------------------------------------------------------------------------- 

No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...