Tuesday, March 3, 2020

25 ఫార్మా ఉత్ప‌త్తులు, ముడిస‌ర‌కుపై ఎగుమ‌తి నిషేధం

దేశంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం నివారించేందుకు ప్ర‌భుత్వం త‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ఇందులో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం అత్యున్న‌త స‌మావేశం నిర్వ‌హించి ప‌రిస్థితిని స‌మీక్షించారు. మ‌రోప‌క్క భార‌త ప్ర‌భుత్వం 25 ర‌కాల ఔష‌ధ ఉత్ప‌త్తులు, ముడిస‌ర‌కు ఎగుమ‌తుల‌పై నిషేధం విధించింది. కోవిడ్-19 (క‌రోనా) తీవ్ర‌రూపం దాల్చి ఒక అంటువ్యాధిగా ప్ర‌బ‌ల‌డంతో దేశంలో ఔష‌ధాల‌కు కొర‌త లేకుండా నివారించ‌డం ఈ చ‌ర్య ప్ర‌ధాన ల‌క్ష్యం. పారాసిట‌మాల్ వంటి సాధార‌ణ ఔష‌ధాలు, ఫార్మా ప‌రిశ్ర‌మ‌లో ఉప‌యోగించే 25 ర‌కాల ముడి ప‌దార్థాలు, వాటితో త‌యారుచేసే ఔష‌ధాలు ఈ ఎగుమ‌తుల  నిషేధం జాబితాలో ఉన్నాయి. ఎగుమ‌తి నిషేధం విధించిన వాటిలొ బాక్టీరియా, ఇత‌ర ఇన్ఫెక్ష‌న్లను అదుపు చేయ‌డానికి ఉప‌యోగించే యాంటి బ‌యోటెక్ మెట్రోనిడాజోల్‌, బి1, బి2 విట‌మిన్లు ఉన్నాయి. విదేశీ వాణిజ్య డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యం ఈ ఉత్త‌ర్వులు జారీ చేసింది.ఎగుమ‌తి నిషేధం విధించిన వాటిలో టినిడాజోల్‌, అసిక్లోవిర్‌, ప్రోజెస్టెరోన్‌, క్లోరంఫెనికాల్‌, ఆర్నిడాజోల్ తో పాటు క్లోరంఫెనికాల్ ఫార్ములేష‌న్లు, క్లిండామైసిన్ సాల్ట్, నియోమైసిన్ కూడా ఉన్నాయి.   
జ‌న‌రిక్స్ త‌యారీలో అగ్ర‌గామి
ప్ర‌పంచంలో జ‌న‌రిక్ ఔష‌ధాలు ఉత్ప‌త్తి చేసే అతి పెద్ద దేశం ఇండియా. ప్ర‌పంచంలో స‌ర‌ఫ‌రా అయ్యే జ‌న‌రిక్ ఔష‌ధాల్లో 20 శాతం వాటా భార‌త్ దే.అయితే మ‌న ఫార్మా కంపెనీలు మాత్రం జ‌న‌రిక్ ఔష‌ధాల‌ను ఉత్ప‌త్తి చేయ‌డానికి ఉప‌యోగించే కొన్ని ర‌కాలైన ర‌సాయ‌నాలు (ఎపిఐ) చైనా నుంచి అధిక ప‌రిమాణంలో దిగుమ‌తి చేసుకుంటున్నాయి. క‌రోనా సృష్టించిన క‌ల్లోలంతో చైనాలో ఫ్యాక్ట‌రీలు మూత‌ప‌డిన కార‌ణంగా ఎపిఐ స‌ర‌ఫ‌రాల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. భార‌త‌దేశం ప్ర‌తీ ఏడాది 350 కోట్ల డాల‌ర్ల విలువ గ‌ల ఎపిఐలు దిగుమ‌తి చేసుకుంటుండ‌గా వాటిలో 250 కోట్ల డాల‌ర్ల విలువ గ‌ల ఎపిఐలు చైనా నుంచే స‌ర‌ఫ‌రా అవుతున్నాయి. కాగా గ‌త ఏడాది భార‌త్ 22.5 కోట్ల డాల‌ర్ల విలువ గ‌ల ఎపిఐల‌ను ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి చేసింది. 
----------------------------------------  

ప్ర‌ధాని స‌మీక్ష‌
క‌రోనా వైర‌స్ దాడిని త‌ట్టుకునేందుకు ఎంత మేర‌కు స‌మాయ‌త్తంగా ఉన్నార‌న్న విష‌యం ప్ర‌ధాని అత్యున్న‌త స్థాయి స‌మావేశంలో స‌మీక్షించారు. క‌రోనా దాడిని త‌ట్టుకునేందుకు ప్ర‌భుత్వ యంత్రాంగం ఎంత మేర‌కు స‌మాయ‌త్తంగా ఉంది అనే అంశంపై విస్తృత స్థాయి స‌మీక్ష జ‌రిగింది. భిన్న మంత్రిత్వ శాఖ‌లు, రాష్ర్టాలు కూడా విదేశాల నుంచి భార‌త్ కు వ‌స్తున్న వారిని పూర్తి స్థాయిలో ప‌రీక్షించి అవ‌స‌ర‌మైతే స‌త్వ‌ర వైద్య స‌హాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి అని ఆయ‌న స‌మావేశం అనంత‌రం ట్వీట్ చేశారు.  చైనాలో డిసెంబ‌ర్ చివ‌రిలో క‌రోనా వైర‌స్ మొద‌టి కేసు బ‌య‌ట‌ప‌డిన నాటి నుంచి ఇప్ప‌టికి ప్ర‌పంచవ్యాప్తంగా మూడు వేల మందికి పైగా మృత్యువాత ప‌డ్డారు. 

మ‌రో ఆరుగురికి క‌రోనా

ఆగ్రాలో జ‌రిగిన శాంపిల్ ప‌రీక్ష‌ల్లో మ‌రో ఆరు కొత్త కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. వారంద‌రిలోనూ వైర‌స్ తీవ్ర ప‌రిమాణంలో ఉన్న‌ట్టు గుర్తించార‌ని తెలిపింది. ఢిల్లీలో మ‌యూరీ విహార్ నివాసి అయిన‌ క‌రోనా వైర‌స్ సోకిన 45 సంవత్స‌రాల వ్య‌క్తితో స‌న్నిహిత సంబంధం ఉన్న వారే ఆ ఆరుగురు అని, వారిలో అత‌ని కుటుంబ స‌భ్యులు కూడా ఉన్నార‌ని ప్ర‌క‌టించారు. వారంద‌రూ ఆగ్రా సంద‌ర్శించిన స‌మ‌యంలో ఈ ప‌రీక్ష‌లు జ‌రిగాయి. వారంద‌రినీ ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్ జంగ్ ఆస్ప‌త్రిలో ప్ర‌త్యేక వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. వారి శాంపిల్స్ ను పూణెలోని ఎన్ఐవికి ప‌రీక్ష‌కు పంచారు. 
---------------------------------------- 

క‌రోనాపై స‌ర్వ‌త్రా అప్ర‌మ‌త్తం  
పౌర విమాన‌యాన శాఖ క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నిరోధించేందుకు విమానాశ్ర‌యాలు ఎంత‌వ‌ర‌కు స‌మాయ‌త్తంగా ఉన్న‌దీ తెలుసుకునేందుకు విమానాశ్ర‌యాల అధికారుల‌తో ఒక స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించింది. పౌర విమాన‌యాన మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి ప్ర‌దీప్ సింగ్ ఖ‌రోలా, ఎఎఐ చైర్మ‌న్ అర్వింద్ సింగ్ అన్ని విమానాశ్ర‌యాల ఉన్న‌తాధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. కోవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు అధికారుల‌ను ఆదేశించారు. విమానాశ్ర‌యాల‌న్నీ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేష‌న్ విడుద‌ల చేసిన ప్ర‌యాణ నియ‌మావ‌ళిని తుచ త‌ప్ప‌కుండా ఆచ‌రించాల‌ని సూచించారు. కాగా ఇట‌లీ, ఇరాన్ దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులంద‌రినీ థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ చేయాల‌ని పౌర విమాన‌యాన మంత్రిత్వ శాఖ ఇప్ప‌టికే ఆదేశించింది. చైనా, హాంకాంగ్‌, జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా, థాయ్ లాండ్‌, సింగ‌పూర్‌, నేపాల్‌, ఇండోనీసియా, వియ‌త్నాం, మ‌లేసియా నుంచి వ‌స్తున్న ప్ర‌యాణికుల‌ను ఇప్ప‌టికే స్ర్కీన్ చేస్తున్నారు. ఇట‌లీ, ఇరాన్‌, ద‌క్షిణ కొరియా, జ‌పాన్ నుంచి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌కు మార్చి మూడో తేదీకి ముందు జారీ చేసిన రెగ్యుల‌ర్ వీసాలు, ఇ వీసాల‌న్నింటినీ ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది.

 హోట‌ల్ సిబ్బంది స్క్రీనింగ్‌

క‌రోనా వైర‌స్ సోకిన ఒక వ్య‌క్తి గ‌త నెల 28న రెస్టారెంట్ లో ఆహారం తీసుకున్నాడ‌న్న విష‌యం బ‌య‌ట‌ప‌డ‌డంతో ఢిల్లీలోని హ‌య‌త్ రీజెన్సీ హోట‌ల్ త‌మ లా పియాజా రెస్టారెంట్ సిబ్బంది అంద‌రినీ 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ (ఎవ‌రికి వారే ప‌రీక్ష‌లు చేసుకోవ‌డం) చేసుకోవాల‌ని ఆదేశించింది. 

No comments:

Post a Comment

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...