Monday, March 2, 2020

యుపిఐ లావాదేవీల స‌రికొత్త రికార్డు

దేశంలో డిజిట‌ల్ చెల్లింపుల‌కు 2020 ఫిబ్ర‌వ‌రిలో స‌రికొత్త ఉత్తేజం ల‌భించింది. యుపిఐ ద్వారా నిర్వ‌హించిన చెల్లింపులు విలువ‌ప‌రంగాను, ప‌రిమాణంప‌రంగాను కొత్త గ‌రిష్ఠ స్థాయిలు న‌మోదు చేశాయి. దేశంలోని నాలుగు జోన్ల‌లోనూ యుపిఐ చైత‌న్యం 60 శాతానికి చేరిన‌ట్టు 12,800 మంది ప్ర‌జ‌ల‌పై నిర్వ‌హించిన అధ్య‌య‌నంలో తేలింది. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల‌తో పోల్చితే  ఐఎంపిఎస్‌, యుపిఐ లావాదేవీల ప‌రిమాణంలో భారీ వ్య‌త్యాసాలున్న‌ట్టు వ‌ర‌ల్డ్ లైన్ విడుద‌ల ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్ నివేదిక తెలిపింది. దేశంలో డిజిట‌ల్ చెల్లింపుల ఉత్ప‌త్తుల‌ను వ్య‌క్తులు-వ్యాపారుల మ‌ధ్య (పి2ఎం) లావాదేవీల క‌న్నా వ్య‌క్తులు-వ్య‌క్తుల మ‌ధ్య (పి2పి) లావాదేవీల‌కే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. కాగా ఇప్పుడు నెఫ్ట్ 24x7 ప్రాతిప‌దిక‌న అందుబాటులోకి రావ‌డంతో యుపిఐ, ఐఎంపిఎస్ విధానాల్లో చెల్లింపుల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉంటుందో వేచి చూడాల‌ని ఆ నివేదిక తెలిపింది. 

నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా గ‌ణాంకాల ప్ర‌కారం...
- 2020 ఫిబ్ర‌వ‌రి నెల‌లో రూ.2.2 ల‌క్ష‌ల కోట్ల విలువ గ‌ల‌ 132.32 కోట్ల యుపిఐ లావాదేవీలు జ‌రిగాయి.
- 2020 జ‌న‌వ‌రి నెల‌లో న‌మోదైన యుపిఐ లావాదేవీలు రూ.2.16 ల‌క్ష‌ల కోట్ల విలువ గ‌ల 130.5 కోట్లు.
- 2019 అక్టోబ‌రులో తొలిసారిగా యుపిఐ లావాదేవీలు 100 కోట్ల మైలురాయిని అధిగ‌మించాయి. 2016 సంవ‌త్స‌రంలో యుపిఐ ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత చేరిన ప్ర‌ధాన మైలురాయి ఇది.
- ఐఎంపిఎస్ (ఇమ్మీడియేట్ పేమెంట్ స‌ర్వీస్‌) విధానంలో జ‌రిగిన లావాదేవీలు మాత్రం క్షీణించాయి. 2020 ఫిబ్ర‌వ‌రిలో రూ.2.14 ల‌క్ష‌ల కోట్ల విలువ గ‌ల 24.78 కోట్ల లావాదేవీలు న‌మోద‌య్యాయి. జ‌న‌వ‌రిలో న‌మోదైన రికార్డు లావాదేవీల క‌న్నా ఇది త‌క్కువ‌.
- 2020 జ‌న‌వ‌రిలో రూ.2.16 ల‌క్ష‌ల కోట్ల విలువ గ‌ల 25.95 కోట్ల లావాదేవీలు ఐఎంపిఎస్ చ‌రిత్ర‌లో ఒక రికార్డు.
- 2020 జ‌న‌వ‌రిలో రూ.6611.22 కోట్ల విలువ గ‌ల 1.85 కోట్ల భీమ్ లావాదేవీలు న‌మోద‌య్యాయి.

No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...